హోం వద్దు బాబోయ్ అంటున్న పవన్!
అదిగో గబ్బర్ సింగ్.. ఇక రియల్ లైఫ్‌లో పోలీసు డిపార్ట్‌మెంట్‌ను ఏలబోతున్నాడు..! ఇన్నాళ్లు రీల్‌లో ఒక ట్రెండ్ సెట్ చేసి.. ఇప్పుడిక రియల్ లైఫ్‌లో తన స్టయిల్ చూపించబోతున్నాడు..! దమ్ముంటే ఇక కాస్కోండి..! ఇవీ గత కొన్నిరోజులుగా సోషల్ మీడియా వేదికగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి అభిమానులు అనుకున్న మాటలు. అంతేకాదు.. తమ అభిమాన నేత, హీరోకు ఆంధ్రప్రదేశ్ హోం శాఖ రాబోతోందని కార్యకర్తలు తెగ సంబరాలు చేసుకున్నారు. అబ్బే.. అస్సలు వద్దు బాబోయ్ అని పవన్ చెప్పినా సరే.. ఆ టైమ్‌కు కచ్చితంగా తీసుకుంటారని సేనాని మనసులో హోం ఉందని జనసైనికులు, వీరాభిమానులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అయితే ఏ రేంజిలో ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారో.. అంతకుమించి ఆ ఆశలన్నింటినీ ఆవిరి చేసేశారు సేనాని.
వద్దు బాబోయ్ వద్దు..!
హోం వద్దంటే వద్దు బాబోయ్ అని ఇప్పటికే రెండు, మూడు సార్లు జాతీయ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చినప్పటికీ అబ్బే.. సమస్యే లేదు హోం శాఖ తీసుకోవాల్సిందేనని కార్యకర్తలు మొదలుకుని నేతలు, గెలిచిన ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారట. అయితే పవన్ మాత్రం ఇటీవలే తనకు పర్యావరణ, వ్యవసాయ శాఖ అంటే ఇష్టమని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఓ పేరుగాంచిన మీడియా సంస్థతో మాట్లాడిన సేనాని ఇలా క్లారిటీ ఇచ్చుకున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి సమయం ఆసన్నమవ్వడంతో మరోసారి హోం మినిస్టర్‌పై రచ్చ జరుగుతోంది. దీంతో మరోసారి మీడియాతో మాట్లాడి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.
డిప్యూటీ అంతే..!
ఇక చివరిగా పవన్.. పర్యావరణ లేదా వ్యవసాయ శాఖ తీసుకుని, డిప్యూటీ తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పకనే చెప్పేశారు. ఇండియా టుడే వేదికగా తన మనసులోని మాటను, ఆసక్తిని బయటపెట్టేశారు. ఒకే ఒక్కరోజు ఓపిక పడితే సేనానికి ఇచ్చే శాఖ ఏదన్నది తేలిపోనుంది. నాలుగైదు రోజులుగా చంద్రబాబు, పవన్ ఇద్దరూ హస్తినలో బిజిబిజీగా ఉన్నారు. ఎన్డీఏ సమావేశం మొదలుకుని ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం వరకూ ఢిల్లీలోనే ఉన్నారు. ఇక పవన్‌ను అయితే వ్యక్తి కాదు తుఫాన్ అని మరీ పొగడ్తలతో ముంచెత్తడం చూశాం. ఇక జూన్-12న ఉదయం 11:27 గంటలకు గన్నవరం దగ్గరలోని 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తుతో స్జేజీని సిద్ధం చేస్తున్నారు. ఇక తక్కువలో తక్కువ లక్షన్నర నుంచి రెండు లక్షల మంది జనాలు కార్యక్రమానికి విచ్చేయనున్నట్లు తెలుస్తోంది. 24 గంటలు ఆగితే.. పవన్ పదవితో పాటు ఎవరెవరికి ఎన్ని మంత్రి పదవులు..? ఏయే శాఖలు..? అనేది తేలిపోనుంది.