ఆ ఇద్దరికి మంత్రిగా నో ఛాన్స్.. పెద్ద కథే ఉందే!
ఏపీ సీఎం నారా చంద్రబాబు అంటే టక్కున గుర్తుకు వచ్చే ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పండి..? ఏంటి గుర్తు రావట్లేదా..? పోనీ బాబు లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ అంటే ఎవరనేది చెప్పగలరా..? అదేంటి ఇంత హింట్ ఇచ్చినా గుర్తురాక, చెప్పలేక పోతున్నారంటే ఇక చెప్పేస్తా ఆగండి.. అదేనబ్బా సీఎం రమేష్, సుజనా చౌదరి. ఈ ఇద్దరి పేర్లు, బ్యాగ్రౌండ్ గురుంచి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నిన్న, మొన్నటి వరకు అటు టీడీపీ.. ఇటు బీజేపీలో ఓ వెలుగు వెలిగిన ఈ ఇద్దరూ ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు.. పైగా ఎలాంటి పదవులు సైతం వరించలేదు..? అసలేం జరిగింది..? తెర వెనుక ఏం నడిచింది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి..!
ఏం జరిగింది..?
టీడీపీకి ఫైనాన్సీయర్లుగా, చంద్రబాబుకు లెఫ్ట్, రైట్ హ్యాండ్స్ అనిపించుకునే సీఎం రమేష్, సుజనా చౌదరి పార్టీలో ఉన్నన్ని రోజులూ ఓ వెలుగు వెలిగారు. 2014 నుంచి 2019 వరకూ ఈ ఇద్దరూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా అంతా వీళ్ళే. సీఎం రమేష్ అంటే సీఎం కంటే పవర్ ఫుల్ అని.. సుజనా అంటే పీఎం కంటే ఎక్కువ పవర్ అని టీడీపీ శ్రేణులు చెప్పుకున్న సందర్భాలు కోకొల్లలు. 2019లో టీడీపీ ఘోర పరాజయం పాలవ్వడం, బ్యాంకులకు ఎగ్గొట్టిన డబ్బులు కట్టలేదని దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగడంతో కాషాయ కండువా కప్పుకునే సరికి సీన్ మారింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇక్కడ అప్రస్తుతం. పేరుకే బీజేపీలో చేరినప్పటికీ ప్రాణం అంతా టీడీపీ అన్నట్లుగానే ఉన్నారు. ఇక 2024 ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా సుజనా చౌదరి.. అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ పోటీ చేసి ఊహించని రీతిలో గెలిచిన పరిస్థితి.
ఎందుకు రాలేదబ్బా..?
రాష్ట్రంలో సుజనా, కేంద్రంలో సీఎం రమేష్ ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రులు అయ్యి తీరుతారని అందరూ అనుకున్నారు.. వాళ్ళు కూడా ఎన్నో కలలు కన్నారు. ఐతే ఆ కలలు సాకారం కాలేదు. ఎందుకంటే ఈ ఇద్దరికీ ఢిల్లీ నుంచి బ్రేకులు పడ్డాయని విశ్వనీయవర్గాల సమాచారం. అంతే కాదు కామినేని శ్రీనివాస్ పరిస్థితి కూడా ఇదేనట. అందుకే.. కట్టర్ బీజేపీ, ధర్మవరం నుంచి గెలిచిన సత్యకుమార్ మాత్రమే రాష్ట్రంలో మంత్రి అయ్యారని.. ఇక కార్యకర్త నుంచి నరసాపురం ఎంపీగా గెలిచి నిలిచిన శ్రీనివాస వర్మకు కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చి ప్రమోషన్ ఇచ్చింది బీజేపీ హైకమాండ్. ఈ మొత్తం వ్యవహారం వెనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉన్నారని.. ఆయన చెప్పినట్టే చంద్రబాబు అక్షరాలా పాటించారని తెలియవచ్చింది. ఇదే ఆ ఇద్దరికీ మంత్రి పదవులు రాకపోవడం వెనుక ఉన్న పెద్ద మతలబు అని ఢిల్లీ, ఆంధ్రా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం బీజేపీ కోసం కాకుండా టీడీపీ కోసం పని చేస్తున్నారని కమలనాథులు పసిగట్టడమే కారణమని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి. ఐతే ఇంకో మంత్రి పదవి ఖాళీగా ఉండటంతో దీనికి సీనియర్లు, హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య, సుజనా చౌదరి, రఘురామరాజు రేసులో ఉన్నారట. ఏం జరుగుతుందో చూడాలి మరి.