టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బుధవారం అనగా జూన్ 12 తేదీన ఉదయం 11:27 గంటలకు నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ ప్రమాణం ఉండబోతోంది. ఈ ప్రమాణ స్వీ కారోత్సవం చూడాలని తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక చంద్రబాబు కేబినెట్‌లో ఎవరెవరు ఉండబోతున్నారు..? జనసేనకు ఎన్ని మంత్రి పదవులు.. శాఖలు ఇవ్వొచ్చు..? బీజేపీకి ఎన్ని ఏ శాఖలు దక్కొచ్చు..? టీడీపీ నుంచి ఎవరెవరు మంత్రులు అవ్వొచ్చు..? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
లెక్క తెలినట్టేనా..?
ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు..? ఏయే శాఖలు ఇవ్వాలి..? ముఖ్యంగా ఆర్థిక, హోమ్, ఐటి శాఖలు ఎవరెవరికి కట్టబెట్టాలి..? అని మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూర్చొని నిశితంగా చర్చించారు. మరోవైపు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రి పదవి కొట్టాల్సిందే అని ఆశావహులు క్యూ కట్టేస్తున్నారు. ఇక చంద్రబాబుకు అత్యంత దగ్గరి మనుషులతో కొందరు.. నారా లోకేష్ తో మరికొందరు టచ్ లోకి వెళ్లి పైరవీలు సైతం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే మంత్రి వర్గ కూర్పుపై దాదాపు క్లారిటీ వచ్చేసిందని తెలుస్తోంది. ఐతే మంగళవారం జరిగే కూటమి పార్టీల టీడీపీ, జనసేన, బీజేపీ నేతల కీలక సమావేశంతో మంత్రి పదవులు ఫైనల్ కావొచ్చని తెలియవచ్చింది.
ఎవరికి ఎన్ని..?
విశ్వసనీయ, టీడీపీ వర్గాలు చెబుతున్న సమాచారం మేరకు మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు పూర్తయినట్లు సమాచారం. కాపు, కమ్మ సామాజిక వర్గాల నుంచి ఐదు నుంచి ఆరుగురికి మంత్రి పదవులు దక్కనున్నాయట. ఇక రెడ్డి 05, బీసీ 05, ఎస్సీ, ఎస్టీలకు 05 మంత్రి పదవులు ఇవ్వాలని ఒక క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. దీంతో పాటు ఓసీ సామజిక వర్గానికి మూడు మంత్రి పదవులు దక్కనున్నాయి అని సమాచారం. ఇక జనసేనకు నాలుగు, బీజేపీకి రెండు.. మిగిలిన పదవులు అన్నీ టీడీపీకే అని తెలుస్తోంది. ఈ మొత్తం మీద చాలా మంది సీనియర్లు ఉన్నారని.. జూనియర్లు ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారని సమాచారం. కడప నుంచి మాత్రం పక్కాగా ఒకరికి మంత్రి పదవి దక్కుతుందని తెలుస్తోంది. ఒక్క 24 గంటలు ఆగితే మంత్రి వర్గంపై క్లారిటీ వచ్చేయనుంది.