అవును.. 2029 వైసీపీదే.. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరుతున్నాం అంతే..! కనీసం టీడీపీ లేదా కూటమి గట్టినా సరే వారికి సింగిల్ డిజిట్ కూడా రాదు..! ఇదే మాట 2024 ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా, అది కూడా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిన తర్వాత ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్న మాటలు. ఇవి కేడర్‌లో ధైర్యం నింపడానికి చెబుతున్నారో లేకుంటే మరే ఉద్దేశంతో చెబుతున్నారో తెలియట్లేదు కానీ.. గట్టి ధీమానే వ్యక్తం చేస్తున్నారు.
నాడు.. నేడు!
వైనాట్ 175 అని ఓ రేంజిలో ఊదరగొట్టిన వైఎస్ జగన్ 11 సీట్లకే పరిమితం అయ్యారు. ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి. సీన్ కట్ చేస్తే.. చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో గతంలో 151 సీట్లు దక్కించుకున్న ఒక పార్టీ, వ్యక్తి.. ఇప్పుడు అటు ఇటు కాకుండా కేవలం ఎమ్మెల్యేగానే ప్రమాణం స్వీకారం చేయాల్సిన పరిస్థితి. అంతేకాదండోయ్.. సీఎంగా వైజాగ్ వేదికగా ప్రమాణ స్వీకారం అని చెప్పిన పార్టీ ఇప్పుడు అసెంబ్లీలో అదేనబ్బా ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేందుకు సిద్ధమవుతున్నారంటే ఎక్కడ్నుంచి ఎటు పోయిందో చూడండి. వైసీపీ ఘోర పరాజయం తర్వాత లోపాలు ఎక్కడున్నాయి..? ఏం జరుగుతోంది..? వాట్ నెక్స్ట్..? అంటూ వైసీపీ తరఫున గెలిచిన.. ఓడిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో వైఎస్ జగన్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలా ముందుకెళ్దాం ఏం చేయాలనే విషయాలను ఆలోచించాల్సింది పోయి 2029 ఎన్నికలకు ఇప్పట్నుంచే కలలు కంటున్నారు.
అవును.. మనదే..!
ఏ పార్టీ అయినా ఒక్కసారిగా ఘోర ఓటమిని చవిచూస్తే లోపం ఎక్కడుందనే దానిపై పోస్టుమార్టం మొదలుపెడతారు. కానీ జగన్ మాత్రం ఫలితాలు వచ్చిన 15 రోజుల్లోనే జోస్యం చెప్పుకోవడం మొదలుపెట్టారు. 2029లో వైసీపీనే వస్తుంది.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని జోస్యం చెప్పుకుంటున్నారు. 2029 నాటికి వచ్చే నాటికి చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తారని.. ప్రజలు ఇవన్నీ గుర్తు పెట్టుకుని మళ్లీ వైసీపీని ఆశీర్వదిస్తారని పార్టీ నేతలతో చెప్పడం గమనార్హం. అంతేకాదు.. మరింత అత్యాశకు పోయిన జగన్.. రానున్న ఎన్నికల్లో చంద్రబాబుకు కేవలం సింగిల్ డిజిట్ వస్తుందని చెప్పేశారు. అసెంబ్లీలో సంఖ్యా బలం తక్కువ ఉంది గనుక ఏమీ చేయలేకపోవచ్చు కానీ.. ప్రజలతో కలిసి పోరాటం చేసే కార్యక్రమాలు ముమ్మరంగా సాగిద్దామని నేతలు, కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. వైసీపీ కార్యకర్తలకు నాయకులంతా తోడుగా ఉండాలని జగన్ సూచించారు. చూశారుగా.. జగన్ ఇంకా ఏ పరిస్థితుల్లో ఉన్నారో.. ఇంకెప్పుడు రియలైజ్ అవుతారో.. ఏంటో అని సొంత పార్టీ నేతలే ఒకింత ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి.