ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసిందో లేదో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లిపోయారు. గన్నవరంలో ఫ్లైట్ ఎక్కిన జగన్ కుటుంబ సమేతంగా లండన్‌లో ప్రత్యక్షమయ్యారు. ఆయన అలా వెళ్లారో లేదో ఇక వైసీపీ నేతలు అంతా క్యూ కట్టేస్తున్నారు. అసలు నేతలంతా విదేశాలకు ఎందుకు వెళ్తున్నారు. కొంపదీసి ఏపీలో పార్టీ తీసేసి విదేశాల్లో పెడుతున్నారా ఏంటి..? అనే సందేహాలు వచ్చే పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడంతా విదేశాలు కేంద్రంగానే రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. వాస్తవానికి.. ఇంతలా పక్క రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో కూడా లేదు.
ఏం జరుగుతోంది..?
లండన్ వెళ్లిన వైఎస్ జగన్ జూన్-01న తిరిగి ఆంధ్రాకు రాబోతున్నారు. ఇక గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు.. తిరిగొస్తారా రారో కూడా తెలియని పరిస్థితి. విదేశాల్లోనే బిజినెస్ చేయబోతున్నారనే ప్రచారం గట్టిగానే జరుగుతోంది. ఫలితాలు అటు ఇటు తేడా కొడితే మాత్రం అమెరికానే గతి అని టీడీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ పెద్దాయనగా పేరుగాంచిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాపచుట్టేసి ఆఫ్రికా వెళ్లిపోయి బిజినెస్‌లు చూసుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. పనిలో పనిగా పుంగనూరు నుంచి తనకు కావాల్సిన మనుషులు.. యంత్రాలు, వాహనాలను తరలించడం లోలోపల జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. దెందలూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కూడా లండన్‌లోనే ఉన్నారు. వాస్తవానికి లండన్ వచ్చిన, వస్తున్న వారందరికీ షెల్టర్ ఈయనే ఇస్తున్నారన్నది టాక్.
సడన్‌గా ఎందుకిలా..?
ఇక ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సైతం లండన్‌లోనే మకాం వేశారు. ఈయన గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సుప్రీంకోర్టులో పేరు మోసిన న్యాయవాదులను ఢీకొట్టిన వ్యక్తి. టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతి కేసులను సీఐడీ తరఫున వాదించారు. వైసీపీ కార్యకర్తలతో, వీరాభిమానులతో మాట్లాడుతూ.. జగన్ డేంజర్‌లో ఉన్నారని మనమంతా అండగా ఉండాలని చెబుతూ బోరును ఏడ్చేశారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా కన్వినర్ సజ్జల భార్గవ్ రెడ్డి ఏమయ్యారో కూడా తెలియట్లేదు. పోలింగ్ తర్వాత అస్సలు యాక్టివ్‌గా లేరు. చూశారుగా.. ఇంత మంది లండన్, అమెరికాలో ఉండటంతో విదేశాల్లో ఏం జరుగుతోంది..? వైసీపీ చాప చుట్టేస్తోందని తెలిసే ఇలా వెళ్లిపోయారా..? అనే చర్చ మొదలైంది. జూన్-01, 02 తేదీల్లో వీరంతా తిరిగి రాకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో.. ఫలితాల తర్వాత ఏం జరుగుతుందో చూడాలి మరి.