తెలంగాణలో తదుపరి పీసీసీ చీఫ్ ఎవరు..? అనే దానిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఇప్పటి వరకూ ఆ పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం, పైగా ఇవాళ్టితో పదవీకాలం కూడా ముగియడంతో ఆయన స్థానంలో ఎవరు వస్తారు అనేది అంతు చిక్కడం లేదు. ఐతే.. సీనియర్లు జీవన్ రెడ్డి, మధుయాష్కి గౌడ్, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రేసులో ఉన్నారు. వాస్తవానికి ఈ ముగ్గురు ఇప్పుడు ఎలాంటి పదవుల్లో లేరు. ఎమ్మెల్సీలుగా జీవన్ రెడ్డి, మహేష్ ఉండగా.. మధుయాష్కికి మాత్రం ఏమీ లేదు. దీంతో ఈ ముగ్గురిలో ఎవరిని ఈ పదవి వరిస్తుంది..? అని కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
ఫుల్ ఫోకస్..!
రేవంత్ రెడ్డికి పీసీసీ కట్టబెట్టిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్లిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇంచుమించు జీరోతో మొదలై అధికారం దక్కించుకునే వరకూ వెళ్లింది. రేవంత్ మాట తీరు, నాటి ప్రభుత్వంపై కొట్లాటలు, మొండితనం, యూత్.. మాస్ ఫాలోయింగ్ ఇవన్నీ బాగా కలిసి వచ్చాయి. దీంతో ఆయన పీసీసీ నుంచి సీఎం కాగలిగారు. 2021 జూన్ 27న పీసీసీగా నియమాకమైన రేవంత్ పదవీ కాలం జూన్ 27 ముగిసింది. దీంతో నూతన పీసీసీ నియామకంపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యి.. ఎవరికి ఈ పదవి ఇస్తే న్యాయం చేయగలరు..? సమర్థవంతమైన నాయకుడు ఎవరు..? అని లోతుగా చర్చించనున్నారు. దీనితో పాటు.. సామాజిక సమీకరణాలు, సీనియారిటీ కూడా చూసి అన్నీ సరిగ్గా ఉన్న నేతను పీసీసీ అధ్యక్షుడుగా అధిష్టానం ఎంపిక చేయనుంది.
ఓకే ఒక్కడు..?
ఢిల్లీ వర్గాల సమాచారం మేరకు.. సీనియర్ నేత, కట్టర్ కాంగ్రెస్ లీడర్ జీవన్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడుగా ఎన్నుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ క్రమంలో పీసీసీ చీఫ్ కోసం కొందరు అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో.. ఇంకొందరు ప్రియాంక గాంధీతో.. మరికొందరు కేసీ వేణుగోపాల్, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ద్వారా పైరవీలు మొదలు పెట్టారు. ఐతే సీనియర్ నేత, పైగా ఈ పదవికి అన్ని విధాలుగా అర్హుడు అయిన జీవన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పదవి వరిస్తుందని తెలుస్తోంది. పైగా ఈ మధ్య ఆయన అలక బూనడం, పైగా సీనియర్ ఐనప్పటికీ ఎలాంటి పదవి లేకుండా ఉండటం.. పదేళ్లు అధికారం లేకపోయినా, నాటి బీఆర్ఎస్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, బెదిరించినా భయపడకుండా నిలబడిన నేతగా ఈయనకు మంచి గుర్తింపు ఉంది.. అందుకే ఈయనే పీసీసీకి సరిగ్గా సరిపోతారని అధిష్ఠానం కూడా భావిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.