24 గంటలుగా ఆహా.. ఓహో అన్నారు! వైఎస్ జగన్ ప్రభుత్వంలా కాదు సినిమా అంటే ఎలా ఉంటుందో ఇక చూస్కోండి..! మునుపెన్నడూ లేని విధంగా ఇక టాలీవుడ్ ఉండబోతోందని ఎన్నెన్నో ఎలివేషన్లు.. అబ్బో అవన్నీ ఇక మాటల్లో చెప్పలేం.. రాతల్లో రాయలేం..! తీరా చూస్తే అబ్బే అంత లేదమ్మా అని తేలిపోయింది..! టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు..! అందులోనూ డిప్యూటీ సీఎం..! ఈయన మనిషి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ జనసేనకు చెందిన మనిషే..! ఇంకేముంది సినీ పరిశ్రమలో ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించి.. ఏం కావాలన్నా ఇచ్చేస్తారని ఇండస్ట్రీ ఎంతో ముచ్చట పడుతోంది. అందుకే పవన్ బాధ్యతలు స్వీకరించగానే ప్రత్యేకంగా వెళ్లి టాలీవుడ్ నిర్మాతలు కలిశారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో సినీ రంగం విస్తరణకు ఉన్న అవకాశాలపై నిశితంగా చర్చించారు. దీంతో పాటు సినీ పరిశ్రమ ఇబ్బందులను డిప్యూటీ సీఎంకు నివేదించారు. ఇంతకీ కలిసిన నిర్మాతల్లో ఎవరెవరు ఉన్నారు..? అతికొద్ది మంది మాత్రమే ఎందుకు వెళ్ళారు..? పోయిన వాళ్ళు అంతా ఎవరికి కావలసిన వారు..? ఎవరి ప్రయోజనాల కోసం వెళ్ళారు..? అనేది ఇప్పుడు ఇటు ఇండస్ట్రీలో.. అటు రాజకీయాల్లో బర్నింగ్ టాపిక్ అయ్యింది.
యో.. ఏందబ్బా ఇది..!!
పవన్ కల్యాణ్‌ను కలిసిన వారిని ఒక్కసారి నిశితంగా గమనిస్తే ఒక్కరంటే ఒక్కరూ కొత్త వ్యక్తులు లేరు. కల్యాణ్‌తో సినిమా చేసిన.. చేస్తున్న వాళ్ళు తప్ప మరొకరు లేకపోవడం గమనార్హం. టాలీవుడ్ నుంచి భేటీకి వెళ్ళిన వారిలో అల్లు అరవింద్, సి అశ్వినీదత్, ఏ.ఎం. రత్నం, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), దిల్ రాజు, బోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య , సుప్రియ, ఎన్.వి.ప్రసాద్, బన్నీ వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టి.జి.విశ్వప్రసాద్, వంశీ కృష్ణ ఉన్నారు. అల్లు అరవింద్ (జానీ, జల్సా), అశ్వినీదత్ (బాలు), ఏఎం రత్నం(బంగారం, ఖుషీ, హరిహర వీరమల్లు), దిల్ రాజు (వకీల్ సాబ్), ఎస్. రాధాకృష్ణ (అజ్ఞాతవాసి) బీవిఎస్ఎన్ ప్రసాద్ (అత్తారింటికి దారేది), ఎన్వీ ప్రసాద్ (సుస్వాగతం, అన్నవరం), డీవీవీ దానయ్య (కెమెరామెన్ గంగతో రాంబాబు, ఓజీ), నవీన్ ఎర్నేని మైత్రీ మూవీ మేకర్స్ (ఉస్తాద్ భగత్ సింగ్), టీజీ విశ్వప్రసాద్ (బ్రో), నాగవంశీ (భీమ్లా నాయక్), దగ్గుబాటి సురేష్ బాబు (గోపాల గోపాల) సినిమాలు తీశారు. చూశారుగా.. ఈ నిర్మాతల్లో అందరూ కల్యాణ్‌కు తెలిసిన, సినిమా చేసిన.. చేస్తున్న వారే ఉండటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
ఈ ఇద్దరూ ఎంతో స్పెషల్!!
