నందమూరి ఫ్యామిలీ అంటే బ్లడ్, బ్రీడ్ వేరు.. సినిమాలు మొదలుకుని రాజకీయాల వరకూ మేం చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా చెప్పుకునే నందమూరి బాలకృష్ణ ఈసారైనా మంత్రి అవుతారా..? అసలు ఆ అదృష్టం బాలయ్యకు ఉందా..? మంత్రిగా చూసే భాగ్యం ఉందా లేదా అని నందమూరి అభిమానులు, కుటుంబీకులు, కార్యకర్తలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో ఒకవేళ బాలయ్య మంత్రి ఐతే.. ఏ శాఖ ఇవ్వొచ్చు..? అసలు ఆయన మనసులో మంత్రిగా పని చేయాలని ఉందో.. లేదో అనే సందేహాలు కూడా పెద్ద ఎత్తునే వస్తున్నాయ్..!
ఉందా.. లేదా..?
రీల్ లైఫులో వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భవంత్ కేసరి సినిమాలు హ్యాట్రిక్ కొట్టి.. నిజ జీవితంలోనూ హిందూపురం ఎమ్మెల్యేగా 2014, 2019, 2024 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టిన బాలయ్యను ఈసారి మంత్రిగా చూడాలని అభిమానులు, నందమూరి కుటుంబ సభ్యులు ఎంతగానే ఆశపడుతున్నారు.. పదవి ఇచ్చి తీరాల్సిందే అనే డిమాండ్ సైతం సర్వత్రా వస్తోంది. ఎందుకంటే 2014 లోనే బాలయ్యకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని అభిమానులు ఆశించినప్పటికీ ఎందుకో వర్కవుట్ కాలేదు. ఐతే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఉన్నట్లు తెలిసింది.
వస్తే ఇద్దరు.. ఏ శాఖ!
ఒకవేళ బాలయ్యకు మంత్రి పదవి ఇస్తే పరిస్థితి ఏంటి..? ఏ శాఖ ఇవ్వొచ్చు..? అనేది కూడా చర్చ జరుగుతోంది. హ్యాట్రిక్ ఎమ్మెల్యే మనసులో సినిమాటోగ్రఫీ మంత్రి ఐతే బాగుంటుందని తన అనుయాయులతో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆంధ్రాలో కూడా సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలని, నాన్న గారు ఎన్టీఆర్ ఇండస్ట్రీ పరంగా కలలు కన్న ఎన్నో కలలుగానే మిగిలిపోయాయని అందుకే సినిమాటోగ్రఫీ ఆశిస్తున్నట్లు తెలియవచ్చింది. ఇదే జరిగితే హ్యాట్రిక్ బాలయ్యను.. మంత్రి బాలయ్యగా చూస్తాం అన్న మాట. ఇదిలా ఉంటే టాలీవుడ్ స్టార్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా డిప్యూటీ మినిస్టర్ పదవి దక్కబోతోంది. దీంతో పాటు వ్యవసాయ లేదా పర్యావరణ శాఖ దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అంటే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కనున్నాయి అన్న మాట. దీనిపై క్లారిటీ రావాలంటే 24 గంటలు వేచి చూడాల్సిందే మరి.