ఐదేళ్లు ఎన్నో ఉద్యమాలు.. మరెన్నో కార్యక్రమాలు..! ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం రైతన్నలు, తెలుగు ప్రజలు చేసిన ఉద్యమం గల్లీ నుంచి యావత్ ప్రపంచం మొత్తం చూసింది. రాజధాని ఇక్కడే పెట్టండి మహాప్రభో అని అమరావతి రైతులు మొత్తుకున్నారు..! సమస్యే లేదు.. రాజధాని ఉంటుంది కానీ శాసన రాజధాని మాత్రమేనని సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్ని రాద్ధాంతాలు చేశారో తెలియనిదేమీ కాదు. దీనికి తోడు మూడు రాజధానులు అని చెప్పి చేసిందేమైనా ఉందా..? అంటే అదీ లేదు. దీంతో అమరావతి మొత్తం పిచ్చి మొక్కలు, కంపలుతో నిండిపోయింది. ఆఖరికి అమరావతిని శ్మశానం పోల్చిన సందర్భాలు ఎన్నో..! సరిగ్గా ఐదేళ్లు తిరిగేసరికి అమరావతికి ఊపిరి వచ్చింది.. ఇక ఊపిరి పీల్చుకో అంటూ చంద్రబాబు వచ్చేశారు..!
ఇక మొదలెడదమా..?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఊహించని రీతిలో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. జూన్-12న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇష్టానుసారం నిర్ణయాలు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైసీపీని అధ:పాతాళానికి రాష్ట్ర ప్రజలు తొక్కేశారు. ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకే ప్రజలు పరిమితం చేశారంటే వైఎస్ జగన్ పాలనపై ఎంత విసిగి వేసారిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఇక విజనరీ, అభివృద్ధి కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన చంద్రబాబు హయాంలో అమరావతి అభివృద్ధి చెందుతుందని అమరావతి ప్రజలు ఎంతో విశ్వసిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతికి రాజధాని కళ వచ్చేసింది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిచిపోయిన రాజధాని పనులు 2024లో చంద్రబాబు గెలిచాక షురూ అయ్యాయి.
రంగంలోకి సీఆర్డీఏ!
నాడు నిలిచిపోయిన పనులతో రాజధాని అమరావతి ప్రాంతం అంతా ఎటు చూసినా పిచ్చి మొక్కలు, కంపలు భారీగా పెరిగిపోయాయి. దీంతో అసలు ఇది రాజధానా లేకుంటే మరేదైనానా..? అన్నట్లు సందేహాలు వచ్చిన పరిస్థితి. ఆఖరికి రాజధాని భవనాల కోసం ఉన్న మట్టి, కంకర, ఇసుక కోసం రోడ్లు సైతం తవ్వుకుపోయిన పరిస్థితులు నాడు ఉండేవి. అయితే ఏపీలో ఇప్పుడు అధికారం మారింది.. రాజధానికి మంచి రోజులు వచ్చేశాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనుండటంతో రాజధాని ప్రాంతంపై సీఆర్డీఏ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా.. నాడు రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని అధికారులు దగ్గరుండి మరీ శుభ్రం చేయిస్తున్నారు.
హమ్మయ్యా..!!
రాజధాని అమరావతి ప్రాంతంలో సీడ్ యాక్సెస్ రోడ్ల వెంట ఉన్న చెత్తను సైతం తొలగించే పనులు మొదలయ్యాయి. ఇక రోడ్ల మధ్యలో ఏర్పడిన గుంటలు పూడ్చివేతకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీంతోపాటు ఐఎఎస్ క్వార్టర్లు, ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ క్వార్టర్లు, హైకోర్టు, సెక్రటేరియట్, జడ్జీల బంగ్లాలు, క్రికెట్ స్టేడియం, ఎన్ఐడీ నిర్మాణ ప్రాంతాలతో పాటు విట్, ఎస్ఆర్ఎమ్ క్లీనింగ్ పరిధిలో సీఆర్డీఏ అధికారులు పనులు చేయిస్తున్నారు. మరోవైపు.. పెద్ద ఎత్తున ప్రోక్లెయినర్లు, యంత్రాలతో సీఆర్డీఏ అధికారులు పనులు చేయిస్తున్నారు. ఈ పనులు చూసిన రాజధాని ప్రాంత వాసులు, రైతులు.. రాష్ట్ర ప్రజలు ఎంతో హ్యాపీగా ఫీలవుతున్నారు. హమ్మయ్యా.. రాజధానికి మంచిరోజులు వచ్చేశాయని చెప్పుకుంటున్నారు.