అవును.. హైదరాబాద్‌లో సామాన్యుడు మొదలుకుని సెలబ్రిటీ వరకూ సందర్భం ఏదైనా, వారం ఏదైనా సరే రెస్టారెంట్‌కు వెళ్లాల్సిందే.. కడుపునిండా లాగించాల్సిందే.! ఇంకొందరు ఐతే ఉదయం టిఫిన్ మొదలుకుని మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్‌తో సహా అన్నీ హోటల్లోనే కడుపు నిండా తినేస్తుంటారు. ఇదిగో ఇప్పుడు చెప్పబోయే విషయం మీకు క్లారిటీగా అర్థం ఐతే మాత్రం బుద్ధి ఉంటే హోటల్ ఫుడ్ తినలేవు. అప్పటికీ తింటే మీ ఆరోగ్యాన్ని.. చెబుతులా సర్వ నాశనం చేసుకున్నట్టే!. ఇంకెందుకు ఆలస్యం ఇక రండి ఆ లెక్కలేంటో చూసేద్దాం..!
ఇదీ సంగతి.. తస్మాత్ జాగ్రత్త!
హైదరాబాద్‌లో పేరుకే పెద్ద పెద్ద హోటళ్ళు.. ఒక్కటంటే ఒక్కటీ నాణ్యత పాటించేవి లేవు. ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహారం అస్సలు దొరకడం లేదు. ఒక్క హోటళ్ళు మాత్రమే కాదు ఫైవ్ స్టార్ ఫుడ్ కోర్టులు, ఐస్ క్రీమ్ పార్లర్లు, పేరుగాంచిన బేకరీలు ఒక్కటీ సక్రమంగా లేవు. పాడైపోయిన ఆహార పదార్థాలు వాడటమే కాకుండా ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగా పాటించడం లేదు. ఇటీవల అధికారులు చేసిన తనిఖీల్లో ఒళ్లు గగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాణ్యత లేని ఆహారం సరఫరా చేస్తూ వినియోగదారుల జేబు ఖాళీ చేయడంతో పాటు వారి ఆరోగ్యాన్ని సైతం నాశనం చేస్తున్నట్లు తేలింది.
ఇక్కడ తింటే డైరెక్టుగా..!
ఫుడ్ సెఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు కొన్ని హోటళ్ళు, బేకరి, ఐస్ క్రీమ్ పార్లర్ పేర్లతో సహా రిలీజ్ చేశాయి. క్రీమ్ స్టోన్, న్యాచురల్స్ ఐస్ క్రీమ్, కరాచీ బేకరీ, కేఎఫ్‌సీ, రోస్టరీ కాఫీ హౌస్, రాయలసీమ రుచులు, షా గౌస్, కామత్ హోటల్, 36 డౌన్ టౌన్ బ్రూ పబ్, మాకౌ కిచెన్ అండ్ బార్, ఎయిర్ లైవ్, టాకో బెల్, అహా దక్షిణ్, సిజ్జిలింగ్ జో, ఖాన్ సాబ్, హోటల్ సుఖ్ సాగర్, జంబో కింగ్ బర్గర్స్, రత్నదీప్ స్టోర్, కృతుంగ, రెస్ట్ ఓ బార్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ప్రముఖ హోటల్లలో పాడైపోయిన ఆహార పదార్థాలు వాడటమే కాకుంటే ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగా పాటించడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. రకరకాల ఫ్లేవర్లు కలుపుతూ కష్టమర్ల కడుపుకు ఫుడ్ బదులు పాయిజన్ పెడుతున్నారు. పురుగులు పడిన చికెన్‌ను ఫ్రై చికెన్‌గా, పాచిపోయిన చికెన్‌ను తందూరిగా చేసి.. మటన్, చేపలు, రొయ్యలు, రోటీ, ఐస్ క్రీములు ఇలా అన్నీ కల్తీ చేసి వినియోగదారులకు కడుపు నిండా పెడుతూ రోగాల బారిన పడేటట్లు చేస్తున్నారు హోటల్ యజమానులు. చూశారుగా.. ప్రజల ప్రాణాలతో రెస్టారెంట్లు ఎలా చెలగాటమాడుతున్నాయో.
ఇంత దారుణమా..?
పదులు కాదు వందల్లో రేట్లు పెట్టి ఆహారాన్ని అందిస్తున్న పేరున్న ఈ ఒక్క హోటల్, రెస్టారెంట్ అందుకు తగ్గట్లుగా ఆహార నాణ్యతను అందించడం లేదు. ఎంత దారుణం అంటే ఒక్కసారి ఫోటోలు చూస్తే మీకే అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా మాదాపూర్‌లోని రామేశ్వరం కేఫ్‌కి తినడానికి వెళ్తే ఇక తిరిగి రానక్కర్లేదు. ఎందుకంటే.. తనిఖీల్లో విస్తుపోయే విషయాలు బయటకి వచ్చాయి. గడువు ముగుసిన 100 కేజీల మినపప్పు, 10 కేజీల పెరుగు, 8 లీటర్ల పాలు రామేశ్వరం కేఫ్ తనికీల్లో బయట పడ్డాయి. అదేదో అంటారే.. రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం వదల లేదు అంటే ఇదేనేమో!. పోనీ ఏదైనా కూరగాయలు, లేదా తినడానికి ఏమైనా ఆహార పదార్థాలు బుక్ చేద్దామని పొరపాటున
బిగ్ బాస్కెట్ ఓపెన్ చేసి ఆర్డర్ పెట్టారో అంతే సంగతులు. మస్జీద్ బండ బిగ్ బాస్కెట్ వేర్‌హౌస్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయగా.. కాలం చెల్లిన ఐస్ క్రీమ్స్, పన్నీర్, ఆల్మండ్స్, చికెన్ మసాలా, చికెన్ సాసేజ్స్, పిజ్జా చీజ్ దొరకడం గమనార్హం. చూశారుగా.. ఇంత తెలిసిన తర్వాత కూడా ఇంకా బయట తినాల్సిందే.. ఏదైతే అది అయ్యింది అని అనుకుంటే మిమ్మల్ని కాదు కదా.. మీ ఆరోగ్యాన్ని కూడా దేవుడు కాపాడలేడు. అందుకే కాస్తో కూస్తో మంచి కూరగాయలు తెచ్చుకుని పచ్చి పులుసు ఐనా తినాలి కానీ బుద్ధి ఉంటే బయట తినొద్దు హైదరాబాద్ వాసీ..!!