ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు మాత్రమే పూర్తయ్యాయి.. ఫలితాలకు ఇంకా సమయం ఉండటంతో ఏం జరుగుతుందో ఏమో అని పోటీచేసిన అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఓ వైపు అనుకున్నంతగా ఓట్లు పడకపోవడం, నమ్మిన వాళ్లే నట్టేట ముంచడం.. మరోవైపు రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు, ప్రత్యర్థే గెలవబోతున్నారనే సర్వేలతో.. అభ్యర్థులకు నరాలు తెగిపోతున్నాయి. బాబోయ్.. ఈ టెన్షన్ భరించలేమంటూ విదేశాలకు వెళ్లిపోయిన వారున్నారు.. ఇతర రాష్ట్రాలకెళ్లి సేదతీరుతున్న వారూ ఉన్నారు. ఇక జూన్-04 ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్న క్యాండిడేట్లు ఉన్నారు. అయితే.. ఎన్నికల ఫలితాలపై అతిగా ఆలోచించిన గుడివాడ వైసీపీ అభ్యర్థి, ఫైర్ బ్రాండ్ కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. పోలింగ్ ఎలా జరిగింది..? ఏయే బూత్‌లో మనకు ఎక్కువ ఓట్లు పడ్డాయి..? ఏయే మండలాలు మనకు ఫేవర్‌గా ఉన్నాయి..? మెజార్టీ ఎంత రావొచ్చు..? అని నందివాడ మండలం నేతలతో మాట్లాడుతుండగా ఏమైందో సరిగ్గా తెలియట్లేదు కానీ ఒక్కసారిగా సోఫాలోనే కొడాలి నాని కుప్పకూలిపోయారు.
సెలైన్లు ఎక్కుతున్నాయ్!
నానికి ఇలా జరగడంతో వెంటనే అప్రమత్తమైన గన్‌మెన్లు, వైసీపీ నేతలు సపర్యలు చేశారు. అయినా నాని పరిస్థితి అదుపులోనికి రాకపోవడంతో హుటాహుటిన వైద్యులకు సమాచారం అందించి ఇంటికి పిలిపించారు. ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు, సెలైన్లు ఎక్కిస్తున్నారు. నాని.. అతిగా ఆలోచించడం వల్లే ఆరోగ్య సమస్యలు తలెత్తాయని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు.. ఇకపై తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు మరిన్ని తలెత్తవచ్చని గన్‌మెన్లకు వైద్యులు సూచించారు. అయితే.. ఎన్నికల తర్వాత ట్రిప్‌కు అని కుటుంబ సభ్యులంతా హైదరాబాద్ వెళ్లారు. విషయం తెలియడంతో ఉన్నఫలంగా హైదరాబాద్ నుంచి కొడాలి కుటుంబ సభ్యులు గుడివాడకు బయల్దేరారు. మరోవైపు.. నానికి ఏమైంది..? ఎందుకిలా జరిగిందని వైసీపీ శ్రేణులు, వీరాభిమానులు ఆందోళన చెందుతున్న పరిస్థితి.
ఏమైంది నానీ..?
వాస్తవానికి గత కొన్నిరోజులుగా నానికి ఆరోగ్యం అస్సలు సహకరించట్లేదు. అస్తమాను అనారోగ్యానికి గురవ్వడం.. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స, సర్జరీలు చేయించుకున్నప్పటికీ ఆరోగ్యం సెట్ అవ్వలేదు. ఎన్నికల సమయం కావడంతో విశ్రాంతి లేకుండా ప్రచారం, మీటింగ్స్, సభలు నిర్వహించిన నాని.. మరింత అలసిపోయారని అనుచరులు చెబుతున్నారు. అయితే.. ఎన్నికల్లో గెలుస్తారా లేదా అన్నదానిపై అతిగా ఆలోచించడంతోనే ఇలా జరిగిందని తెలుస్తోంది. ఎందుకంటే.. నాని పక్కాగా ఓడిపోతారని సర్వేలు, ప్రత్యర్థి టీడీపీ తరఫున వెనిగండ్ల రాము భారీ మెజార్టీతో గెలుస్తారనే చర్చ జరుగుతోంది. పైగా రాష్ట్రం మొత్తమ్మీద గుడివాడ, గన్నవరం మీద 43వేల కోట్లు బెట్టింగ్‌లు జరిగాయనే టాక్ నడుస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు బంపర్ మెజార్టీతో గెలుస్తారన్నది ఇన్‌సైడ్ సర్వేలు కూడా చెప్పేశాయ్. పైగా.. ఆఖరి నిమిషంలో ఓటర్లకు పంచాల్సిన డబ్బులు స్థానిక నేతలు పంచకుండా హ్యాండిచ్చేశారని ఈ మధ్యనే నాని తీవ్ర ఆవేదనకు లోనైనట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇవన్నీ అతిగా ఆలోచించిన నాని.. ఇలా అస్వస్థతకు లోనయ్యారన్నది అనుచరులు చెప్పుకుంటున్నారు. కొడాలి త్వరగా కోలుకోవాలని వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు భగవంతుడ్ని ప్రార్థిస్తున్నారు.