కూటమికే ఓటేసిన ఇండియా టుడే సర్వే!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే.. కాస్త ఆలస్యం అయినా వచ్చేసింది.! దేశం మొత్తంలో అత్యంత విశ్వసనీయత కలిగిన ఈ సర్వే ఇంకెప్పుడు వస్తుందా..? అని గత 24 గంటలుగా తెలుగు రాష్ట్రాల ప్రజలు, యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి. ఈ సర్వే వైసీపీ గెలుస్తుందా..? కూటమి గెలుస్తుందా..? అనేదానిపై ఏం చెప్పబోతోంది..? అని నరాలు తెగే ఉత్కంఠతో ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు, ఔత్సాహికులు వేయి కళ్లతో ఎదురుచూశారు. లోకల్ మీడియా, సర్వే సంస్థలు.. జాతీయ మీడియా, సర్వే సంస్థలు చెప్పినట్లుగా ఎగ్జిట్ పోల్స్ రోజున కాకుండా మరుసటి రోజు సాయంత్రం 06:30 గంటలకు ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే రిలీజ్ చేసింది.
ఏం తేలింది..?
ఏపీలో అధికారం కూటమిదే అని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా తేల్చి చెప్పింది. కూటమికి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పడంతో పాటు.. ఇందులోని ఏయే పార్టీకి ఎన్ని సీట్లు అనేది క్లియర్ కట్‌గా సర్వేలో వివరించింది. 98-120 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని ఇండియా టుడే స్పష్టం చేసింది. ఇక టీడీపీ పోటీ చేసిన స్థానాల్లో 78-96 సీట్లు గెలిచే అవకాశం ఉందని తెలిపింది. జనసేన విషయానికొస్తే.. పోటీచేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో 16-18 సీట్లు గెలిచే చాన్స్ ఉందని స్పష్టం చేసింది. బీజేపీ అయితే.. 04-06 సీట్లలో గెలుస్తున్నట్లు ఇండియా టుడే సర్వేలో తేలింది. ఇక వైసీపీ అయితే.. 55-77 సీట్లకు మాత్రమే పరిమితం కానుందని తేల్చి చెప్పింది. కాంగ్రెస్ విషయానికొస్తే.. 0-2 సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని ఇండియా టుడే తేల్చింది.
వైసీపీ ఇంత ఘోరమా..?
2019 ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ స్థానాలు దక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఇండియా టుడే రిలీజ్ చేసిన సర్వే ప్రకారం కేవలం 55 సీట్లకు పరిమితం అంటే.. ఒక్కసారిగా ఇంచుమించు 100 సీట్లకు పడిపోవడం అంటే మామూలు విషయం కాదు. అంటే.. ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందన్నది ఈ నంబర్లతో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా.. ఇదే ఇండియా టుడే గత ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని.. 119-135 సీట్లతో అధికారంలోకి వస్తుందని కూడా చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఇంతటి కచ్చితమైన సర్వే ఇచ్చే ఇండియా టుడే ఈ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం పాలవ్వబోతోందని చెప్పడం గమనార్హం. ఇప్పటి వరకూ చాలా సర్వేల్లోనూ వైసీపీకి ఘోర ఓటమేనని తేల్చి చెప్పాయి.. ఇప్పుడిక ఎగ్జాక్ట్ పోల్స్‌లో ఏం తేలుతుందో వేచి చూడాలి మరి.