తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ ఎవరు..?
తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి.! ఊహించని రీతిలో గెలిచిన హస్తం పార్టీ త్వరలోనే అంతకు మించే లోక్ సభ స్థానాల్లో గెలవనుంది.. ఈ మాట సర్వే సంస్థలు తేల్చేశాయి. ప్రస్తుతం ఉన్నదల్లా బీజేపీ, కాంగ్రెస్ అన్నట్లుగానే రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అడ్రెస్స్ లేకుండా పోయిన బీఆర్ఎస్.. ఇప్పుడిక పార్లమెంట్ ఎన్నికల్లో పత్తా ఉండదన్నది కాంగ్రెస్ నేతలు జోస్యం చెబుతున్నారు. అందుకే.. జూన్ నాలుగో తారీఖు ఫలితాల తర్వాత ఇక పాలనపై పూర్తిగా దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అటు పార్టీ.. ఇటు సీఎం బాధ్యతలు అంటే అస్సలు అయ్యే పనే కాదు. అందుకే ఇక పీసీసీ అధ్యక్ష బాధ్యతలు వేరొకరికి కట్టబెట్టాలని ఢిల్లీలోని కాంగ్రెస్ హై కమాండ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
రేవంత్ ఉంటే ఏంటి..?
వాస్తవానికి పార్టీ, ప్రభుత్వ పరంగా అన్నీ నిర్ణయాలు ఒకరే తీసుకోవాలంటే అంత ఆషామాషీ కానే కాదు. పైగా.. రాష్ట్రాల్లో ఎక్కడేం జరిగినా నిమిషాల్లో వాలిపోవాలి.. తగు చర్యలు తీసుకోవాలి.. దీనికి తోడు ప్రతిపక్షాలను ఎదుర్కోవడం అంటే ఒక్క రేవంత్ వల్ల ఐతే కానే కాదు. పైగా.. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఒక్కో హామీ నెరవేర్చుకునే దిశగా అడుగులు వేయాలి. రానున్న లోకల్ బాడీ.. ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు లక్ష్యంగా పార్టీ పని చేయాలి. ఇవన్నీ ఇక్కడి వల్లే ఐతే అస్సలు కాదు గాక కాదు. అందుకే ఇక పీసీసీ చీఫ్ పదవి వేరొకరికి కట్టబెట్టాలని ఇటు రాష్ట్ర, కేంద్ర హై కమాండ్ ఒక నిర్ణయానికి వచ్చాయి. దీనికి తోడు రేవంత్ టెర్మ్ కూడా ఐపోవచ్చినది.
ఎవరికి ఇవ్వొచ్చు..?
ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ చేయాల్సి ఉంది. పనిలో పనిగా కొత్త పీసీసీ అధ్యక్షుడిని కూడా నియమించనున్నారు. ఈ రేసులో.. కట్టర్ కాంగ్రెస్ Vs జంపింగ్ నేతలు, ఇప్పుడు కేబినెట్ మంత్రులు ఉన్నారట. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. మధుయాష్కీ, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, చిన్నా రెడ్డి, జీవన్ రెడ్డి, వీ. హనుమంతు రావుతో పాటు చాలా మంది ఉన్నారట. ఐతే ఈ పేర్లు నిన్న, మొన్నటి వరకూ వినిపించగా.. తాజాగా మంత్రి సీతక్క పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఎందుకంటే.. ఈమె పేరునే హై కమాండ్ కు రేవంత్ రెకమెండ్ చేశారట. దీనికి తోడు.. గిరిజన మహిళకు పీసీసీ పగ్గాలు అప్పగించారనే సానుకూల ప్రభావం ఉంటుందని పార్టీ భావిస్తోంది అని తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడే వ్యక్తిగా.. రేవంత్, రాహుల్ గాంధీ వర్గం మనిషిగా సీతక్కకు మంచి పేరే ఉంది.
మళ్ళీ లడాయి తప్పదు..!
వాస్తవానికి.. రేవంత్ కాంగ్రెస్ కండువా కప్పుకున్న రోజు నుంచే ఈయన అంటే హస్తం పార్టీలో పుట్టి పెరిగిన కట్టర్ నేతలకు అస్సలు పడట్లేదు. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా అసంతృప్తి వెళ్లగక్కుతూనే ఉన్నారు. పార్టీలో చేర్చుకోవడమే ఒక ఎత్తయితే పీసీసీ ఇవ్వడంతో ఓ వర్గం జీర్ణించుకోలేక పోయింది. ఐతే తనపై పెద్దలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా గట్టిగానే కష్టపడి పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి తెచ్చారు రేవంత్. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అక్షరాలా నిజమే. అందుకే.. ఆయన్ను కాదనకుండా సీఎం పదవి కట్టబెట్టింది అధిష్ఠానం. ఇక్కడివరకు అంతా ఓకే కానీ ఇప్పుడైనా రేవంత్ వర్గానికి కాకుండా మునుపటి నుంచి కాంగ్రెస్ లోనే ఉన్న నేతలకు పీసీసీ ఇస్తే బాగుంటుందన్నది సీనియర్లు చెబుతున్న మాట. ఒకవేళ అలా కాని పక్షంలో కచ్చితంగా గొడవలు ఉంటాయ్.. మళ్ళీ సీన్ మొదటికి వచ్చినా ఆశ్చర్యపొనక్కర్లేదు. అంతే కాదు పెద్ద తలకాయలు కొన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలోకి జంప్ ఐనా కావొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ పీసీసీ పదవి.. కాంగ్రెస్ పార్టీకి పెద్ద అగ్ని పరీక్షే మరి. ఏం జరుగుతుందో చూడాలి మరి.