Advertisementt

పేరేమో గ్రేట్ - రాసేదంతా స్క్రాప్

Tue 18th Jun 2024 06:44 PM
news  పేరేమో గ్రేట్ - రాసేదంతా స్క్రాప్
The name is great.. all the writings are scrap పేరేమో గ్రేట్ - రాసేదంతా స్క్రాప్
Advertisement

పేరుకేమో గ్రేట్.. రాసేవన్నీ చెత్త రాతలే!

పేరు గొప్ప ఊరు దిబ్బ.. అనే సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది.. కదా! ఇప్పుడిది అక్షరాలా ఓ పేరుగాంచిన వెబ్‌సైట్‌కు అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది! అదెలాగంటే.. నిత్యం విషపు రాతలు, నమ్మలేని వార్తలు, ఎవరెవరికో సంబంధాలు అంటగట్టడం.. ఏవేవో రాసేయడం ఇదే దినచర్యగా నడుస్తోంది..! ఒక్కమాటలో చెప్పాలంటే పేరుకేమో గ్రేట్.. రాసేవలన్నీ చిల్లర రాతలే!. అబ్బో పైకి మాత్రం.. ఆహో, ఓహో అని ఊదరగొట్టడమే పని. అందరికంటే మేమే టాప్, డిజిటల్ మీడియాను ఏలుతున్నది మేమే..! నిద్ర లేచింది మొదలుకొని మళ్ళీ నిద్రపోయేవరకు తెలుగు ప్రజలకు మేం రాసే వార్తలు లేకపోతే తెల్లారదు.. ముద్ద అస్సలే దిగదు! ఎన్నో వెబ్ సైట్లు, పెద్ద మీడియా సంస్థలు సైతం మమల్ని నమ్ముకుని బతుకుతున్నాయ్.. ఇలా ఒకటా రెండా అబ్బో ఆ ఓవర్ యాక్షన్.. చెవులకు చిల్లు పడేలా సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూనే ఉంటుంది. మనల్ని ఎవడ్రా ఆపేది.. దొరికితే చిన్నపాటి సారీ.. దొరకకపోతే మరింత విర్రవీగుదాం రెచ్చగొట్టి మరిన్ని చెత్త రాతలు రాసి క్యాష్ చేసుకుందామనే దోరణితో సైట్‌ను నడిపించేస్తోంది యాజమాన్యం.

మీడియానా.. లేకుంటే..?

మీడియా అంటే ఎలా ఉండాలో దీనికి పూర్తి విరుద్ధంగా ఇష్టానుసారం వార్తలు రాస్తూ భ్రష్టుపట్టిస్తోంది. అదెలాగంటే.. ఒక పార్టీ వకల్తా పుచ్చుకోవడం, పొరపాటున ఓడిపోయిందా అబ్బే ఇక చూస్కోండి ఇలా జరుగుతుందని ఏనాడో మేం చెప్పామని ఉచిత సలహాలు ఇవ్వడం.. ఇక ఓడిపోయిన పార్టీని పక్కనెట్టేసి అధికారంలోకి వచ్చిన పార్టీ ఆకాశానికెత్తేయడం.. అప్పటి వరకూ తిట్టిపోసిన అదే అక్షరాలతో ప్రశంసిస్తూ రాతలు రాయడం. అదే రాజకీయ నేతలపై నోటికొచ్చినట్లు రాతలు రాసేయడం. ఇదంతా ఎవరికైనా షరా మామూలే కదా.. మీడియాలో ఉండాలంటే ఎవరో ఒకరి అండదండలు ఉండాలి కదా అంటారేమో.. న్యూట్రల్ నడుపుకుంటున్న వెబ్‌సైట్లు, చానెల్స్, యూట్యూబ్ చానెల్స్ లేవా..? అంటే సవా లక్ష ఉన్నాయ్. ప్రజల కోసం, ప్రజల పక్షాన మాట్లాడే, కొట్లాడే.. దినపత్రికలు, టీవీ చానెల్స్ అంతకుమించి వెబ్ సైట్లు లేవా..? వాటిని ఎందుకు ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవట్లేదు. ఈ సంగతి పక్కనెట్టి సినిమా పరంగా వస్తే.. అదిగో ఆ హీరో అలాగంటా, ఈ హీరోయిన్ ఇలాగంటా.. ఆ ఇద్దరికీ సంబంధాలున్నాయంట. నిర్మాత-హీరోయిన్ కుచ్ కుచ్ అంట.. డైరెక్టర్-జూనియర్ ఆర్టిస్ సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంట.. అదిగో ఫలానా ఆర్టిస్ట్ ఈ పనిచేసిందంట ఇలా ఒకటా రెండా రోజుకు నాలుగైదు వార్తలు పుట్టిస్తూ మీడియా అనే వ్యవస్థకు చీడపురుగులాగా తయారైన పరిస్థితి. గాసిప్స్ అంటే గాసిప్ లాగే ఉండాలి కానీ గబ్బు గబ్బుగా రాసేసి అవతలి వ్యక్తులవి కూడా మనలాంటి జీవితాలే అని మరిచి కళ్లు నెత్తికెక్కించుకుని రాస్తే ఎలా..? ఈ రోజులు మీవి కాబట్టి అంతా ఓకే రేపొద్దున్న తేడా కొట్టినప్పుడు.. ఏమవుతుంది..? అనేది తెలుసుకుంటే బహు మంచిది సుమీ..!

