కేంద్రంలో తెలుగోడి హవా..!
కేంద్ర కేబినెట్‌లో తెలుగోడి హవా ఇక పెరగనుంది..! ఇన్నాళ్లు ఒకటి రెండుకే పరిమితమైన కేంద్ర మంత్రి పదవులు ఇప్పుడు ఐదుకు పెరిగాయి. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి మంత్రి పదవులు అంతంత మాత్రమే.. 2024లో మాత్రం ఒక్కసారిగా పదవులు పెరిగాయి. ఏపీ నుంచి మిత్రపక్షమైన టీడీపీకి రెండు బెర్త్‌లు, బీజేపీ నుంచి ఒకరికి.. తెలంగాణ నుంచి ఇద్దరు సీనియర్లను పదవులు వరించనున్నాయి. ఇప్పటికే కాబోయే మంత్రులను ఢిల్లీకి పిలిపించుకున్న మోదీ.. తన నివాసంలో తేనీటి విందు ఇచ్చారు. ఇక ఇవన్నీ ఒక ఎత్తయితే లోక్‌సభ స్పీకర్‌గా పురంధేశ్వరిని నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలుస్తోంది.
ఏపీ నుంచి ఎవరు..?
ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు యువ ఎంపీలు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌లను మంత్రి పదవి వరించింది. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఇక విదేశాల్లో డాక్టర్‌గా ఉన్న పెమ్మసాని తొలిసారి గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీచేసి గెలిచి.. మంత్రి పదవి దక్కించుకున్నారు. టీడీపీ నుంచి మొత్తం 16 మంది ఎంపీలు గెలవగా.. ఈ ఇద్దరినే అదృష్టం వరించింది. పెమ్మసాని దేశంలో అత్యంత ధనవంతుడు కూడా. ఇక బీజేపీ నుంచి నరసాపురం నుంచి గెలిచిన శ్రీనివాస వర్మకు కూడా కేంద్ర మంత్రి పదవి దక్కబోతోంది. కాగా.. తొలిసారి ఏపీ బీజేపీ నుంచి ఈయన్ను తీసుకోవడంతో పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నాయి. ఇక పురందేశ్వరికి కేబినెట్‌లో చోటు ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ ఇంతవరకూ క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఢిల్లీలోనే ఆమె పడిగాపులు కాస్తున్నట్లు సమాచారం. అయితే.. స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణ నుంచి ఎవరు..?
ఇక తెలంగాణ నుంచి ఇద్దరు సీనియర్లకు కేంద్ర మంత్రి పదవులు దక్కబోతున్నాయి. ఇందులో ఒకరు కిషన్ రెడ్డి లేదా డీకే అరుణ.. బండి సంజయ్. కిషన్ రెడ్డి పేరు ఇంకా ఖరారు కాలేదు కానీ.. మోదీ నివాసంలోనే ఈయన ఉన్నారు. ఢిల్లీ నుంచి ఫోన్ రావడంతో హైదరాబాద్ నుంచి పరుగులు తీశారు. డీకే సైతం హస్తినలోనే ఉన్నారు. ఎప్పుడెప్పుడు తనపేరు వస్తుందా అని ఎదురుచూపుల్లో ఉన్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి ఈటల రాజేందర్ పేరు వస్తుందని అభిమానులు, కార్యకర్తలు ఆశించినప్పటికీ అబ్బే అస్సలు రాలేదు. అటు తిరిగి ఇటు తిరిగి బండి సంజయ్ పేరే ఫైనల్ అయ్యింది. చూశారుగా.. ఏపీ నుంచి ముగ్గురు.. తెలంగాణ నుంచి ఇద్దరు అంటే మొత్తం ఐదు మంది అన్న మాట. దీన్ని బట్టి చూస్తే దేశ రాజధాని ఢిల్లీలో తెలుగోడి హవా పెరగనుంది. ఇక వీరు మంత్రులయ్యి తెలుగు రాష్ట్రాలకు ఏ మాత్రం ఉద్దరిస్తారో చూడాలి మరి.