ఏబీ వెంకటేశ్వర రావు.. ఈ పేరు, మనిషి గుర్తున్నారా..? అదేనండీ టీడీపీ హయాంలో ఒక వెలుగు వెలిగిన అధికారి.. ఆ తర్వాత వైసీపీ వచ్చాక నానా ఇబ్బందులూ పెట్టీ ఆయన్ను ఎలాంటి పదవిలో లేకుండా చేసిన పరిస్థితి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదేళ్లు తనకు దక్కాల్సిన పదవి కోసం వేచి చూశారు. ఆఖరికి పోస్టింగ్ దక్కింది.. కానీ ఏం ఫలితం ఇవాళే పదవీ విరమణ చేయనున్నారు. ఐతే ఐదేళ్లు హైకోర్టు, ఏసీబీ కోర్టు, సీఐడి కోర్టు.. ఆఖరికి సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఎట్టకేలకు పోస్టింగ్ దక్కించుకుని సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది.
ఐదేళ్లకు పోస్టింగ్.. మళ్ళీ అదే!
ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఏబీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం నాడు ఏపీ హైకోర్టు ఉత్తర్వులు మేరకు వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్‌ను జగన్ ప్రభుత్వం ఎత్తివేసింది. ఐతే ఏదైనా కీలక పదవి దక్కుతుందని ఆశించినప్పటికి ఎలాంటి ప్రాధాన్యం లేని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇవ్వడం గమనార్హం. కాగా ఇదివరకే.. సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు తొలిసారి సస్పెన్షన్ ఎత్తివేసి ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐతే ఈసారి కూడా అదే పదవినే ప్రభుత్వం ఆయనకు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం ఏబీ వెంకటేశ్వరరావు ఛార్జ్ తీసుకోనున్నారు. ఐతే బ్యాడ్ లక్ ఏమిటంటే.. తిరిగి ఈ రోజు సాయంత్రమే పదవీ విరమణ కూడా చేయనున్నారు. చూసారా.. ఐదేళ్లుగా అలుపెరగని పోరాటం చేసిన ఆయన.. పదవీ విరమణ రోజే గెలవడం.. అదే రోజు రిటైర్డ్ అవ్వడం మామూలు విషయం కాదు.
ఇలాగైతే ఎలా..?
వాస్తవానికి జగన్ గురుంచి జనాలు, వైసీపీ నేతలు ఏదేదో అనుకుంటారు కానీ.. కక్ష సాధించడంలో ఆయన్ను మించినవారు ఉండరేమో? అన్నది రాజకీయ విశ్లేషకులు కొందరు చెబుతున్న మాట. ఇది ఇదిగో ఏబీ విషయంలో అక్షరాలా నిజమే అయ్యింది. ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా, బ్యూరోక్రాట్ అయినా సరే జగన్ టార్గెట్ చేస్తే విలవిలలాడి పోవాల్సిందేనని కళ్ళకు కట్టినట్లుగా ఈ ఘటన చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఏదైనా అధికారి తప్పుచేసి ఉంటే ఒకసారి రెండు సార్లు సస్పెండ్ చేస్తారు.. ఇంతకు మించి ఇవ్వాలంటే పనిష్మెంట్ ఇస్తారు.. కానీ ఒక డీజీ ర్యాంక్ అధికారి ఐదేళ్లూ పోస్టింగ్ లేకుండా, పైగా సస్పెన్షన్ కాలంలో పదవీ విరమణ చేయనుండడం దేశంలో ఇదే మొదటిసారి. ఐతే.. దీనికి కారణం 2014 చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీ.. నాడు వైసీపీ ఎమ్మెల్యేలు అధికార టీడీపీ వైపు మొగ్గు చూపేలా చేశారన్న అనుమానమే. మొత్తం 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్పించడంలో కర్త, కర్మ క్రియ అన్నీ ఏబీనే అని వైసీపీ గట్టిగా నమ్మింది.. అందుకే ఇక అధికారంలోకి వచ్చీ రాగానే టార్గెట్ చేసి.. ఈ పరిస్థితికి తెచ్చింది.