పవన్ కళ్యాణ్ ఎమ్యెల్యే గా గెలిచి జనసేన పార్టీ ఆఫీసులో ఎంత ఆనందంగా కనిపించారో.. చంద్రబాబు ని మీటయ్యి, అక్కడినుంచి గెలిచిన జనసేన నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత విజయవాడ నుంచి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. అక్కడ కొడుకు అకీరా, భార్య అన్న తో కలిసి మోడీని మీటయ్యి నేడు గురువారం హైదరాబాద్ కి వచ్చారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా పవన్ కళ్యాణ్ మెగాస్టార్ అశీసులు కోసం ఆయన ఇంటికి సతీ సమేతంగా వెళ్లారు.
అక్కడ పవన్ కారు దిగగానే మెగా ఫ్యామిలీ ఆయనకి పూల వర్షంతో అపూర్వ స్వాగతం పలికింది. ఆ తర్వాత రామ్ చరణ్ బాబాయ్ ని సాదరంగా ఆహ్వానించగా.. పవన్ కళ్యాణ్ ముందుగా తల్లి ఆశీస్సులు, తర్వాత వదినమ్మ సురేఖ ఆశీస్సులు తీసుకున్నారు. తల్లి అంజనాదేవి పవన్ కి గుమ్మడికాయ దిష్టి తీసెయ్యగా.. వదిన సురేఖ, చెలెళ్ళు కూడా పవన్ కి హారతులిచ్చారు. ఆ తర్వాత మెగాస్టార్ పవన్ కళ్యాణ్ ని ఆత్మీయంగా హగ్ చేసుకోవడానికి ముందు రాగా.. పవన్ కళ్యాణ్ ఊహించని విధంగా మెగాస్టార్ పాదాల మీద పడి ఆశీస్సులు తీసుకున్న విజువల్స్ చూసి మెగా అభిమానులు ముచ్చటపడుతుంటే.. కామన్ ఆడియన్స్ కూడా ఈ అపురూప క్షణాలను ఎంజాయ్ చేసారు.
పవన్ కళ్యాణ్ ఆయన భార్య అన్న కి మెగాస్టార్ దంపతులు నూతన వస్త్రాలు బహుకరించి కేక్ కట్ చేయించారు. మెగా ఫ్యామిలిలో మెగాస్టార్ కుటుంబం, నాగబాబు ఫ్యామిలీ, పవన్ సిస్టర్స్ ఫ్యామిలీస్ అందరూ పవన్ కళ్యాణ్ విక్టరీని కన్నుల పండుగగా జరుపుకున్నారు. పవన్ తల్లి అంజనాదేవి కొడుకు విజయంతో పులకించిపోయారు.
మెగాస్టార్ పవన్ కళ్యాణ్ మెడ లో పూల దండ వేస్తున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ తెగ నవ్వుకున్నారు. పవన్ భార్య అన్న కుడా మెగాస్టార్ ఆశీస్సులు తీసుకుంది. పవన్ కి తన కుటుంబ సభ్యులంతా హగ్ చేసుకుని మరీ శుభాకాంక్షలు తెలియజేసారు. మెగా ఫ్యామిలిలో పవన్ కళ్యాణ్ విజయం సంబరాలు తెచ్చిపెట్టింది అని ఆ వీడియో చూస్తే స్పష్టమవుతుంది.