ఇక ఈ భేటీలో పాల్గొన్న వారిలో యంగ్ నిర్మాతలు సుప్రియ, బన్నీ వాసు ఇద్దరూ సేనానికి స్పెషల్. ఎలాగంటే.. పవన్ హీరోగా పరిచయమైన తొలి చిత్రం అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి చిత్రంలో నటించింది. ఈమె మరెవరో కాదు.. అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ. తొలిరోజుల్లో నటిగా ఉన్న ఈమె.. ఆ తర్వాత నిర్మాతగా మారి ఎన్నో సినిమాలు నిర్మించారు. ఇక బన్నీ వాసు గురుంచి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జనసేన
ప్రచార కమిటీ ఛైర్మన్ పదవిలో ఉన్నారు. వాస్తవానికి ఈయన్ను ఎమ్మెల్యేగా బరిలోకి దించుతారని ప్రచారం జరిగినప్పటికీ కొన్ని రాజకీయ సమీకరణాల దృష్ట్యా అదేమీ జరగలేదు. రానున్న రోజుల్లో పార్టీతో పాటు, ఇండస్ట్రీ పరంగా కీలక స్థానం ఇచ్చినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఎవరూ లేరా ఏంటి..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో అలనాటి తరం నుంచి ఇప్పటి వరకూ ఎంతో మంది సీనియర్లు, జూనియర్లు ఉన్నారు. కానీ వారిని ఎవ్వరూ పట్టించుకోలేదు.. పవన్ దగ్గరికి తీసుకెళ్ళలేదు. కానీ వీళ్ళే కోటరిగా వెళ్లి కలవడంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పోనీ తన దగ్గరికి ఎవరెవరు వస్తున్నారన్నది ఆయనకు తెలుసు కదా..? అంతా మనోళ్లే కదా..? ఇంకా ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు కదా..? అని కనీసం తెలియకపోతే ఎలా..?. అసలు మిగిలిన నిర్మాతలను ఎందుకు పట్టించుకోలేదు..? నా అనుకున్న వాళ్ళకే అదేనబ్బా మనోళ్లకు మాత్రమే అపాయింట్మెంట్ ఉంటుందా..? మిగిలిన వారికి లేదా..? అసలు ప్రవేశం ఉండదా..? అనే దానిపై చర్చ నడుస్తోంది. ఇక ఇదే అంశాన్ని పెన్ చేస్తూ సోషల్ మీడియాలో ఐతే ఒక రేంజిలో తిట్టి పోస్తున్నారు. ఇక పవన్ అంటే గిట్టని ఇండస్ట్రీ మనుషులు, వైసీపీ వాళ్ళు ఐతే అబ్బో ఇక దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి. ఎందబ్బా.. పవన్ ఇలా ఉన్నారు..? పద్ధతి ఏం బాగలేదబ్బా..? ఇలా చేయడం ఎంత వరకు సబబు..? అంటూ తిట్టి పోస్తున్నారు. తొలి భేటీనే ఇలాగా ఉంటే మున్ముందు చాలానే ఉంటాయ్ గనుక.. విమర్శలకు తావు లేకుండా ఇండస్ట్రీలో నటీ నటులు మొదలుకొని.. జూనియర్, సీనియర్ దర్శక నిర్మాతలు అందరినీ సమానంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరీ ముఖ్యంగా.. ఈ ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలిచిన వారిపై రివెంజ్ లాంటివి తీర్చుకోకుండా సినిమా అవకాశాలు, తగిన ప్రాధాన్యత ఇచ్చేలా చూసే బాధ్యత కూడా పవన్ పైన చాలానే ఉందన్న విషయం గుర్తు పెట్టుకోవాలి..!!. ఇక పవన్ దృష్టికి తీసుకెళ్లిన సమస్యలు ఏంటి..? అవన్నీ ఏ మాత్రం.. ఎప్పుడు పరిష్కారం అవుతాయి..? అనేది చూడాలి.