ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెల్లవారుజామున 4:50 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీరావును నానక్‌రామ్‌గూడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించిన వైద్యులు.. ఆయన్ని బతికించాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేశారు. రామోజీ మరణంతో జర్నలిజ లోకం మూగబోయింది. ఈ వార్త విన్న పలువురు జర్నలిస్టులు అయ్యో.. పెద్దాయన, మార్గదర్శకుడు ఈసారి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివస్తారు అనుకుంటే ఇలా జరిగింది ఏంటి..? అని బాధపడుతున్నారు.
ఎవరీ రామోజీ..!
ఉమ్మడి కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న రామోజీరావు జన్మించారు. బీఎస్సీ చదివిన రామోజీ తొలుత ఒక యాడ్ ఏజెన్సీలో పనిచేశారు. 1961లో రమాదేవిని వివాహమాడి మార్గదర్శిని ప్రారంభించారు. ఇది తొలి బిజినెస్ కాగా ఆ తర్వాత ఎన్నో వ్యాపారాలు ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. 1974లో ఈనాడు సంస్థలు ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు మీడియా అన్నా.. దినపత్రిక అన్నా వినిపించే, కనిపించే వ్యక్తి రామోజీరావు. ఈయన్నే మీడియా మొఘల్ అని కూడా అంటారు. 2016 లో పద్మవిభూషణ్ అవార్డు కూడా రామోజీని వరించింది.