Advertisementt

సజ్జలను జగన్ ఎందుకు సైడ్ చేయట్లేదు?

Sat 15th Jun 2024 10:36 AM
ys jagan   సజ్జలను జగన్ ఎందుకు సైడ్ చేయట్లేదు?
Why did not Jagan side the Sajjala? సజ్జలను జగన్ ఎందుకు సైడ్ చేయట్లేదు?
Advertisement
Ads by CJ

సజ్జల రామకృష్ణా రెడ్డి.. ఈ పేరు, వ్యక్తిని కొత్తగా ఎవరికీ పరిచయం చేయనక్కర్లేదు.! మరీ ముఖ్యంగా వైసీపీ నేతలు, కార్యకర్తలకు ఐతే అస్సలు చెప్పాల్సిన పనిలేదు.! 2019 ఎన్నికల్లో ఊహించని రీతిలో 151 సీట్లు గెలుచుకుని వైసీపీ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక్కసారిగా సీన్ మొత్తం మారిపోయింది. ఎలాగంటే అప్పటి వరకూ ఒక లెక్క.. ఇక అప్పుడే మొదలైంది అసలు సిసలు సినిమా. నమ్మిన, కష్ట కాలంలో తోడుగా ఉన్న వారికి జగన్ ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇందులో ఒకరు సజ్జల. 2019 వరకూ ఎక్కడా వినపడని ఈ పేరు.. వైసీపీ గెలిచాక సలహాదారు పదవి రావడంతో ఇక అన్నీ తానై చూసుకున్నారు. ఎంతలా అంటే.. వైసీపీ కార్యకర్తలు, నేతలకే తెలియాలి.

ఎక్కడ చూసినా ఇదే!!

పేరుకే ఈయన సలహాదారుడు కానీ సఖల శాఖా మంత్రిగా పనిచేశారాన్నది వైసీపీ నేతల నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరాతి ఘోరంగా ఓడిపోవడానికి కారకుల్లో మొదటి వ్యక్తి అని సొంత పార్టీ నేతలే చెబుతున్న పరిస్థితి. ఇంత జరిగినా సరే.. ఈయన్ను ఎందుకు వైసీపీలో కొనసాగిస్తున్నారు..? జగన్ పక్కనే ఎందుకు పెట్టుకుని తిరుగుతున్నారు..? ఓటమి తర్వాత జరుగుతున్న సమావేశాల్లో ఎందుకు ఈయన పాల్గొంటున్నారు..? అసలు ఆయనకు ఏం అవసరం..? సలహాదారు పదవి పోయింది.. వైసీపీ ఓడిపోయింది..? ఇంకా ఎందుకు ఆయన..? అన్నీ తెలిసి కూడా జగన్ ఇంకా సైడ్ చేయలేదేం..? ఇప్పుడు ఈ ప్రశ్నలే వైసీపీ కార్యకర్త నుంచి హై కమాండ్ వరకూ వేధిస్తున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. 

ఎవరీ సజ్జల..? 

వైసీపీలో నంబర్ 02గా ఒక వెలుగు వెలిగిన సజ్జల ఇప్పుడు చడీ చప్పుడు చేయట్లేదు. అసలు ఎవరీయన..? జగన్ ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు..? జగన్ రెడ్డికి ఇంకా సిగ్గు రాలేదా..? అని కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. జగన్ కుటుంబానికి ఆప్తుడిగా, ఆ‍యన రాజకీయాల్లోకి రాకముందు నుంచి వ్యాపారాల్లో నమ్మకస్తుడిగా ఉన్న వ్యక్తి సజ్జల. పార్టీ పెట్టిన తర్వాత, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత ప్రాధాన్యత ఇచ్చారు జగన్. పాత్రికేయుడిగా సుదీర్ఘ అనుభవం ఉన్న సజ్జల తన జీవితంలో అంచెలంచెలుగా ఎదిగారు. జగన్ మీడియాను ఒంటి చేత్తో నడిపించిన వ్యక్తి. అంతేకాదు వైఎస్ ఫ్యామిలీ వ్యాపారాలు అన్నీ తానై చూసుకున్నారు. వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత కూడా బయటికి కనిపించలేదు కానీ తెర వెనుక అన్నీ నడిపించారు. 2014లో వైసీపీ ఓటమి తర్వాత అటు పార్టీ వ్యవహారాలు.. ఇటు పత్రిక వ్యవహారాలను సమన్వయం చేయడం కష్టం కావడంతో ఆయన పూర్తిగా పార్టీ పనులకు పరిమితం అయ్యారు.

