ప్చ్.. బాపూ.. కారు కనిపించట్లేదే!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో అయినా రాణిస్తుందనుకుంటే సారు కారు బొక్క బోర్లాపడి కోలుకోలేని రీతిలో దెబ్బతింది. బహుశా ఇప్పట్లో ఆ దెబ్బలకు పంచర్లు వేయడం, అన్నీ సెట్ రైట్ చేసి షెడ్ నుంచి రోడ్డు మీదికి తీసుకురావడం ఇప్పట్లో అయ్యే పనికాదని.. దీనంతటికీ తక్కువలో తక్కువ నాలుగేళ్లు అయినా పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అసలు తెలంగాణలో బీఆర్ఎస్ ఉందా..? అన్నట్లుగా ఎవరు అడిగినా సమాధానం చెబుతున్నారంటే పరిస్థితి ఎక్కడ్నుంచి ఎక్కడికెళ్లిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇంతకీ ఇంత సీన్ దేనికి..? కారు పార్టీకి ఏమైంది..? అనే కదా మీ సందేహం ఇంకెందుకు ఆలస్యం ఈ స్పెషల్ స్టోరీ చదివితే అసలు సంగతేంటో మీకే అర్థమవుతుంది..!
ఏం జరిగింది..?
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో పరువు నిలబెట్టుకోవాలని చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసింది. ఓ వైపు కేసీఆర్.. ఇంకోవైపు కేటీఆర్.. మరోవైపు హరీష్ రావులు రంగంలోకి దిగి భగీరథ ప్రయత్నాలే చేశారు. కారును జాకీలేసి మరీ లేపడానికి యత్నించారు కానీ.. అబ్బే అస్సలు అవ్వలేదు. ఈ జాకీలు ఎంతమేరకు పనిచేశాయన్నది జూన్-01తో తేలిపోయింది. రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు మే-13న పోలింగ్ జరగ్గా ఇవాళ ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. అయితే ఇందులో ఒక్కటంటే ఒక్క సర్వే కూడా ఒక్కటికి మించి గెలవదని చెప్పడం గమనార్హం. అయితే ఒక్క న్యూస్-18 మాత్రం 02-05 వరకూ గెలవచ్చని చెప్పింది. ఇంకొన్ని సర్వేలు జీరో అని చెప్పడం ఎంత విచిత్రమే కదా. అదీ కూడా కేవలం పార్లమెంట్ పోరు కాంగ్రెస్-బీజేపీ మధ్యే జరిగిందని చెప్పడం చూశారా అలా ఉంది పరిస్థితి. ఇక కాంగ్రెస్ అయితే.. 06-09 సీట్ల వరకూ గెలవచ్చని.. బీజేపీ తక్కువలో తక్కువ 08-12 స్థానాల్లో జెండా ఎగరేయబోతోందని సర్వేలు తేల్చేశాయి. ఇక హైదరాబాద్ మాత్రం ఎంఐఎందేనని.. అసదుద్దీన్ ఓవైసీపీ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని తేలిపోయింది.
బాపూ ఏడీ చాణక్యుడు!
తెలంగాణ బాపుగా, తెలంగాణ జాతిపిత అని ముద్దుగా పిలుచుకునే బీఆర్ఎస్ శ్రేణులు సైతం ఏమైంది బాపూ.. తమరి రాజకీయ చాణక్యం అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. అయితే మరికొందరేమో గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస.. అని పెద్ద పెద్ద డైలాగ్సే చెబుతున్నారు. ఇంకొందరైతే ఇల్లు అలకగానే పెళ్లయిపోలేదు కదా.. ముందుంది ముసళ్ల పండగ అంటూ బీఆర్ఎస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఆరా మస్తాన్ లాంటి ప్రముఖ సర్వే సంస్థ అయితే ఏకంగా బీజేపీకి మొదటి స్థానం, కాంగ్రెస్‌కు రెండో స్థానం.. బీఆర్ఎస్‌కు మూడోస్థానం ఇవ్వడం గమనార్హం. ఈ ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. ఇవి ఎగ్జిట్ ఫలితాలు మాత్రమేనని ఎగ్జాక్ట్ ఫలితాలు జూన్-04న రాబోతున్నాయని అప్పుడు మాట్లాడుకుందామని చెప్పారు. కేసీఆర్ పోరాటంతో పదేళ్ల క్రితం తెలంగాణ స్వరాష్ట్రం వచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. చూశారుగా.. ఇదీ పరిస్థితి. సో.. ఎగ్జిట్ పోల్స్‌ను కాకుండా ఎగ్జాట్ పోల్స్ వచ్చే వరకూ వేచి చూద్దాం.. కారు పరిస్థితి ఎలాఉంటుందో చూద్దాం..!