ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల రణభేరిలో రారాజు ఎవరు..? ఏపీ ప్రజలు ఎటు వైపు..? ఒకే ఒక్కడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైపా..? టీడీపీతో జతకట్టిన కూటమి వైపా? రైతులు, గ్రామాలు ఇతర వర్గాలు ఎటు..? సంక్షేమ పథకాలు, నవరత్నాలతో అలివిగానివి కాకుండా చెప్పిందే చేస్తా.. చేసేదే చెబుతా అని ఎన్నికలకు వైసీపీని ఆదుకుంటాయా..? విజనరీ, అంతా చేసింది తానే.. అభివృద్ధికి మారు పేరు.. సింహాసనం కోసం ఎదురు చూస్తున్న టీడీపీ అధికారంలోకి వస్తుందా..? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇప్పటి వరకూ వచ్చిన సర్వేల్లో అటు కూటమి అధికారంలోకి వస్తుందని కొన్ని.. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ గెలుస్తుందని లోకల్, జాతీయ మీడియా సంస్థలు.. పేరుగాంచిన సర్వే సంస్థలు తేల్చి చెప్పేశాయి. ఇవన్నీ ఎగ్జిట్ పోల్స్ ఐతే ఎగ్జాక్ట్ పోల్స్ లో గెలిచి నిలిచేది ఎవరు అనేది మరికొన్ని గంటల్లో తెలిపోనుంది.
గెలిచేది ఎవరు..?
2019 ఎన్నికల్లో కనీవినీ ఎరగని రీతిలో దేశమే ఆశ్చర్యపోయేలా 151 సీట్లు దక్కించుకున్న వైసీపీ.. ఈసారి కూడా ఆ ట్రాక్ రికార్డును తిరగరాస్తాం అని చెప్పుకుంటోంది. రికార్డు సృష్టించాలన్నా.. ఆ రికార్డును బ్రేక్ చేయాలన్నా మేమే అన్నట్లుగా వైసీపీ నేతలు చెబుతున్న మాట. అంతే కాదు వైఎస్ జగన్ మొదలుకుని మంత్రులు, పొట్టే చేసిన అభ్యర్థులు.. వైసీపీ కార్యకర్తలు గెలుస్తున్నామని అదికూడా గట్టిగానే సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక టీడీపీలోనూ ఇంతకుమించి ఉత్సాహం నెలకొంది. తెలుగు తమ్ముళ్ళు ఐతే ఏకంగా స్వీట్లు పంచుకుని పండగ చేసుకుంటున్నారు. ఇక జనసేన, బీజేపీ నేతలు ఐతే మునుపెన్నడూ లేని విధంగా సీట్లు దక్కించుకోబోతున్నామని ఆనంద పడుతున్నారు.
ఒకవేళ జగన్ ఓడితే ఏంటి..?
ఒకవేళ వైఎస్ జగన్ ఘోర ఓటమిని చవి చూస్తే చాలా కారణాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా.. 14 మంది సిట్టింగ్ ఎంపీలు.. 37 మంది ఎమ్మెల్యేల తొలగింపు ఈ తప్పు మొదటి స్థానంలో ఉంటుంది. ఇక ఉద్యోగాల కల్పనపై జగన్ ఇచ్చిన హామీలు కొంత మేర కూడా నెరవేరలేదు. కాపు సామాజిక వర్గానికి ఇలాంటి ప్రయోజనాలను జగన్ ప్రభుత్వం అందించలేకపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు అరెస్ట్, చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ మద్దతు, కూటమి ఏర్పాటు, జగన్ రెడ్డిపై ఉన్న వ్యతిరేకత, రాజధాని లేకపోవడం, అభివృద్ధి అనేది అటక ఎక్కడం, నవరత్నాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడమే అని ప్రముఖ సర్వే సంస్థలు చెబుతున్న పరిస్థితి.
చంద్రబాబు గెలిస్తే..!!
ఈసారి టీడీపీ అదేనండీ.. కూటమి గెలిస్తే మాత్రం ఏపీలో అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. చంద్రబాబు అరెస్ట్ వైసీపీకి మైనస్.. టీడీపీకి బాగా ప్లస్ అయ్యిందని విశ్లేషకులు చెబుతున్న మాట. ఈ ఒక్క అరెస్ట్ చంద్రబాబు పట్ల జనాల్లో విపరీతమైన సానుభూతి వచ్చిందని తెలుగు తమ్ముళ్లు మొదటి నుంచీ చెబుతున్నారు. నారా లోకేష్‌ల పాదయాత్రతో క్యాడర్ ని ఏకం చేయడం, యూత్ అంతా తమ వైపు తిప్పడంలో కీలక పాత్ర పోషించారనీ చెబుతున్నారు నిపుణులు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా టీడీపీకి తోడవడంతో ఇది కాస్త ఏపీలో అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశముందని సర్వేలు చెబుతున్నాయి. ఫలితాలకు కౌంట్ డౌన్ మొదలైంది.. ఏం జరుగుతుందో చూడాలి మరి.