తాడేపల్లిలోని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ కూల్చేస్తారా..? అతి త్వరలోనే ఈ ప్రక్రియ మొదలు కానుందా..? ఇప్పటికే సన్నాహాలన్నీ పూర్తయ్యాయా..? హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లోని ఇంటి ముందున్న అక్రమ నిర్మాణాలతో మొదలైన కూల్చివేతలు.. విజయవాడ ప్యాలెస్ వరకూ వెళ్తాయా..? ఇటు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి.. అటు ఆంధ్రాలో సీఎం నారా చంద్రబాబు ఇద్దరూ టార్గెట్ చేసి జగన్‌ను ఉక్కిరి బిక్కిరి చేయాలని చూస్తున్నారా..? అంటే తాజా పరిణామాలు, మీడియా చేస్తున్న ఫోకస్.. ప్రభుత్వాన్ని పదే పదే రెచ్చగొడుతున్న తీరును చూస్తే అక్షరాలా ఇదే నిజమనిపిస్తోంది. ఇంతకీ ఈ ప్రస్తావన ఎందుకొచ్చింది..? ఎన్నికల ఫలితాలు వచ్చి పట్టుమని నెలకూడా కాకమునుపే ఎందుకింత రచ్చ జరుగుతోంది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
అసలేం జరుగుతోంది..?
హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్ నివాసం.. కొన్నేళ్లుగా ఉంది. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన మరణాంతరం వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఆ ఇంట్లో ఉన్నారు. 2019 ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో 151 సీట్లలో ఘన విజయం సాధించాక విజయవాడలోని తాడేపల్లిలో పెద్ద ప్యాలెస్‌ను నిర్మించుకున్నారు. ఘట్టమనేని ఆదిశేషగిరి రావు స్థలాన్ని కొనుగోలు చేసిన వైసీపీ అధినేత అక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. చుట్టూ పెద్ద ఎత్తున ఫినిషింగ్, ప్రత్యేకంగా రోడ్లు, హెలీప్యాడ్, పర్మినెంట్ బ్యారీకేడ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయ్. ఒక్క మాటలో చెప్పాలంటే.. జగన్ నివాసం అనడం కంటే పెద్ద ప్యాలెస్ అంటే సరిగ్గా సరిపోతుందేమో..! పార్టీ క్యాంపు ఆఫీసుగా మార్చుకుని అన్ని పనులూ ఇక్కడ్నుంచే చక్కబెట్టేవారు. ఇల్లు కడుతున్నప్పుడు కానీ.. కట్టాక కానీ ఎక్కడా ఎలాంటి వార్తలు రాకపోగా.. 2024 ఘోర పరాజయం పాలవ్వడం ఆలస్యం జగన్ ఇంటిగుట్టు అంటూ మీడియా, సోషల్ మీడియాలో ఒక్కటే చర్చ నడుస్తోంది. దీనికి తోడు అధికారం పోయిన తర్వాత కూడా ఆఫీస్ ఫర్మీచర్ రిటర్న్ ఇవ్వకపోవడంతో ఒక్కొక్కటిగా జగన్ లీలలు బయటికి వస్తున్న పరిస్థితి.
ఏం జరుగుతోంది..?
లోటస్‌పాండ్‌లో వైఎస్ ఫ్యామిలీ ఇల్లు కట్టుకుని కొన్నేళ్లు అవుతోంది. ఇంటిపై కానీ, ఇంటి ముందు ఉన్న నిర్మాణాలపైనా ఇంతవరకూ ఎలాంటి వివాదాలు జరగలేదు. పదేళ్లపాటు కేసీఆర్ సర్కార్ నడిచినప్పటికీ ఎక్కడా ఇసుమంత రాద్ధాంతం జరగలేదు. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో లేదో.. టార్గెట్ జగన్ ఆస్తులు అంటూ షురూ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటి ముందు సెక్యూరిటీ కోసం నిర్మించిన నిర్మాణాలను జీహెచ్ఎంసీ కూల్చివేసింది. ఎక్కడా ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసు బందోబస్తుతో జగన్ ఇంటి ముందు నిర్మాణాలను కూల్చేసింది రేవంత్ సర్కార్. ఇక ఇలా కూల్చివేతలు అయ్యాయో లేదో.. ఏపీలో నివాసముంటున్న ఇంటిపై కొందరి కన్నుపడిందని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక చూస్కోండి.. అంత ఇల్లు ఎందుకు..? జగన్ ఏమైనా ప్రతిపక్ష నాయకుడా..? ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా..? ఇలా ఎన్ని ప్రశ్నలు. అంతటితో ఆగలేదు.. జనం సొమ్ముతో జగన్ సోకులు పడుతున్నారని కోట్ల రూపాయిలతో ఇల్లు కట్టుకుని రాజభోగాలు అనుభవిస్తున్నారని టీడీపీ నేతలు, అనుకూల పత్రికలు రాసుకొచ్చేశాయ్. ఇంకో అడుగు ముందుకేసి.. చంద్రబాబు ప్రభుత్వం ఇంకెప్పుడు చర్యలు తీసుకుంటుంది..? ప్యాలెస్ గుట్టు ప్రభుత్వం ఎప్పుడు విప్పుతుందో..? అని కూడా తిన్నగా ఓ రాయి వేశారని వైసీపీ శ్రేణులు కన్నెర్రజేస్తున్నాయి.
కూల్చివేత తప్పదా..?
వైసీపీ అధికారంలోకి రాగానే ప్రజావేదికతో కూల్చివేతలు మొదలై ఎక్కడికెక్కడికో వెళ్లాయి. దీంతో తన గోతి తానే జగన్ తీసుకున్నాడన్నది ఇప్పుడు అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతల ప్రధాన ఆరోపణ. రేపొద్దున్న అక్రమంగా ఇల్లు కట్టారని, ప్రభుత్వ సొమ్మని నిరూపించి.. రోడ్లు, హెలీప్యాడ్ ఇలా అన్నీ అక్రమేనని చెప్పి కూల్చివేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. లోటస్‌పాండ్‌లో మొదలైన కూల్చివేతలు.. తాడేపల్లికి రావడానికి పెద్ద సమయం పట్టకపోవచ్చన్నది మేథావులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. వాస్తవానికి ఆ ఇల్లు, చుట్టూ ప్రహరీ గోడ, హెలీప్యాడ్, ఆలయాల నమూనాలు, ఫెన్సింగ్‌లు, పర్మినెంట్ బారీ కేడింగ్ అన్నీ చూస్తే.. సలార్ సినిమాలో ఓ సీన్ అందరికీ గుర్తొస్తుంది. ఏదేమైనా తెలుగు రాష్ట్రంలో ఎందుకో రివెంజ్ రాజకీయాలు అది కూడా వైఎస్ జగన్‌పైనే షూరూ అయ్యాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటు రేవంత్ రెడ్డి.. అటు చంద్రబాబు ఇద్దరూ రానున్న రోజుల్లో జగన్‌ను ఉక్కిరి బిక్కిరి చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఇది అక్రమమో.. సక్రమమో.. అన్నది ప్రభుత్వమే తేల్చాల్సి ఉంది.