టైటిల్ చూడగానే ఇదేంటి విచిత్రంగా ఉందనుకుంటున్నారా..? అవునబ్బా మీరు చదివింది నిజమే.. ఇప్పుడు కొన్ని ప్రధాన మీడియా సంస్థల్లో, సోషల్ మీడియాలో ఇదే చర్చ. పోనీ ఈ ఇద్దరు ఒకే పార్టీ కాదు కదా..? అచ్చెన్నాయుడు తెలుగుదేశం.. విడదల రజినీ వైసీపీ కదా అనే సందేహం వచ్చిందా..? అవును అదీ పాయింటే కదా..? ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానాలు దొరకాలంటే ఇంకెందుకు ఆలస్యం చకచకా ఈ ఆర్టికల్ చదివేయండి..!
అచ్చెన్నకు హోం..!
వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఇప్పుడు టీడీపీ నేతల్లో చాలా మందే బాధితులు ఉన్నారు. ఇందులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు తొలి స్థానమైతే.. తర్వాత అచ్చెన్నాయుడే!. ఈయన్ను జగన్ సర్కార్ ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే.. కూటమి అధికారంలోకి రాగానే అచ్చెన్నకు హోం శాఖ ఇవ్వాలని.. ఇదైతేనే ఆయనకు సరిగ్గా సరిపోతుందని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. ఒకవేళ అచ్చెన్నాయుడు వద్దంటే మాత్రం.. యువనేత నారా లోకేష్‌కే హోం శాఖ అని గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి అచ్చెన్నను కేబినెట్‌లోకి తీసుకుని టీడీపీ అధ్యక్షుడిగా లోకేష్‌కు పగ్గాలు ఇవ్వాలన్నది సీనియర్లు చెబుతున్న మాట. దీంతో ఈ ఇద్దరిలో ఎవరికి ఈ పదవి దక్కుతుందో అన్నది ఫలితాల తర్వాత.. అది కూడా కూటమి గెలిస్తే పరిస్థితేంటన్నది తేలిపోనుంది.
అవునా.. రజినీ!
వైసీపీ గెలిచి.. విడదల రజినీ గెలిస్తే మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో హోం శాఖ దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే వైసీపీలో పెద్ద తలకాయలైన సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డితో మాట్లాడి పైరవీలు నడిపిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు.. మార్గాని భరత్ కూడా రేసులో ఉన్నారని తెలియవచ్చింది. మొత్తానికి చూస్తే.. అటు టీడీపీ గెలిచినా, ఇటు వైసీపీ గెలిచినా హోం శాఖకు మాత్రం గట్టిగానే డిమాండ్ ఉంటుందని దీన్ని బట్టి చూస్తే అర్థమవుతోంది. మరి కూటమి గెలుస్తుందో.. వైసీపీ గెలుస్తుందో.. గెలిచాక ఈ హోం ఎవరికి దక్కుతుందో తెలియాలంటే జూన్-04 వరకు వేచి చూడక తప్పదు మరి.