తెలుగు రాష్ట్రాల్లో ఏం నడుస్తోంది..? ఎందుకీ రచ్చ..? రోజురోజుకూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఇలా తయారవుతున్నాయి ఏంటి..? అని యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు, జాతీయ మీడియా ఇటు చూస్తున్న పరిస్థితి. ఒకరిపై ఒకరు పగలు, ప్రతీకారాలు తీర్చుకోవడం.. గరహాలను తవ్వుకోవడం ఇవన్నీ మనం నిత్యం మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు బర్నింగ్ టాపిక్ గా ఏమున్నాయి.. జనాలు, ప్రభుత్వాలు ఏమనుకుంటున్నాయి..? రాజకీయ విశ్లేషకులు ఏం సూచిస్తున్నారు..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం వచ్చేయండి.
తెలంగాణ సంగతేంటి..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రీతిలో గెలిచి అధికారం దక్కించుకున్న కాంగ్రెస్.. ప్రభుత్వం ఏర్పాటు చేశాక ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి చేయాల్సిన పనులకంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ.. తప్పు ఒప్పులను తవ్వి తీస్తూ పబ్బం గడిపేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్.. రాష్ట్రంలో కొత్త బీర్లు, రాష్ట్ర చిహ్నం, గీతం.. తెలంగాణ అంటే టీఎస్ ఉండగా దాన్ని టీజీగా ఇలా ఒకటా రెండా లెక్కలేనన్ని మార్చేస్తూ.. రాష్ట్రం కోసం పోరాడి, పదేళ్లు అధికారంలో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆనవాళ్లు, చరిత్రలో ఎక్కడా పేరు లేకుండా ఉండాలని నిద్రాహారాలు మాని మరీ రేవంత్ రెడ్డి ఇదే పని మీద ఉన్నారనీ రాజకీయ విశ్లేషకులు, తెలంగాణ మేధావులు అభిప్రాయ పడుతున్నారు. కానీ ఇవన్నీ ఎన్నికలు ముందు.. ఆ తర్వాత తప్ప మళ్ళీ ఎప్పుడూ కనిపించవు.. వినిపించవు అదీ తెలంగాణలో సంగతి. ఇక ప్రజలకు ఇచ్చిన హామీలు ఎప్పుడు నెరవేరుతాయి అనేది చూడాలి.
ఏపీలో ఏం నడుస్తోంది..?
ఏపీలో అలా ఎన్నికలు జరిగాయో లేదో.. ఈవీయంలో అభ్యర్థి భవితవ్యం ఉండగానే గెలిచేశామని, ఊహించని రీతిలో దేశమే షాక్ అయ్యేలా ఫలితాలు ఉంటాయని వైసీపీ ప్రమాణ స్వీకారానికి కూడా ఏర్పాట్లు చేసేస్తోంది. ఇక మీడియా ముందుకు వచ్చి వైసీపీ నేతల మాటలు అంటారా అబ్బో కోటలు దాటిపోతున్నాయి. ఇక కూటమిలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ గెలవదని.. గెలిచేది రాష్ట్రాన్ని పరిపాలించేది కూటమియేనని.. ఓటమి అనేది కూటమి ఎరుగదని చెబుతున్న పరిస్థితి. విదేశాలకు వెల్లొచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు యధావిధిగా డ్యూటీలో జాయిన్ అయ్యారు. వచ్చీ రాగానే కౌంటింగ్ రోజున ఏం చేద్దాం..? ఎలా చేద్దాం అని ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వించడం జరిగింది. ఇన్నాళ్లు ఏపీ ఫలితాలపై మౌన వ్రతం పాటించిన చంద్రబాబు ఇప్పుడు నోరు తెరిచి వైసీపీ ఓడిపోతోంది.. ఓటమికి కారణాలు వెతుకుతోంది అని ఒక్క మాటతో విమర్శకులకు గట్టిగానే ఇచ్చి పడేశారు. ఇక దీంతో పాటు ఇదిగో ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు పిఠాపురంలో ఎవరు గెలుస్తారో.. ఓడేది ఎవరో తెలియక ముందే అబ్బో.. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుకా అని జనసేన.. హేయ్ మేమేం తక్కువ కాదని డిప్యూటీ సీఎం గారి తాలుకా అని వైసీపీ తెగ హడావుడి చేస్తున్నాయి. ఇదీ సంగతి.. చూశారు కదా తెలుగు రాష్ట్రాల్లో ఏం నడుస్తోందో.. జూన్ నాలుగో తేదీన ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది తెలిశాక కొన్నిటికి సమాధానం దొరుకుతుంది.. లెట్స్ వెయిట్ అండ్ సీ..!