ఆరా మస్తాన్.. ఇప్పుడీ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే దేశం మొత్తమ్మీద మార్మోగుతోంది..! ఇంకాస్త ముందుకెళ్తే తెలుగు ప్రజలున్న యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరే వినిపిస్తోంది.. కనిపిస్తోంది..! ఇందుకు కారణం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని చెప్పడమే. అలా ప్రకటన చేశారో లేదో.. ఎవరీ మస్తాన్..? అసలు ఆరా వెనుక ఎవరున్నారని ఆరాలు తీయడం మొదలెట్టేశారు కొందరు అత్యుత్సాహవంతులు. ఇంకొందరైతే ఆయన కులం, మతం.. ప్రాంతం కూడా గూగుల్, తెలిసిన వాళ్లతో అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి. బాబోయ్.. సర్వేకు సంబంధించి ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతుండగానే ఒక్కటే ఫోన్లు.. రాత్రంగా ఒక్కటే గొడవట. ఇక బెట్టింగ్ రాయుళ్లు ఊరికే ఉంటారా..? వైసీపీ నిజంగానే గెలుస్తుందా అని కొందరు.. కూటమి ఎలా గెలవదో చెప్పండని మరికొందరు నాన్ స్టాప్‌గా ఫోన్లు చేశారట. దీంతో దెబ్బకు ఫోన్ స్విచాఫ్ చేసుకుని పడుకున్నారట. ఇదేంటి.. హెడ్డింగ్‌కు సంబంధంలేని మాటలన్నీ మాట్లాడుతున్నారని సందేహం వచ్చింది కదూ.. అక్కడికే వస్తున్న జర ఆగండి..!
ఇదీ అసలు సంగతి..!
94-104 సీట్లతో వైసీపీ గెలుస్తుందని.. ఏపీ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంటిన్యూ కాబోతున్నారని ఆరా మస్తాన్ చెప్పారు. వైసీపీ ఎలా గెలుస్తుంది..? ఏ వర్గంవారు ఈ పార్టీకి ఓటేశారు..? కీలక నేతలు ఎవరెవరు ఓడిపోబోతున్నారు..? గెలవబోతున్న మంత్రులెవరు..? టఫ్ ఫైట్ ఉండే నియోజకవర్గాలు ఏవి..? ఇలా సుమారు గంటపాటు పెట్టిన మీడియా మీట్‌లో క్లియర్ కట్‌గా చెప్పేశారు. ఆ తర్వాత ఈ సర్వేలో నిజమెంత అని టీవీ డిబేట్లలో ఒక్కటే ప్రశ్నలు. ఇక కొన్ని మీడియా సంస్థలు అయితే.. మీ సర్వే అట్టర్ ప్లాప్ అయితే ఏం చేస్తారు..? ఏమవుతారు..? అని కూడా ప్రశ్నించిన పరిస్థితి. అంతేకాదు.. మీరు మరో లగడపాటి కారని నమ్మకమేంటి..? అని డిబేట్లలో ఒక్కటే ప్రశ్నలు. ఇంతలా బల్లగుద్ధి చెబుతున్నారంటే కచ్చితంగా ఫ్లాప్ అవుతుందని సోషల్ మీడియాలో ఒక్కటే ట్రోలింగ్స్. జగన్ రెడ్డితో కలిసున్న ఫొటోలు పోస్టు చేసి మరీ ఇదిగో బలీ కా బకరా కథ అంటూ కొందరు.. ఫలితాల తర్వాత ఎక్కడికి పారిపోతారో అని మరికొందరు ఒక్కటే విమర్శలు చేస్తున్నారు. ఇదివరకు ఈయన చేసిన సర్వేలు అట్టర్ ఫెయిల్యూర్ అయిన సందర్భాలను కూడా గుర్తు చేసుకుంటున్నారు నెటిజన్లు.
ఆరా అవుతారా..?
వాస్తవానికి ఏపీలో వైసీపీకి అనుకున్నంతగా గెలిచే పరిస్థితి లేదని పదుల సంఖ్యలో సర్వేలు తేల్చి చెప్పేశాయి. కొన్ని సర్వేల్లో అసెంబ్లీ స్థానాలు, మరికొన్ని సర్వేలో పార్లమెంట్ స్థానాలు సింగిల్ డిజిట్లలో వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని తేల్చాయి. ఆఖరికి ఇండియా టుడే లాంటి తోపు సంస్థ కూడా కూటమిదే గెలుపని.. జగన్‌కు 55-77 వరకు మాత్రమే వస్తాయని తేల్చింది. ఇన్ని సర్వేలు వచ్చినా సరే.. అబ్బే సమస్యే లేదని చెబుతున్నారు మస్తాన్. నూటికి వెయ్యిశాతం సర్వే కరెక్ట్ అవుతుందని.. అవసరమైతే రాసిపెట్టుకోవాలని సవాల్ చేస్తున్నారు. అంతేకాదండోయ్.. సర్వే ప్లాప్ అయితే అడ్రస్ ఉండనని, మీడియా ముందుకు కూడా రానని చెబుతున్నారు. దీంతో జనాలంతా నాడు 2019 ఎన్నికలప్పుడు లగడపాటి రాజగోపాల్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటున్నారు. టీడీపీ ఊహించని సీట్లతో గెలవబోతోందని.. సర్వే తప్పితే ఇక సర్వేల జోలికే వెళ్లనని చెప్పారు.. అక్షరాలా అట్టర్ ప్లాప్ అవ్వడం అడ్రస్ లేకుండా పోవడం అవన్నీ జరిగిపోయాయి.. అదంతా గతం. మరీ కామెడీ ఏమిటంటే మస్తాన్ సర్వేకు దరిదాపుల్లో కూడా మిగిలిన సర్వేలు లేకపోవడంతో కచ్చితంగా ఆరా మస్తాన్ అవుతారు మరో లగడపాటి అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్న పరిస్థితి. మరి మస్తాన్ ఎగ్జిట్ పోల్ అక్షరాలా నిజమవుతుందా..? లేకుంటే చెప్పినట్లుగానే ఆరాలు తీయకుండా మస్తానే అడ్రస్ లేకుండా పోతారా..? అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ..!!