దెబ్బకు వెనక్కి తగ్గిన రేవంత్!
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తన పేరు, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిన పనులన్నీ చరిత్రలో నిలిచిపోవాలని అనుకుంటున్నారో ఏమో తెలియట్లేదు కానీ.. ఈ క్రమంలో ఆయన వేసే ప్రతి అడుగు తప్పటడుగు గానే ఉంది. ముఖ్యంగా తెలంగాణ కొత్త లోగో (రాజముద్ర), తెలంగాణ గీతం మార్పు, తెలంగాణ తల్లి ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. వాస్తవానికి తెలంగాణ ప్రజల సెంటిమెంట్, ఆత్మగౌరవం అనేవి ఈ మూడింటితోనే ముడిపడి ఉన్నాయి. ఈ మూడూ బీఆర్ఎస్ హయాంలో.. కేసీఆర్ రూపొందించినవే. అయితే.. కేసీఆర్ ఆనవాళ్లు అస్సలు ఉండొద్దన్నది రేవంత్ భావన. అందుకే మార్పులు, చేర్పులు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే.. ఇదంతా రివర్స్ అయ్యింది. ఓ వైపు ప్రతిపక్షాలు, మరోవైపు ప్రజా సంఘాలు, ఓ వర్గం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడంతో రేవంత్ రాజముద్రపై దెబ్బకు వెనక్కి తగ్గారు.
ఇదీ అసలు సంగతి..
ఇప్పుడున్న లోగోను పూర్తిగా మార్చేసి కాకతీయ తోరణం, చార్మినార్ స్థానంలో అమరవీరుల స్థూపం పెట్టి రూపకల్పన చేయడం జరిగింది. ఇక చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైన మూడు సింహాలను లోగో పైభాగంగా పొందుపరచడం జరిగింది. ఈ లోగో దాదాపు ఫిక్స్ అయ్యింది. ఇదిగో ఇదే లోగోనంటూ లీకులు వదలడం జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా కొన్ని లోగోలు వైరల్ కూడా అవుతున్నాయి, మొత్తం 40 లోగోలు చేయగా.. ఒకటి ఫైనల్ అయ్యిందన్నది తాజా సమాచారం. అయితే.. ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ తీవ్ర వ్యతిరేకత రావడం, ధర్నాలు, నిరసనలకు దిగడం.. ఏ చార్మినార్‌ను అయితే లోగో నుంచి తొలగించారో అదే చార్మినార్ దగ్గర మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధర్నాకు దిగడం, భారీగా బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు తరలిరావడం జరిగింది.
వాయిదా పడిందిగా..!
అంతా ఓకే.. రెండ్రోజుల్లో లోగో ఆవిష్కరణ జరగాల్సి ఉండగా ఏమైందో జరిగిందో తెలియట్లేదు కానీ రాజముద్ర రిలీజ్ వాయిదా పడింది. జూన్-02న కాకుండా మరో రోజున రిలీజ్ చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఇంకా లోగో ఫైనల్ కాకపోవడం, తుది దశలో ఉండటంతో వాయిదా వేసినట్లు తెలియవచ్చింది. దీంతో పాటు ఈ లోగోపై ఉన్నతాధికారులంతా సీఎంతో సంప్రదింపులు జరపాల్సి ఉందట. దీనికి తోడు లోగోపై ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లేందుకు కూడా సీఎం రేవంత్ నిర్ణయించినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. కొత్త లోగో అంశంలో ప్రజల నిర్ణయానికి అనుగుణంగా ముందుకు వెళ్లాలని సీఎం భావిస్తున్నారు. అయితే తెలంగాణ గీతం జయ జయహే తెలంగాణను మాత్రం రాష్ట్ర ఆవిర్భావం రోజే రిలీజ్ చేయనుంది సర్కార్. ఇప్పటికే ఈ లోగోపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రజలు ఏమంటారు..? రియాక్షన్ వచ్చాక లోగో వద్దంటే మునుపటి లోగోనే కంటిన్యూ చేస్తారా లేకుంటే అబ్బే సమస్యే లేదు.. తగ్గేదేలే అంటూ మొండికేసి ముందుకెళ్తారో అన్నది వేచి చూడాల్సిందే మరి.