ఈరోజు కూటమి నేతలంతా కలిసి తమ తమ ఎమ్యెల్యేలతో విజయవాడ వేదికగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ని సీఎం గా ప్రతిపాదిస్తున్నట్టుగా ప్రకటించారు. జైలులో ఉన్నప్పుడు చంద్రబాబు అనుభవించిన మానసిక క్షోభని, ఆయన ఎంతగా నలిగిపోయారో అనేది చూసాను. మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం.. ప్రజల కోసమే పని చేసే ప్రభుత్వమంటూ పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఆలింగనం చేసుకున్నారు.
చంద్రబాబు పవన్, పురంధరేశ్వరిలకి కృతఙ్ఞతలు చెబుతూ.. తప్పు చేసినవాడిని క్షమించి, పూర్తిగా వదిలిపెడితే అది అలవాటుగా మారుతుంది. తప్పు చేసినవాళ్లకు చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస, కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలి. పదవి వచ్చిందని విర్రవీగొద్దు. వినయంగా ఉండాలి అని స్పష్టం చేశారు.
ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా తాను బుధవారం నాలుగోసారి ప్రమాణం చేయబోతున్నానని.. రేపటి ప్రమాణానికి ఉన్న ప్రాధాన్యత వేరని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని మోదీ హామీ ఇచ్చారన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో మనపై బాధ్యత పెరిగిందన్నారు.
తాను జైల్లో ఉన్నప్పుడు పవన్ కల్యాణ్ వచ్చి పరామర్శించడమే కాకుండా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పారని బాబు గుర్తు చేశారు. జనసేన, బీజేపీతో పొత్తు కలిసొచ్చిందని పవన్ కి మరోసారి థాంక్స్ చెప్పారు.