ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భారీ విజయాన్ని దక్కించుకున్న కూటమి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 9 తారీఖున టీడీపీ అధినేత నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా మీడియా మీట్ నిర్వహించిన చంద్రబాబు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎన్నికల పోలింగ్ మొదలుకుని గెలుపు వరకూ అన్ని విషయాలు ప్రస్తావిస్తూ మాట్లాడారు. ముందుగా.. మీడియాకు స్వాతంత్రం వచ్చిందంటూ ప్రెస్ మీట్ మొదలు పెట్టారు. ప్రజలకు శిరస్సు వంచి ధన్యావాదాలు చెప్పారు. గత ఐదేళ్లల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తన రాజకీయ జీవితంలో చూడలేదనీ.. అన్ని వ్యవస్ధలను ధ్వంసం చేశారని విమర్శలు గుప్పించారు.
ఏదీ శాశ్వతం కాదు..!
ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలనే నినాదంతోనే ఎన్నికలకు వెళ్ళామని బాబు చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయని.. ఏదీ శాశ్వతం కాదన్నారు. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే వ్యక్తులు, రాజకీయ పార్టీలు కనుమరుగు అవుతాయని వైసీపీని, వైఎస్ జగన్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా బాబు అన్నారు. ఎక్కడో దూర తీరాల్లో ఉన్నవాళ్లు.. కూలీ పనులు చేసుకునే వాళ్లు కష్టంతో వచ్చి ఓటేశారని.. టీడీపీ, ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలు ఇవన్నారు.
బద్దలు కొట్టాం..!
ఐదేళ్ల పాలనలో ప్రజలు స్వేచ్ఛని కొల్పోయారని.. అందుకే అందరం కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేశామన్నారు. ఈ ఎన్నికల్లో కంచుకోటలు బద్దలు చేశామని.. మెజార్టీలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయన్నారు. ఈ ఎన్నికలను ఏ విధంగా అభివర్ణించాలో అర్థం కావడం లేదని.. అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడి తత్వం వంటివి ప్రజలు సహించరని.. అందుకే వైసీపీకి ప్రజలు గుణపాఠం నేర్పించారన్నారు.
ఎన్నో నిద్రలేని రాత్రులు..!
ఐదేళ్లు ఎన్నో ఇబ్బందులు పడ్డామని..నిద్రలేని రాత్రులు గడిపామన్నారు. జై జగన్ అనకుంటే చంపేస్తామన్నా.. లెక్క చేయకుండా జై తెలుగుదేశం అని నినాదాలు చేసిన చంద్రయ్య లాంటి కార్యకర్తలను ఎలా మరువగలమన్నారు. జనసేనా అధినేత పవన్ కల్యాణ్ కు కూడా స్వేచ్ఛ లేకుండా చేశారని.. విశాఖలో ఉండొద్దని నగర బహిష్కరణ చేసిన పరిస్థితిని ఈ సందర్భంగా బాబు గుర్తు చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత విషయాలు చెబుతామనే పరిస్థితులు చూశామన్నారు. మళ్ళీ చెబుతున్నా మేం పాలకులం కాదు సేవకులం అని మాకొచ్చింది అధికారం కాదు.. బాధ్యత అన్నారు. మేనిఫెస్టో.. సూపర్ సిక్స్ వంటివి ప్రజల్లోకి వెళ్లాయని.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ ముందుకొచ్చారని చంద్రబాబు మెచ్చుకున్నారు. పవనే కూటమికి బీజం వేశారని.. కూటమిలో ఉన్న మూడు పార్టీలు బేషజాలకు పోకుండా కలిసి పని చేశామన్నారు. మొత్తం మీద చూస్తే.. ఇక ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవని చంద్రోదయమే అని అర్థం వచ్చేలా చంద్రబాబు చెప్పుకొచ్చారు.