కేసీఆర్ మెడకు ట్యాపింగ్ ఉచ్చు!
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు మెడకు ఉచ్చు బిగుస్తోంది.! ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్లుగా ప్రస్తుతం గులాబీ బాస్ పరిస్థితి ఉంది.! ఇందుకు కారణం ఫోన్ ట్యాపింగ్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా పెను సంచలన సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు అటు తిరిగి.. ఇటు తిరిగి కేసీఆర్ దగ్గరికే వచ్చి ఆగుతోంది. దీంతో సార్‌కు చిక్కులు తప్పేలా లేవని పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత ఊహించని పరిణామం జరిగినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకులు.. కొంతమంది బీఆర్ఎస్ పెద్దలు చెబుతున్న మాట. ఎందుకంటే.. పగ, కసి.. ప్రతీకారంతో ఉన్నోడు ఎప్పుడూ ఎప్పుడెప్పుడు సమయం వస్తుందా అని వేచి చూస్తారు కదా..! సరిగ్గా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఇదే సువర్ణావకాశం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పుకోవచ్చు.
కారుకు ఎన్ని కష్టాలో..?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చీరాగానే కేసీఆర్ చేసిన బాగోతాలు అన్నీ బయటపెడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలు మొదలుకుని ఫోన్ ట్యాపింగ్ వరకూ ఎక్కడ ఏ మాత్రం చాన్స్ ఉన్నా గులాబీ బాస్‌ను ఇరుకున పెట్టాలన్నది ప్రధాన టార్గెట్. లోక్‌సభ ఎన్నికల ముందు వరకూ కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఫోన్ ట్యాపింగ్‌పై మాటల యుద్ధమే నడిచింది. సీన్ కట్ చేస్తే.. అలా ఎన్నికలు అయిపోయాయో లేదో ఫోన్ ట్యాపింగ్ కేసు షురూ చేసేసింది సర్కార్. కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు వాంగ్మూలంతో షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో హడావుడి చేసిన వ్యక్తులు మొదలుకుని.. పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఏ ఒక్కరినీ వదలకుండా వారి ఫోన్లు ట్యాప్ చేసినట్లు నిగ్గు తేలింది. ఈ ఒక్కటే కాదండోయ్.. పార్టీల అధినేతలు, ముఖ్యనేతలు.. పార్టీలకు ఫండ్ ఇచ్చే వ్యాపారులు, పెద్ద తలకాయల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్లు రాధాకిషన్ తన వాంగ్మూలంలో కుండ బద్ధలు కొట్టేశారు.
ఇదీ బాస్ బాగోతం!
ఎన్నికల ముందు మన, తన పార్టీ అనేది లేకుండా రేవంత్ రెడ్డి మొదలుకుని సొంత పార్టీ నేతల వరకూ అందరి ఫోన్లు ట్యాప్ చేయించింది బీఆర్ఎస్ సర్కార్. ఆఖరికి రెండు ప్రధాన మీడియా సంస్థలకు చెందిన ఎండీల ఫోన్లు ట్యాపింగ్ చేయించడం గమనార్హం. అసలు మీడియాతో కేసీఆర్‌కు ఏం పని..? ఫోన్లు ట్యాప్ చేయించాల్సిన అవసరమేముంది..? అన్నది ఇప్పుడు అందర్నీ తొలుస్తున్న ప్రశ్న. కొన్ని టీవీ చానెళ్లు, ప్రధాన దినపత్రికలు కొన్ని.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా తయారవ్వడంతో అసలు వీరికి ఎవరు డైరెక్షన్ చేస్తున్నారు..? అసలు ఏం జరుగుతోందని తెలుసుకోవడానికి బహుశా ఫోన్లు ట్యాప్ చేయించారని ప్రచారం జరుగుతోంది. చూశారుగా రాజకీయ నేతలు మొదలుకుని మీడియా సంస్థల వరకూ ఈ ట్యాపింగ్ పాకిందంటే.. ఇక మీడియా అంత ఆషామాషీగా ఈ కేసును అస్సలు వదలదు.. ఇక రేవంత్‌పై కూడా ఒత్తిడి తెచ్చి మరీ కేసును తాడోపేడో తేల్చేస్తారు కూడా. సో.. దీన్ని బట్టి చూస్తే.. కేసీఆర్‌కు ఉచ్చు బిగిసినట్లే.. గడ్డు కాలమే వచ్చినట్లేనని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయినా తనను ముప్పు తిప్పులు పెట్టిన కేసీఆర్‌ను రేవంత్ అంత ఆషామాషీగా వదులుతారా.. ఏం జరుగుతుందో చూడాలి మరి.