ఏపీలో ఎన్నికలు మాత్రమే పూర్తయ్యాయి.. ఫలితాలకు ఈసారి గట్టిగానే గ్యాప్ వచ్చింది.! మే 13న ఎన్నికలు జరిగితే.. జూన్ 4న ఫలితాలు అంటే మామూలు విషయం కాదు. దీంతో పోటీ చేసిన అభ్యర్థుల్లో నరాలు కట్టయ్యేలా టెన్షన్ నెలకొంది. ఎంత మెజారిటీ వస్తుంది..? అని లెక్కలేసుకునే పనిలో కొందరు ఉండగా.. గెలిస్తే చాలు బాబోయ్ అని మరికొందరు అభ్యర్థులు ఉన్నారు. ఇక మీడియా, సోషల్ మీడియాలో ఐతే బాబోయ్.. రాసుకున్నోళ్లకి రాసుకున్నంత, చెప్పుకున్నోళ్లకి చెప్పుకున్నంతలా పరిస్థితి ఉంది.!
ఇక బెట్టింగ్ రాయుళ్ల గురించి అంటారా అబ్బో లెక్కేలేదు.. కాసుకున్నోళ్లకు కాసుకున్నంత! కాయ్ రాజా కాయ్ అంతే!.
ఎక్కడ చూసినా ఇదే చర్చ!
కూటమి ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తుందని టీడీపీ నేతలు.. అబ్బే సీట్లు తగ్గినా సరే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది వైసీపీనే అని వైజాగ్ వేదికగా ఏర్పాట్లు చేసి.. ముహూర్తం ఫిక్స్ చేసేసారు. సరిగ్గా ఈ సమయంలోనే నలుగురి మెజారిటిపై ఎక్కడ చూసినా పెద్ద ఎత్తునే చర్చే జరుగుతోంది. ఆ నలుగురు మరెవరో కాదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నారా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్. ఈ నలుగురికీ ఎంత మెజారిటీ వస్తుంది..? ఓడిపోయే పరిస్థితి అంటే ఎంత తక్కువ ఓట్లతో ఓడిపోవచ్చు..? అని చర్చించుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో ఐతే సీన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా.!
ఎవరికి ఎంత రావొచ్చు..!
పులివెందుల నుంచి పోటీ చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈసారి 90వేల నుంచి లక్ష ఓట్ల లోపు మెజారిటీ రావొచ్చని.. లేదంటే లక్షకన్నా ఎక్కువే రావచ్చని అంచనాలు వేస్తున్నారు. ఇదేమీ వైసీపీ నేతలు చెబుతున్న మాట కాదండోయ్.. టీడీపీ నేతలు చెబుతున్నదే. ఈ మెజారిటీ పైనే సుమారు వేల కోట్లల్లో బెట్టింగ్స్ జరిగాయి అంటే పులివెందులలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందులో వైఎస్ జగన్ రెడ్డిపై పోటీ చేసిన బిటెక్ రవి కూడా ఉన్నారన్నది వైసీపీ నేతలు చెబుతున్న మాట.
- ఇక కుప్పం నుంచి పోటీ చేసిన నారా చంద్రబాబు నాయుడు గెలిస్తే కేవలం 5వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారని రాజకీయ విశ్లేషకులు, తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. ఒకవేళ బాబు ఓడిపోయి.. వైసీపీ నుంచి పోటీ చేసిన భరత్ గెలిచే పరిస్థితి అంటే 500 నుంచి వెయ్యి ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. వాస్తవానికి ఈసారి కుప్పం కంచుకోటను బద్దలు కొట్టాలని శక్తికి మించి ప్రయత్నాలు చేసింది. పైగా కుప్పం ప్రజలు మార్పు కోరుకున్నారని.. దీనికితోడు భరత్ ను గెలిపిస్తే మంత్రిని చేస్తానని జగన్ చేసిన ప్రకటనతో ప్రజలు ఆలోచించి ఓటేశారని.. ఇప్పటికే చాలా చేశానని.. ఇకపై కూడా అబివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని భరత్, పెద్దిరెడ్డి పదే పదే చెప్పడంతో చివరి నిమిషంలో ప్రజలు మార్పు కోరుకున్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది.
- ఇక పిఠాపురం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వైసీపీ నుంచి పోటీ చేసిన వంగా గీతపై గెలిస్తే తక్కువలో తక్కువ 3 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారని నియోజక వర్గ ప్రజలు, రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. గీత గెలిస్తే వెయ్యి నుంచి.. 1500 మెజారిటీతో గెలవచ్చని తెలుస్తోంది. ఐతే.. ఇక్కడ ప్రజలు లోకల్ - నాన్ లోకల్ అని.. పవన్ గెలిస్తే పిఠాపురంలో ఎందుకు ఉంటారు..? హైదరాబాద్ వెళ్లి సమస్యలు చెప్పుకోవాలా అనే భావనతో గీతకే ఓట్లు గుద్దిపడేసారని స్థానికంగా జరుగుతున్న చర్చ. దీనికితోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో జగన్ ఫైనల్ టచ్ ఇస్తూ గీత్తమ్మను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పడంతో సీన్ మారిందని తెలుస్తోంది.
- ఇక చివరిగా.. మంగళగిరి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన యువనేత నారా లోకేష్ ఈసారి గెలిస్తే కేవలం 2 వేల ఓట్ల మెజారిటీతో గెలవచ్చు అని.. లేదంటే వరుసగా రెండోసారి ఓటమిపాలేనని రాజకీయ విశ్లేషకులు, వ్యూహకర్తలు చెబుతున్న మాట. ఇక లోకేష్ ఓడిపోతే మాత్రం తక్కువలో తక్కువ.. వైసీపీ నుంచి పోటీ చేసిన మురుగుడు లావణ్య 2 వేల నుంచి 2,500 మెజారిటీతో విజయం సాధిస్తారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో లోకేశ్‌పై గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి.. మరోవైపు చేనేత సామాజిక వర్గానికి చెందిన, సీనియర్ నాయకుడు గంజి చిరంజీవి కూడా వైసీపీలో ఉండటం కలిసొచ్చే అంశమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనికి తోడు మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావు కుటుంబీకురాలే కావడంతో ఈమె రాజకీయాలకు కొత్తేమీ కాదు. మంగళగిరిలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఓట్లు ఉన్న పద్మశాలి సామాజికవర్గానికి చెందిన మహిళ. అందుకే వైసీపీ వ్యూహాత్మకంగా ఆఖరి నిమిషంలో గంజి, ఆళ్ళను పక్కనెట్టీ మరీ మురుగుడు లావణ్యను ఇక్కడ పోటీలో నిలిపిందని సమాచారం.
చూశారుగా.. ఈ నలుగురి గురుంచి ఈ రేంజిలో చర్చ జరుగుతోంది.. ఫైనల్ గా ఎవరు గెలుస్తారు..? గెలిస్తే ఎంత మెజారిటీ..? ఓడిపోతే ఎలా..? ఎలాంటి పరిస్థితుల్లో ఓడిపోతారో జూన్ నాలుగో తేదీన చూద్దాం మరి.