ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, 24 మంది మంత్రులు ప్రమాణం చేశారు. ఇంకా ఎవరెవరికి ఏయే శాఖలు అనేది క్లారిటీ రాలేదు. ఐతే.. చంద్రబాబు చెప్పిన తొలి సంతకం సంగతి ఏంటి..? అనే రచ్చ సోషల్ మీడియాలో మొదలైంది. ఇక టీడీపీ అంటే గిట్టని మీడియా సంస్థలు ఐతే అబ్బో పెద్ద పెద్ద హెడ్డింగులు వేసి మరీ హడావుడి షురూ చేశాయి. ఐతే ఒక్క మొదటి సంతకం కాదు.. ఐదు సంతకాలపై కూటమి క్లారిటీ ఇచ్చేసింది.
ఎప్పుడు.. ఏంటి..?
ఏపీ సీఎంవో నుంచి అందుతున్న సమాచారం మేరకు గురువారం సాయంత్రం 4:41 గంటలకు చంద్రబాబు బాధ్యతలు స్వీకరించబోతున్నారు. మెగా డీఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం, పింఛన్ రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం, అన్నక్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, స్కిల్ సెన్సెస్‌పై ఐదో సంతకం చంద్రబాబు చేయనున్నారు. ఇందుకుగాను ప్రమాణ స్వీకారం తర్వాత ప్రత్యేకంగా తన నివాసంలో తన కేబినెట్ సహచరులతో చంద్రబాబు సమావేశమై నిశితంగా చర్చించారు.
ఎంత హడావుడి..!
చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీపై చేయకపోయే సరికి వైసీపీ సోషల్ మీడియా ఏంటో రచ్చ చేసింది. నాడు వైఎస్ఆర్ అలా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి.. ఇలా తొలి సంతకం చేసారు అని గుచ్చి గుచ్చి మరీ టీడీపీని ప్రశ్నించిన పరిస్థితి. అబ్బే చంద్రబాబు మాట కథే అస్సలు నిలబడరు అని కొందరు అంటే.. పెన్ మిస్ అయ్యిందబ్బా అని మరికొందరు సెటైర్లు వేశారు. ఇంకొందరు ఐతే.. మెగాస్టార్ వచ్చారు చాలదా.. ఇక మెగా డీఎస్సీ ఏం అవసరం..? అని అంటే.. మెగాస్టార్ అనబోయి మెగా డీఎస్సీ అని నాడు చంద్రబాబు తప్పుగా పలికారేమో అని చిత్ర, విచిత్రాలుగా కామెంట్స్ చేసిన పరిస్థితి. దీనికి అంతే రీతిలో టీడీపీ కూడా కౌంటర్ ఇవ్వడం.. ఇప్పుడు ఏకంగా తొలి సంతకం ఒక్కటే కాదు మొదటి ఐదు సంతకాలు ఇదిగో అంటూ వైసీపీని చాచి కొట్టినట్టుగా సమాధానం ఇచ్చింది.