ప్రశాంతంగా ఉంటారా..?

మనం చేసే పని ఏదైనా సరే సంతృప్తిగా ఉంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది..! ఉదహరణకు ఒక కూలి పనిచేసే వ్యక్తి ఉదయం మొదలుకుని సాయంత్రం వరకు సిమెంట్ మోసి.. కూలి డబ్బులు తీసుకుని ఇంట్లోకి కావాల్సిన సామాగ్రి, పిల్లలకు తినుబండరాలు తీసుకెళ్లి ఎంతో ప్రశాంతంగా పడుకుని, పనిచేశా డబ్బులొచ్చాయ్ అని మనశ్శాంతిగా పడుకుంటాడు. తెల్లారితే యథావిధిగా దినచర్య కొనసాగిస్తాడు. ఎందుకంటే ఆయన కష్టాన్ని నమ్ముకున్నోడు గనుక. ఇక ఇదే చెత్త రాతలు రాసే .. సో కాల్డ్ జర్నలిస్టులు సారీ సారీ ఎర్నలిస్టులు ఇలాగే ఇంటికెళ్లి కుటుంబంతో మనశ్శాంతిగా, మనస్పూర్తిగా ఉండగలరా..? ఎందుకంటే ఎవరెవరో జీవితాల మీద, ఎవరెవరినో ఇంకెవరికో సంబంధాలు అంటగట్టి రాతలు రాసి ఎక్కడో గిల్టీ ఫీలింగ్‌తో ప్రశాంతంగా ఉండగలరా..? అంటే వందకు వెయ్యి శాతం ఉండలేరు.. ఎక్కడో మనసు నొచ్చుకుంటూనే ఉంటుంది. సో.. ఇకనైనా మేల్కోండి.. మనలాగే ఎదుటివారు అదేనబ్బా మనం ఎవరిమీదైతే వార్తలు రాస్తామో వాళ్లు కూడా మనుషులేనన్న విషయం తెలుసుకోండి. అంతేకాకుండా అందరిలాగే కడుపు అన్నమే తిని బతుకుతామన్న విషయం మరీ మరీ గుర్తు చేసుకుంటే ఇంకా మంచిదేమో. ఇప్పటికీ మించిపోయినదేమీ లేదు.. మారండి మార్పు మంచిదే కదా.. రాజకీయంగా, సినిమాల పరంగా ముఖ్యంగా ఆ గాసిప్స్ రాసేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని రాతలు రాస్తే మంచిది మరి.

The name is great.. all the writings are scrap:

Great in name... Worst in work

Tags:   NEWS
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement