అవును.. మేమంతా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ జనసైనికులు రచ్చ రచ్చ చేస్తున్నారు..! అదేంటి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు మాత్రమే జరిగాయి కదా.. ఫలితాలు ఇంకా రాలేదు కదా..? ఇప్పుడెందుకు ఇలా హడావుడి చేస్తున్నారనే సందేహం మీకు రావొచ్చు. అదీ పాయింటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించినప్పుడే గెలిచిపోయారని ఇక ఫలితాలు వచ్చి అధికారిక ప్రకటనే ఆలస్యమన్నది జనసేన కార్యకర్తలు, మెగాభిమానులు.. టీడీపీ, బీజేపీ శ్రేణులు చెబుతున్న మాట. అంతేకాదండోయ్ తక్కువలో తక్కువ లక్ష మెజార్టీ వస్తుందని కూడా స్థానిక నేతలు కొందరు జోస్యం చెబుతున్నారు. ఇక తన సీటు త్యాగం చేసిన వర్మ అయితే.. ఏ ఇంటర్వ్యూలో చూసినా అబ్బో ఆ ఎలివేషన్స్‌కు హద్దూ పద్దు అస్సలు లేకుండా పోతోంది.!
ఎక్కడ చూసినా ఇదే..!
ఆలూ లేదు.. చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అనే సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది కదా..! ఇప్పుడు జనసేన నేతలు, కార్యకర్తలు ఇస్తున్న ఎలివేషన్స్‌కు సరిగ్గా ఈ మాటలే గుర్తుకొస్తున్నాయని తెగ కౌంటర్లు ఇస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. ఎక్కడ చూసినా నేమ్ పేట్లు దర్శనమిస్తున్నాయి. కార్లు, బైక్‌లు, ఆటోలు.. ఇక కొందరు ఇళ్ల ముందు ఇలా ఒకటి కాదు రెండు కాదు సోషల్ మీడియా ఓపెన్ చేసినా.. పిఠాపురం వెళ్లినా సరే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే బోర్డులే కనిపిస్తుండటంతో జనాలంతా ఆశ్చర్యంగా తిలకిస్తున్న పరిస్థితి. నెట్టింట్లో కనిపిస్తున్న ఈ ఫొటోలపై బాబోయ్.. ఏ రేంజిలో పంచ్‌లు, సెటైర్లు పేలుతున్నాయో మాటల్లో చెప్పలేం. దీంతో జనసేన వర్సెస్ వైసీపీ కార్యకర్తలుగా ట్విట్టర్ వేదికగా తిట్టిపోసుకుంటున్నారు.
ఇందులో తప్పేంటి..?
నేతలను అభిమానించే ఎవరైనా తమ అభిమానాన్ని ఎలాగైనా చాటుకోవచ్చు.. అందులో తప్పేముంది. ఈసారి పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరుతారని, అసెంబ్లీలోకి అడుగుపెట్టి చూపిస్తారని గట్టి నమ్మకంతోనే అభిమానులు ఉన్నారు. అయితే.. అసెంబ్లీలోకి అడుగు కాదు కదా.. గేటు కూడా తాకనివ్వమని వైసీపీ శపథాలు చేస్తోంది. దీంతో మరో అడుగు ముందుకేసిన జనసైనికులు.. పవన్ గెలవడమే కాదు, కూటమి గెలిస్తే సీన్ వేరేలా ఉంటుందని, హోం శాఖ బాధ్యతలు స్వీకరించినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్పుకుంటున్న పరిస్థితి. ఒకవేళ పవన్ గెలవకపోతే.. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఏం చేసుకుంటారనే ప్రశ్నకు సైతం సమాధానాలు వస్తున్నాయి. పిఠాపురం ఎవరి తాలూకా..? ఇక్కడ్నుంచి గెలిచేదెవరు..? రాష్ట్రం మొత్తమ్మీద గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదెవరు..? అనేది తెలియాలంటే మరో వారం రోజులు వేచి చూడక తప్పదు మరి.