ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్ ఎప్పుడెప్పుడు జరుగుతుందా..? అని వేయి కళ్ళతో ఎదురు చూసిన అభ్యర్థులు, అంతకు మించి ఓటర్లు, కార్యకర్తలకు ఆ రోజు రానే వచ్చేసింది. ఇంకో మూడంటే మూడు రోజుల్లోనే ఫలితాలు రాబోతున్నాయి. ఇక ఫలితాల విషయానికొస్తే జూన్ నాలుగో తేదీన ఉదయం ఫలితాలు మొదలై.. 11 నుంచి 12 గంటల మధ్యలో తొలి ఫలితం వెలువడనుంది. ఆ ఫలితం కూడా ఏపీ మంత్రి, ఫైర్ బ్రాండ్ రోజా జాతకమే. ఏపీ మొత్తం మీద నగరి నియోజకవర్గం ఫలితం తొలి ఫలితంగా రానుందని సమాచారం.
ఎందుకు ఇలా?
చిత్తూరు జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉండగా ఇందులో తొలి ఫలితం వెలువడేది నగరి నియోజకవర్గానిదే. ఈ ఏడు నియోజకవర్గాలతో పోలిస్తే నగరిలోనే ఓటర్ల సంఖ్య తక్కువ. నగరిలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,02,574 మాత్రమే. ఇక్కడ 229 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగ్గా.. కౌంటింగ్ రోజున 14 టేబుళ్లలో లెక్కింపు జరగనుంది. ఇక రౌండ్ల విషయానికి వస్తే.. 17 రౌండ్లలో ఫలితాలు రానున్నాయి. ఇంచు మించు 12 గంటలలోపే రోజా జాతకం తేలిపోనుంది. నగరి కౌంటింగ్ పూర్తి ఐతే.. జిల్లాలో తొలి ఫలితంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొదటిదే కానున్నది.
రోజా గెలుస్తారో లేదో..?
నగరి నియోజకవర్గం మునుపటిలా లేదు.. వైసీపీకి అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళంతా చివరి నిమిషంలో జెండా పీకేసి.. పసుపు కండువాలు కప్పుకున్నారు. పోతూ.. పోతూ రోజాపై కనీ ఎరుగని రీతిలో అభాండాలు వేసిపోయారు. రోజా టాక్స్ మొదలుకుని అవినీతి.. దందాలు అన్నీ బయట పెట్టారు. దీంతో ఎక్కడలేని నెగిటివ్ రోజాపై వచ్చింది. ఇది టీడీపీ నుంచి పోటీ చేసిన గాలి భాను ప్రకాష్ ఈసారి గట్టిగానే కష్టపడ్డారు. గత ఎన్నికల్లో కేవలం 2,708 ఓట్ల తేడాతో ఓడిపోయిన యువనేత ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని కష్టపడ్డారు. ఐతే రోజా మాత్రం అబ్బే అసెంబ్లీ సంగతి అటుంచితే.. అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వనని చెబుతున్నారు. ఇంత ధీమాగా ఉన్న రోజా గెలిచి హ్యాట్రిక్ కొడతారా..? లేకుంటే గాలి ఫ్యామిలీ భాను గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెడతారా..? అన్నది జూన్ నాలుగో తేదీన ఉదయమే తెలిపోనున్నది. లెట్స్ వెయిట్ అండ్ సీ..!