హస్తినకు చంద్రబాబు.. బిగ్ ట్విస్ట్ ఉంటుందా?
ఏపీ ఎన్నికల్లో ఊహించని రీతిలో గెలిచిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఇక ఢిల్లీలో చక్రం తిప్పడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లే తెలుస్తోంది. కూటమి గెలిచాక తొలిసారి మీడియా ముందుకు వచ్చిన చంద్రబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీలో ఏం జరుగుతుందో అని సర్వత్రా చర్చించుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే.. ఎన్డీఏ కూటమికి మెజారిటీ దక్కినప్పటికీ కేంద్రంలో ప్రభుత్వంను ఏర్పాటు చేసే పరిస్థితి ఐతే కనిపించడం లేదు. దీంతో.. నితీష్ కుమార్, చంద్రబాబు, నవీన్ పట్నాయక్ కాస్త యూటర్న్ తీసుకుంటే పరిస్థితులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అసలు సిసలైన సినిమా ఢిల్లీలో కనిపిస్తోంది. దేశమే కాదు.. ప్రపంచమే ఢిల్లీ వైపు చూస్తున్న పరిస్థితి.
బాబు ఏం చేస్తారో..?
ఎన్డీఏ కూటమిగా వెళ్లిన చంద్రబాబు ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఐతే జనసేన, బీజేపీతో సంబంధమే లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగేలా 135 సీట్లు టీడీపీ దక్కించుకుంది. దీంతో ఇప్పుడు బాబు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు..? అనే దానిపై సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. అటు ఇండియా కూటమితో బాబు ముందుకు నడిచినా ఆశ్చర్యాపోనక్కర్లేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా నిమిషాల్లో ఇస్తామని కాంగ్రెస్ బహిరంగ ప్రకటనే చేస్తోంది. దీంతో బాబు ఢిల్లీ వేదికగా ఏం చేయబోతున్నారు..? అనేది చూడాలి.
అవును నిజమే..!!
మీడియా మీట్ సందర్భంగా మీ పయనం ఎటు అని చంద్రబాబును విలేకరులు ప్రశ్నించగా.. ప్రస్తుతం ఎన్డీఏతో ఉన్నానని చెప్పారు. ఇవి నిజంగా కేంద్రంలో ఎవరికి మద్దతిస్తారనే విషయంపై కీలక వ్యాఖ్యలే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ప్రస్తుతం అని చెప్పడంతో తర్వాత సంగతి ఏంటి..? అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. పైగా ఇప్పుడు ఢిల్లీకి చంద్రబాబు, పవన్ ఇద్దరూ పయనం అయ్యారు కూడా. బీజేపీ పెద్దలతో సమావేశం కానున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. రాజకీయాల్లో తనకు ఎంతో అనుభవం ఉందని.. ఎన్నో రాజకీయ మార్పులను చూశానని చెప్పడం ఢిల్లీకి వెళ్లొచ్చాక మార్పులు ఏమైనా తప్పకుండా చెబుతా అని కూడా చంద్రబాబు కామెంట్ చేశారు కూడా..! మొత్తానికి చూస్తే బాబు బిగ్ ట్విస్ట్ ఇవ్వొచ్చని రాజకీయ విశ్లషకులు, టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఉప్పు నిప్పులు కలిశాయి!
ఇదిలా ఉంటే.. ఎలాగైనా సరే ఇండియా కూటమి ప్రధానిని డిసైడ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యింది. అందుకే.. కూటమిని వదిలి వెళ్ళిన, ఎన్డీఏ లోని మిత్రపక్షాలను చీల్చడానికి, అసంతృప్తులను తమవైపు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలే చేస్తోంది కాంగ్రెస్. ఇందులో భాగంగా.. బీహార్ సీఎం నితీష్ కుమార్ యాదవ్ తో సంప్రదింపులు జరుపుతోంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే నిన్న మొన్నటి వరకూ బద్ధ శత్రువులుగా, ఉప్పు నిప్పులుగా ఉన్న ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ కూడా నితీష్ తో కలిసేందుకు, కలిసి నడవడానికి సిద్ధం అయ్యారు. ఇద్దరూ నవ్వుతూ ఒకే విమానంలో ఢిల్లీకి బయలుదేరడం ఆలోచించాల్సిన విషయమే. దీంతో హస్తిన వేదికగా ఏదో జరగబోతోందని అర్థం చేసుకోవచ్చు.