వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంగళూరుకు వెళ్తున్నారు. మూడు రోజుల పులివెందుల పర్యటన ముగించుకున్న ఆయన, సతీమణి భారతితో కలిసి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు బయల్దేరారు. ఒకటి కాదు రెండు కాదు సుమారు పదేళ్ళ తర్వాత తొలిసారి వెళ్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ.. అంతకు మించి హడావుడి నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఐతే బాబోయ్.. ఊహకు అందని పరిణామాలు జరుగుతాయని వైసీపీ కార్యకర్తలు తెగ హడావుడి చేస్తున్నారు. ఇంతకీ బెంగళూరు వేదికగా జగన్ ఏం చేయబోతున్నారు..? ఉన్న పళంగా పులివెందుల నుంచి ఎందుకు వెళ్లాల్సి వస్తోంది..? అనే దానిపై రాజకీయంగా చర్చ జరుగుతోంది.
ఏం నడుస్తోంది..?
రాజకీయాల్లోకి రాక మునుపు బెంగళూరు వేదికగానే జగన్ వ్యాపారాలు నడిపిన సంగతి అందరికీ తెలిసిందే. సుమారు 25 నుంచి 30 ఎకరాల్లో ఎయిర్ పోర్టుకు దగ్గరలో యలహంక ప్యాలెస్ కట్టుకున్నారు. ఇక్కడి నుంచే వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన జగన్.. రాజకీయాల్లోకి వచ్చాక అవన్నీ సతీమణి భారతి అండ్ కో చూసుకుంటున్నారు. పాలిటిక్స్.. పాలిటిక్స్ అని ఏపీకే పరిమితమైన జగన్ అటు వైపు చూడలేదు. సీఎంగా ఉన్నప్పుడు ఎయిర్ పోర్టు వరకూ మాత్రమే వెళ్లిన జగన్.. కుమార్తెలను విమానం ఎక్కించడానికి వెళ్లి సెండాఫ్ ఇచ్చి తిరిగి వచ్చేశారు. ఇక అదలా ఉంచితే.. ఇప్పుడు ఉన్నట్టు ఉండి జగన్ ఎందుకు బెంగళూరు వెళ్ళారు అనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు.
అక్కడ కూడా..?
బెంగళూరులో వ్యాపారాలతో పాటు యలహంక ప్యాలెస్ రూపంలో జగన్ రెడ్డికి చిక్కులు వచ్చాయని.. అందుకే మూడో కంటికి తెలియకుండా వ్యవహారం చక్కదిద్దుకోవడానికి వెళ్తున్నట్లు తెలియవచ్చింది. ఐతే.. వైసీపీ శ్రేణులు మాత్రం చిత్ర విచిత్రాలుగా రచ్చ చేస్తున్నాయి. ఇప్పటి వరకూ ఏపీ.. ఇక బెంగళూరు వేదికగా జగన్ రాజకీయాలు చేస్తారని గొప్పలు చెప్పుకుంటున్న పరిస్థితి. అంతేకాదు ఊహకు అందని పరిణామాలు ఉంటాయని మరికొందరు నేతలు చెబుతున్నారు. మరోవైపు.. ఈ వ్యవహారంపై టీడీపీ, జనసేన శ్రేణులు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నాయి. కాంగ్రెస్ కీలక నేత, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అపాయింట్మెంట్ దొరికిందని.. అందుకే జగన్ బెంగళూరు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్యాలస్ వ్యవహారం, వ్యాపార పరంగా వచ్చిన చిక్కులు అన్నీ డీకేతో చర్చి.. పరిష్కారం కోసం భేటీ అవుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో కలుస్తారని.. ఈవీఎంల విషయంలో అందుకే వ్యతిరేకంగా మాట్లాడి మెప్పు పొందారనే చర్చ కూడా నడుస్తోంది.
షర్మిల గురించేనా..?
డీకే.. వైఎస్ ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు. అందుకే షర్మిల ఆస్తుల పంపకాలు అన్నీ డీకే సమక్షంలో జరుగుతాయని.. ఇవన్నీ అయ్యాక అన్నతో చేతులు కలపడానికి చెల్లి సిద్ధంగా ఉందని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. షర్మిలను పక్కన పెడితే తాను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా సిద్ధం అవుతున్నట్లు మరో చర్చ. ఏదైతేనేం ఇప్పుడు ఎవరినోట చూసిన జగన్ బెంగళూరు ప్యాలస్ గురుంచి మాత్రం వినిపిస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఐతే చెప్పక్కర్లేదు. బాబోయ్ ఇవన్నీ కాదు కాస్త సేద తీరాలని కుటుంబంతో వెళ్తున్నారని కొందరు వైసీపీ పెద్దలు చెబుతున్నారు. మొత్తమ్మీద జగన్ బెంగళూరు టూర్ రహస్యమేంటి..? ఎందుకు ఉన్న పళంగా వెళ్తున్నారు..? అనేది పెరుమాళ్ళకే ఎరుక..!