అవును.. అనుకున్నట్లే ఆరా సర్వేలో వైసీపీ గెలిచింది. అయితే.. ఇన్నాళ్లు వైనాట్ 175 అన్న వైసీపీకి కేవలం 94-104 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే గెలుస్తుందని ఆరా మస్తాన్ తేల్చేశారు. ఇక టీడీపీకి మాత్రం 71-81 వరకూ అసెంబ్లీ స్థానాలు రావొచ్చని జోస్యం చెప్పారు. ఇంతవరకూ అంతా ఓకేగానీ ఊహించని వ్యక్తులంతా ఘోర పరాజయాన్ని చవిచూడబోతున్నారని ఈ సర్వేలో చెప్పడం గమనార్హం. మరీ ముఖ్యంగా.. ఇన్నాళ్లు కుప్పం కొడుతున్నాం.. కూసాలు కదులుతాయ్ అని తెగ హడావుడి చేసిన వైసీపీకి ఊహించని భారీ మెజార్టీతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు గెలుస్తారని మస్తాన్ చెప్పేశారు. ఇక.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వం.. గేటు కూడా తాకనివ్వం అని చెప్పిన వైసీపీకి పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. అయితే.. ఈ మాటలు అన్న మంత్రి, నగరి ఎమ్మెల్యే రోజా ఘోరాతి ఘోరంగా ఓటమిపాలవుతున్నారని ఆరా మస్తాన్ చెప్పేశారు. ఇవన్నీ అటుంచితే.. హాట్ సీట్ అయిన మంగళగిరిలో ఈసారి నారా లోకేష్ తొలిసారి గెలవబోతున్నారని.. అది కూడా భారీ మెజార్టీతో అని మస్తాన్ కుండ బద్ధలు కొట్టారు.
మంత్రులు ఔట్..!
ఇక మంత్రుల విషయానికొస్తే.. ఎంతమంది గెలుస్తారన్నది వేళ్ల మీద మాత్రమే చెప్పేయొచ్చని ఆరా సర్వేలో తేలింది. రోజా, జోగి రమేష్, అంబటి రాంబాబు, విడదల రజని, ఆదిమూలపు సురేష్ ఇలా చాలా మందే ఈసారి ఘోరంగా ఓడిపోబోతున్నారని మస్తాన్ చెప్పారు. ఇక భారీ మెజార్టీతో గెలిచే ఏకైక మంత్రి మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమేనని ఈ సర్వేలో తేలింది. మొత్తమ్మీద చూస్తే.. కేవలం 2 శాతం ఓట్ల తేడాతో వైసీపీ గెలుస్తుందని చెప్పేశారు. వైసీపీని తిరిగి ఎన్నుకునేందుకు రాష్ట్రంలో 56 శాతం మంది మహిళలు ఓటు వేశారని.. మహిళల్లో 42 శాతం మంది మాత్రమే కూటమి వైపు మొగ్గు చూపారన్నారు. పురుషుల్లో వైసీపీకి 45.35 శాతం, 51.56 శాతం మంది కూటమికి ఓటు వేశారని ఆరా మస్తాన్ తేల్చిచెప్పారు. ఇక మునుపటితో పోలిస్తే.. బీసీల్లో కూడా వైసీపీ గణనీయ ఓటు బ్యాంకును సంపాదించుకుందని ఆరా మస్తాన్ క్లియర్ కట్‌గా చెప్పేశారు.
ఆరా మాత్రమే..!
తెలుగు రాష్ట్రాల్లో ఆరా వైసీపీ గెలుస్తుందని చెప్పగా.. కొన్ని సర్వేలు దాదాపు కూటమి గెలుస్తుందని చెప్పడం గమనార్హం. అయితే ఇందులో నమ్మదగిన.. అస్సలు నమ్మలేని సంస్థలు, కూడా చాలానే ఉన్నాయి. ఇక WRAP Survey లో.. 4 నుంచి 17 పార్లమెంట్, 158 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ, జన్‌మత్ పోల్స్ 95 నుంచి103 స్థానాల్లో వైసీపీకి అనుకూలంగా రాగా.. ఇక మిగిలిన సర్వేలన్నీ కూటమికే మొగ్గు చూపాయి. ఈ మొత్తమ్మీద చూస్తే.. అనుకున్నంత ఆషామాషీగా ఫలితాలు ఉండవని మాత్రం అర్థం చేసుకోవచ్చు. ఇక దేశ వ్యాప్తంగా చూస్తే.. మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారని.. ప్రముఖ మీడియా సంస్థలు, పేరుగాంచిన సర్వేలు తేల్చాయి. ఇక జూన్-04న అసలు సిసలైన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్నది తేలిపోనుంది. వేచి చూడాలి మరి.