మీడియా మొఘల్, ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు, ఎగ్జిబిటర్, స్టూడియో అధినేత చెరుకూరి రామోజీరావుకు అశ్రు నయనాలతో అంత్యక్రియలు పూర్తయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతి వనంలో రామోజీరావు అంత్యక్రియలను నిర్వహించింది. రామోజీరావు తనయుడు కిరణ్ అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. రామోజీరావుకు కడసారి వీడ్కోలు పలికేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు రామోజీ సంస్థల ఉద్యోగులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చారు.
పోలీసులు గాల్లోకి తుపాకులు పేల్చి రామోజీరావుకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. అంతకు ముందు రామోజీరావుకు తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా వీడ్కోలు పలికారు. రామోజీరావు పాడె మోసి మరీ ఆయనకు నివాళులు అర్పించారు.
రామోజీరావు అంతిమయాత్ర రామోజీ ఫిలిం సిటీలోని ఆయన ఇంటి నుంచి ప్రారంభమై... ఫిలిం సిటీ వీధుల గుండా అశేష జనవాహిని కన్నీటి వీడ్కోలతో.. నారాయణ మంత్రాలతో.. రామోజీ అమర్ రహే అనే నినాదాలతో.. ఆయన సొంతగా నిర్మించుకున్న స్మృతి వనం వరకు సాగింది.