ఏపీలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయ్ అనేది.. కేంద్రంలోని బీజేపీ పెద్దలు నరేంద్ర మోదీ, అమిత్ షాకు తెలిసిపోయిందా..? అదీ ఎగిట్స్ పోల్స్ ముందే సీన్ అర్థం అయ్యిందా..? అందుకే ముందు నుంచే ఎన్డీయేలో చేరి మిత్రపక్షంగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలను.. అధినేతలు చంద్రబాబు, పవన్‌లను దూరంగా పెడుతుందా..? అంటే తాజా పరిణామాలు చూస్తే ఇదే నిజం అని ఎందుకో అనిపిస్తోంది. అందుకే కూటమిలో ఏదో తేడా కొడుతోంది అని ఇప్పుడు టీడీపీ వర్గాల నుంచి ఒకింత సమాచారం అందుతోంది. దీనికి ఒకటా రెండా చాలా కారణాలే ఉన్నాయ్..!!
ఏం నడుస్తోంది..!
బీజేపీలో పెద్ద తలకాయగా ఉన్న అమిత్ షా ఇటీవల తిరుమల ఏడుకొండల వెంకన్న దర్శనానికి విచ్చేసిన సంగతి తెలిసిందే. ఐతే.. అంత పెద్ద అగ్రనేత ఏపీకి వస్తున్నారు అంటే మిత్రపక్షాలు ఎంత హడావుడి చేయాలి.. కానీ ఎందుకో ఇదంతా కనిపించలేదు. ఇవన్నీ దేవుడెరుగు కనీసం పుష్పగుచ్చం ఇవ్వడానికి ఇరువురి అధినేతల్లో ఒక్కరూ వెళ్ళలేదు. పోనీ తిరుపతి కానీ చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ, జనసేన నేతలు ఐనా ఎక్కడైనా కనిపించారా అంటే అబ్బే అస్సలు లేదు. పోనీ.. దేవుడి దర్శనానికి వచ్చారు ఇది రాజకీయం చేయడం ఎందుకు అంటారా..? దర్శనం తర్వాత కనీసం పోలింగ్ ఎలా జరిగింది..? ఎన్ని సీట్లు గెలిచే పరిస్థితి ఉంది..? కౌంటింగ్ రోజున ఎలా ఉండాలి..? ఏం చేద్దాం..? భవిష్యత్ కార్యాచరణ ఏంటి..? అని కనీసం చంద్రబాబు, పవన్, పురందేశ్వరిలను తిరుపతి పిలిపించి లేదా.. వీడియో అదీ కాకపోతే టెలికమ్యూనికేషన్ ద్వారా ఐనా మాట్లాడలేదు. దీంతో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తల్లో ఎక్కడలేని అనుమానాలు వస్తున్నాయి. మరోవైపు.. చంద్రబాబు, పవన్, పురందేశ్వరిలు అడిగినా అపాయింట్మెంట్ ఇవ్వలేదని చర్చ జరుగుతోంది.
మొదటి నుంచే తేడా..!
ఇదిలా ఉంటే.. పోనీ ఎంతసేపు చంద్రబాబు టీడీపీ నేతలతో సమావేశం అవుతున్నారే తప్ప ఎక్కడా ఇందులో జనసేన కానీ, బీజేపీని కానీ కలుగచేసుకొనివ్వలేదు. అసలు కూటమి కట్టి పోటీ చేశామనే విషయం మరిచిపోయి చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు అనే అనుమానాలు కలుగకమానలేదు. రేపో మాపో చంద్రబాబు.. పవన్ ఇద్దరూ భేటీ కాబోతున్నారు కానీ బీజేపీ నుంచి అధ్యక్షురాలు పురందేశ్వరికి కూడా కనీసం పిలుపు రాలేదు. దీంతో ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో గట్టిగానే తేడా కొడుతోంది అనేది అర్థం అవుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి మేనిఫెస్టో రిలీజ్ మొదలుకుని మొన్నటికి మొన్న ప్రచార సభల్లో కూడా ఎక్కడా చంద్రబాబుకి అనుకూలంగా ప్రధాని మోదీ, షా కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఇది జగమెరిగిన సత్యమే.
ఇందుకేనా..?
ఇప్పటికే ఇండియా కూటమిలోకి రావాలని చంద్రబాబుకు ఆహ్వానం వచ్చిందని ప్రచారం సైతం జరుగుతోంది. ఏడు దశల్లో సాగిన ఎన్నికల్లో ఈసారి జాతీయ స్ధాయిలో ఇండియా కూటమికీ, ఎన్డీయేకూ మధ్య హోరాహోరీగానే పోరు సాగినట్లు పలు అంచనాలు వెలువడుతున్నాయి. దీనికి తోడు ఎన్డీయే కూటమికి విజయ అవకాశాలు తక్కువగా ఉన్నాయని కొన్ని సర్వేలు కూడా తేల్చేసాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి అజాత శత్రువుగా ఉన్న బాబు ఇండియా కూటమికి మద్దతు ఇచ్చే ఛాన్స్ ఉందని కొందరు చెబుతున్న మాట. కూటమి ఏపీలో అధికారంలోకి వచ్చే అవకాశం లేకపోవడంతో ఇండియాలోకి వెళ్ళడానికి బాబు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. ఇవన్నీ లీక్ కావడంతోనే కూటమిలో గ్యాప్ వచ్చిందన్నది మరికొందరు నేతలు చెబుతున్న మాట. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. జూన్ నాలుగో తారీఖున రాబోతున్న ఫలితాలను బట్టి పరిస్థితి ఏమిటనేది తెలుస్తుంది.