ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు జూన్-04న రాబోతున్నాయి. ఇన్నిరోజులుగా నరాలు తెగే ఉత్కంఠతో ఉన్న అభ్యర్థులు.. అంతకుమించి ఓటేసిన కార్యకర్తలు, ఓటర్లు ఎప్పుడెప్పుడు ఫలితాలు వస్తాయా అని వేయికళ్లతో వేచి చూశారు.. ఫలితాలు రానే వస్తున్నాయి. కౌంటింగ్ రోజున ఏం చేయాలి..? అని వ్యూహాత్మకంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత నారా చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలతో కౌంటింగ్ డే నాడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిశితంగా చర్చించారు. ఇక వైసీపీ అయితే.. కౌంటింగ్‌కు వెళ్లే ఏజెంట్లు ఎవరూ రూల్స్ ఫాలో అవ్వనక్కర్లేదు.. అసలు మనకు రూల్స్ లేవబ్బా.. అక్కడికెళితే గొడవ పడేలానే ఉండాలి అన్నట్లుగా దిశానిర్దేశం చేసింది. స్వయానా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డే ఇలా మాట్లాడటంతో సొంత పార్టీ నేతలే ఒకింత కంగుతిన్న పరిస్థితి. ఒకవేళ ఇదే జరిగితే కౌంటింగ్ అనేది పలు నియోజకవర్గాల్లో ఆగిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే జనసేన కీలక నేత నాగబాబు ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశారు.
దయచేసి వద్దు..!
నాగబాబు రిలీజ్ చేసిన ఈ వీడియోలో కౌంటింగ్ రోజున ఎలా ఉండాలి..? తోటి ఏజెంట్లతో ఎలా ప్రవర్తించాలి..? అనే విషయాలపై జనసైనికులు, వీర మహిళలు, పార్టీ నేతలకు నిశితంగా వివరించారు. ముందుగా.. జనసైనికులకు, వీరమహిళలు, నాయకులు, పిఠాపురం జనసేన నేతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీఏ అధికారానికి చేరువలో ఉందని, వైసీపీ పరాజయం అంచుల్లో ఉందని జనసైనికులకు కీలక సలహాలు, సూచనలతో పాటు కొన్ని విజ్ఞప్తులు కూడా చేశారు. ఎప్పుడైతే మనిషి ఓడిపోతాడని తెలుస్తుందో అప్పుడిక ఎక్కడలేని ఫ్రస్టేషన్ ఉంటుందని.. ఆఖరికి హింస, గొడవలకు కూడా సిద్ధమవుతుంటారని మెగా బ్రదర్ చెప్పుకొచ్చారు. అందుకే.. ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి పోలీసులు, ఎన్నికల కమిషన్‌కు సహకరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
దయచేసి అర్థం చేసుకోండి!
వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దని.. దయచేసి అర్థం చేసుకోని వైసీపీని వదిలేయాలని జనసైనికులకు సూచించారు. ఈ సందర్భంగా ఓ సామెతను కూడా నాగబాబు గుర్తు చేశారు. ఏమీలేని ఆకు ఎగిరెగిరి పడుతుందని.. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుందని గుర్తు చేశారాయన. అందుకే మనమంతా సైలెంట్‌గానే ఉందామని.. ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం అని.. ప్రజాస్వామ్యానికి విరుద్దంగా ఏ ఒక్కరూ వ్యవహరించవద్దని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఈసీకి సహకరించి.. ప్రజాస్వామ్య స్పూర్తిని నిలబెడదామన్నారు. ఎలాగో.. రాబోయేది కూటమి ప్రభుత్వమే అని.. ఓడిపోయే వైసీపీకి అల్లర్లు, కవ్వింపు చర్యలకు ప్రతిస్పందన వద్దని పదేపదే నాగబాబు చెప్పుకొచ్చారు. చూశారుగా.. ఇదీ ఎన్నికల ఫలితాల ముందు పార్టీల పరిస్థితి. కౌంటింగ్ రోజున ఎన్నెన్ని గొడవలు, రాద్ధాంతాలు జరుగుతాయో.. ప్రతిస్పందన ఎలా ఉంటుందో.. వేచి చూడాల్సిందే మరి.