ఒకటా.. రెండా కొన్నేళ్ళ నిరీక్షణ ఫలించింది..! తమ అభిమాన నేత జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఎప్పుడెప్పుడు ఎమ్మెల్యే అవుతారా..? అని కలలు కన్న వీరాభిమానులు ఇవాళ చాలా హ్యపీగా ఫీల్ అవుతున్నారు. ఎమ్మెల్యేనే కాదు డిప్యూటీ సీఎం కూడా అయ్యారు..! అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమని శపథాలు చేసిన పెద్ద పెద్ద తలకాయలను సైతం అదే అసెంబ్లీకి రానివ్వకుండా ఓడించి.. ఇంటికే పరిమితం చేసి.. అదే అసెంబ్లీ గేట్ తాకడమే కాదు సెక్రటేరియట్ లో తనకంటూ ఒక ఛాంబర్ సైతం దక్కించుకున్నారు.. అదీ ఇప్పుడు పవన్ రేంజి..! డిప్యూటీ సీఎంగా బాధ్యతలు కూడా స్వీకరించి పరిస్థితి. ఈ పరిణామంతో మెగా ఫ్యామిలీ, ఫ్యాన్స్.. జనసేన కార్యకర్తలు, నేతలు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఇప్పటి వరకూ పవర్ లేని పవన్.. ఇప్పుడు పవర్ ఉన్న పవన్ అన్న మాట. ఇప్పటివరకూ అంతా ఓకే కానీ సేనాని ముందు పెను సవాళ్లు చాలానే ఉన్నాయి. ఇంతకీ ఆ సవాళ్లు ఏంటి..? పవన్ ఏం చేయబోతున్నారు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి..
ఎన్నాళ్ళో వేచి..!
జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఎన్నో విమర్శలు, ఇంకెన్నో ఆరోపణలు.. అంతకుమించి వ్యక్తిగతంగా తిట్లు ఇలా ఎన్నో భరించారు. పార్టీ పెట్టినప్పుడు పోటీ చేసే పరిస్థితి లేదు.. అందుకే టీడీపీతో చేతులు కలపాల్సి వచ్చింది.. అధికారంలోకి రావడం, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు కానీ సేనానికి ఎలాంటి ప్రాధాన్యత లేదు. దీంతో 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోరాటం చేయాల్సి వచ్చింది ఐతే.. ఘోర పరాజయం అదీ పవన్ పోటీ చేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో ఓటమి పాలైన పరిస్థితి. ఇక 2024 ఎన్నికల్లో తాను గెలవడమే కాదు కూటమి కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అనుకున్నట్టే సేనానికి ప్రాధ్యాన్యత ఇస్తూ డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక శాఖలు కూడా దక్కాయి. ఇదీ పవన్ స్థాయి.. ఒక్కమాటలో చెప్పాలంటే పట్టుమని పదేళ్లలో రీల్ హీరో రియల్ అనిపించుకున్నారు. బాధ్యతలు స్వీకరించాక ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరు చేస్తూ మొదటి ఫైల్‌పై, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించిన రెండో ఫైల్ పై పవన్ కల్యాణ్ సంతకం చేశారు.
సేనానికి సవాళ్లు ఇవీ..
పవన్ డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, శాస్త్ర- సాంకేతిక శాఖలు ఉండటంతో ఒక్కో శాఖ ఒక్కో సవాలే. ఇక పవన్ ఎప్పటి నుంచి చెబుతున్న.. చిన్నపాటి యుద్ధం చేస్తున్న ప్రత్యేక హోదా తీసుకురావాల్సిన బాధ్యత ఎంతో కొంత ఉంది. ఎందుకంటే ఒకప్పుడు పాచిపోయిన లడ్డు అంటూ ఏమేం మాట్లాడారు అనేది అందరికీ తెలిసిన విషయమే.
ఇక వాలంటీర్ల సమాచారం పనికిమాలిన పనులకు వాడటంతో 32 వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారని పవన్ చేసిన రాద్దాంతం అంతా ఇంతా కాదు. సో ఇప్పుడు కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి సర్కార్ ఉంది గనుక.. ఆ మిస్సయిన వారిని వారిని ఇంటికి తీసుకొచ్చి.. ఆ కుటుంబాల్లో చిరునవ్వులు చూడవలసిన బరువు, బాధ్యతలు పవన్ పైన ఉన్నాయ్.
సుగాలి ప్రీతికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా సేనానిపైన చాలానే ఉంది. ఒకప్పుడు తాను 2 చోట్ల ఓడిపోయినా సుగాలి ప్రీతి తల్లి వచ్చి న్యాయం అడిగితే పోరాటం ఆపలేదు.. ఆపను అని కూడా మాట ఇచ్చారు. ఈ కుంటుంబానికి త్వరగా న్యాయం చేయాలని కోరుకుంటున్నారు.
ఇక ఫైనల్ గా.. అటవి శాఖ పవన్ చేతిలో ఉంది కనుక ఎర్ర చందనం అక్రమ రవాణాను అపాల్సిన పని కూడా ఈయనదే. అంతకు మించి అటవి శాఖ అధికారుల ప్రాణాలు ఎర్ర దొంగల నుంచి కాపాడవలసిన బాధ్యత కూడా పవన్ కల్యాణ్ పైనే ఉంది. ఇక పంచాయతీరాజ్ శాఖలో ఎన్ని సవాళ్లు ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరి.. ఈ సవాళ్లు నుంచి పవన్ ఎప్పుడు ఏం చేస్తారో.. అని అభిమానులు, కార్యకర్తలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.