ఏపీలో రికార్డ్ మెజారిటీ.. అధ్యక్ష పదవి!
ఏపీ ఎన్నికల్లో ఊహించని విజయం సాధించిన కూటమి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా 24 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇందులో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఒకరు. ఆయనకు మంత్రి పదవి రావడం, టర్మ్ కూడా ముగియడంతో కొత్త వ్యక్తిని టీడీపీ ఎన్నుకుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది.
ఇదిగో ఈయనే..!
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును నియమిస్తూ హైకమాండ్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అంటే ఇకపై అచ్చన్న స్థానాన్ని పల్లా ఫుల్ ఫిల్ చేయాలి అన్న మాట. కాగా ఈయనకు పెద్ద ట్రాక్ రికార్డు ఉంది. పార్టీలో కార్యకర్తగా మొదలైన రాజకీయ జీవితం ఇప్పుడు అధ్యక్ష పదవి దాకా వెళ్ళింది. బీసీ యాదవ సామజిక వర్గానికి చెందిన పల్లా.. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ఈయన కష్టాన్ని, విశ్వసనీయతను పార్టీకి చేసిన సేవలను గుర్తించిన చంద్రబాబు పిలిచి మరీ అధ్యక్ష పదవి ఇవ్వడం విశేషం అని చెప్పుకోవచ్చు.
ఎవరీ పల్లా!!
పల్లా శ్రీనివాసరావు తండ్రి టీడీపీలో పని చేశారు. పల్లా మాత్రం 2009లో ప్రజారాజ్యం నుంచి రాజకీయ జీవితం ప్రారంభించారు. మొదటిసారి విశాఖ ఎంపీగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత టీడీపీలో చేరి 2014లో గాజువాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పవన్ కళ్యాణ్, టీడీపీ నుంచి పల్లా పోటీ చేయగా.. ఈ ఇద్దరినీ ఓడించి వైసీపీ నుంచి తిప్పల నాగిరెడ్డి గెలిచారు. ఈ ఎన్నికల్లో ఓటమి తరువాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.. అంతే కాదు నియోజకవర్గంపైన కూడా తనదైన స్పష్టమైన ముద్ర వేశారు. దీనికి.. సౌమ్యుడిగా, వివాదరహితుడిగా పేరు తోడు అయ్యాయి. విశాఖలో టీడీపీని ఒంటి చేత్తో నడిపించడం.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ఉద్యమం నిర్వహించ దడంతో పల్లా పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. ఇంత చేసిన ఈయన పార్టీని నడించగలడు అని నమ్మిన బాబు.. పల్లాకు అధ్యక్ష పదవి కట్టబెట్టారు.
రికార్డ్ మెజారిటీ!
టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న పల్లాకు చాలా రికార్డులే ఉన్నాయ్. ఎలాగంటే.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద ఈయనదే 95,235 రికార్డు మెజారిటీ. విశాఖ జిల్లా గాజువాక నుంచి రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో ఈయన గెలుపొందారు. వాస్తవానికి ఈయనకు మంత్రి పదవి పక్కా అని వార్తలు వచ్చాయి.. చంద్రబాబు మనసులో కూడా ఉన్నప్పటికీ యాదవ సామజికవర్గంలో మరొకరికి పదవి ఇచ్చి.. ఈయన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. నూజివీడు నుంచి గెలిచిన కొలుసు పార్థసారథికి మంత్రి పదవి ఇవ్వడంతో పల్లాకు పదవి దక్కించుకున్నారు.
వైసీపీ ఆఫర్ ఇచ్చినా!
వాస్తవానికి.. వైసీపీ అధికారంలోకి వచ్చాక పలు వేధింపులు పల్లా శ్రీనివాసరావు.. ఆస్తులపై కూడా దాడులు చేశారు. ఓ భవనాన్ని రాత్రికి రాత్రే కూలగొట్టినా సరే అదరలేదు.. బెదరలేదు. ఆఖరికి పార్టీ మారితే విశాఖ మేయర్ పదవి ఇస్తానని కూడా బంపర్ ఆఫర్ ఇచ్చినప్పటికీ టీడీపీని వదల్లేదు. దీంతో అప్పటి నుంచి హైకమాండ్ దృష్టిలో పడటం.. పైగా బీసీ కావడంతో ఆయా వర్గాల్లో మరింత ఆదరణ టీడీపీకి వస్తుందని చంద్రబాబు భావించారు. అందుకే.. పల్లా శ్రీనివాసరావు సేవలను అధ్యక్ష పదవిలో వాడుకోవాలని టీడీపీ భావించింది. ఐతే నారా లోకేష్ పార్టీ పగ్గాలు చేపట్టి.. దూసుకెళ్తారని అందరూ అనుకున్నారు కానీ.. ఊహించని రీతిలో పల్లాను అదృష్టం వరించింది. ఈయన ఏ మాత్రం పార్టీని ముందుకు నడిపిస్తారో వేచి చూడాల్సిందే మరి.