ట్రబుల్‌ షూటర్‌గా..!

అలా 2019 ఎన్నికల్లో గెలిచాక క్యాబినెట్‌ ర్యాంకుతో ప్రభుత్వ సలహాదారు పదవి వరించింది. అప్పటినుంచి పార్టీలో ట్రబుల్‌ షూటర్‌గా, ముఖ్యమంత్రి తరపున ఆయన ఆలోచనలు, ఆదేశాలను అమలు చేయడం, పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడంలో సజ్జల సక్సెస్ అయ్యారని ఆయన దగ్గరి మనుషులు చెబుతుంటారు. పార్టీలో ట్రబుల్‌ షూటర్‌గా, ముఖ్యమంత్రి తరపున ఆయన ఆలోచనలు, ఆదేశాలను అమలు చేయడం, పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడంలో సజ్జల కీలక పాత్ర పోషించేవారు. జగన్ మనసులోని మాటను ఈయన ఆచరణలో పెట్టేవారని కొందరు వైసీపీ నేతలు చెబుతుంటారు. 

ఇదీ అసలు సంగతి!

కడప జిల్లా.. పైగా ఒకటే సామాజికవర్గం, వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడు. వైఎస్ఆర్ బతికి ఉన్నప్పటి నుంచి నేటి వరకూ కష్టాల్లో, నష్టాల్లో అన్నింటిలో తోడై నిలిచిన వ్యక్తి సజ్జల. ఎలా అంటే వైఎస్ జగన్ అరెస్ట్ అయ్యాక నా అనుకున్న వాళ్ళు ఒక్కరంటే ఒక్కరూ తోడుగా లేరు. వైఎస్ ఫ్యామిలీకి అండగా నిలిచిన వారెవరు అంటే వేళ్ళతో లెక్క పెట్టవచ్చు. వీరిలో సజ్జల ఒక్కరు. జగన్ అరెస్ట్ అయ్యాక మరుక్షణం వైఎస్ ఫ్యామిలీ రోడ్డున పడింది. అప్పుడే సజ్జల అనే వ్యక్తి ఒకరు ఉన్నారన్నది బయటికి వచ్చింది. నాటి నుంచి జగన్ వ్యాపారాలు, పత్రిక.. టీవీ ఛానెల్ అన్నీ చూసుకున్నారు. జైల్లో జగన్ రెడ్డితో వారంలో ఒకటి రెండు రోజులు ములాఖాత్ కావడం, పార్టీ వ్యవహారాలకు సంబంధించి అన్నీ మాట్లాడి.. ఆచరణలో పెట్టడం అన్నీ చూసుకున్నారు. ఐతే తెరపైకి రాకుండానే అన్నీ చేశారు. నాటి నుంచి నేటి వరకూ జగన్ ఫ్యామిలీతోనే సజ్జల ఉన్నారు. అందుకే జగన్ రెడ్డి.. సజ్జలను వదులుకోలేదు అని కొందరు నేతలు చెబుతున్న మాట. 

అప్పుడూ.. ఎప్పుడూ..!

ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిందో లేదో ఇక మొత్తం చేసింది సజ్జల.. ఆయనే కర్త, కర్మ, క్రియ అని కార్యకర్తలు, నేతలు దుమ్మెత్తి పోశారు. ఇక సోషల్ మీడియా కన్వీనర్ బాధ్యతలు చూసిన ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డిపై కూడా గట్టిగానే ఆరోపణలు వచ్చాయి. ఐతే.. వైఎస్ ఫ్యామిలీతో సజ్జలకు ఉన్న బంధం, కష్ట కాలంలో తోడుగా ఉన్న వ్యక్తులను జగన్ దూరం చేసుకోరని.. ఒకవేళ తప్పులు, ఒప్పులు ఉంటే మార్చుకోమని చెబుతారే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరు అని అధినేత అత్యంత సన్నిహితులు చెబుతున్న మాట. అందుకే.. వైసీపీలో కొందరు కార్యకర్తలు.. గెలిచినా, ఓడినా ఎప్పుడూ జగనన్నకు తోడుగానే సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటున్నారని అందుకే మేము సైతం ఆయనతోనే అని మరికొందరు నేతలు, కార్యకర్తలు గట్టిగానే చెబుతున్నారు. చూశారుగా ఇదీ సజ్జల స్టోరీ..!

Why did not Jagan side the Sajjala?:

YS Jagan Is The Main Reason For YSRCP Defeat 

Tags:   YS JAGAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