ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరుతుందని ఆ పార్టీ నేతలు చెబుతుంటే.. అబ్బే అవన్నీ కాదు దేశం మొత్తం మనవైపు చూసేలా ఫలితాలు ఉంటాయని అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెలవిచ్చారు. సంక్షేమ పథకాలపైనే జగన్ రెడ్డికి గట్టి నమ్మకం ఉందట. ఇక పార్టీ గెలుస్తుంది అన్నది వైసీపీ నేతల నమ్మకం మనం ఎవరూ కాదనలేం.. ఒకవేళ ఓడితే పరిస్థితేంటి.. జగన్ కథేంటి..? అనేది ఇప్పుడు ఏపీ ప్రజలు, వైసీపీ శ్రేణులు, వీరాభిమానుల్లో చర్చ జరుగుతోంది. అస్సలు అంత సీన్ లేనే లేదని తక్కువలో తక్కువ అన్నా 90 నుంచి 110 వరకూ వస్తాయని మరికొందరు వైసీపీ నేతలు చెబుతున్న మాట.
వదిలే ప్రసక్తే లేదా..?
వైసీపీ ఓడితే జగన్ ఏమవుతారు..? అసలు ఆంధ్రాలో ఉంటారా..? రాజకీయాలు వదిలేసి విదేశాల్లోనే సెటిల్ అవుతారా..? అని చిత్ర విచిత్రాలుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పైత్యం ప్రదర్శిస్తున్న పరిస్థితి. ఒకవేళ ఏపీలో ఉంటే మాత్రం అంత ఆషామాషీ కాదని జగన్ కచ్చితంగా మళ్ళీ కటకటాల్లోకి వెళ్తారని మరికొందరు జోస్యం చెబుతున్నారు. ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, అవినీతి అనే మచ్చలేని చంద్రుడు.. అదేనబ్బా చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో పెట్టడాన్ని నాటి నుంచి నేటి వరకూ టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ రివెంజ్ ఉంటుందని.. చంద్రబాబులో మారిన మనిషిని చూస్తారని, ఒకవేళ బాబు లైట్ తీసుకున్నా నారా లోకేష్ అస్సలు వదలరని జగన్ రెడ్డిని ఏడిపించి ఏడు చెరువుల నీళ్ళు తాపనిదే ఊరుకోరు అని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు.
ఓడితే.. సారొస్తారా!!
పగలు, ప్రతీకారాలు అటు ఉంచితే జగన్ మళ్ళీ సీఎం కాకపోతే అసెంబ్లీలో అడుగుపెడతరా..? పోనీ శాసనసభకు వచ్చి టీడీపీ, బీజేపీ, జనసేనని తట్టుకోగలరా..? అనేది వైసీపీ ఊహకే వదిలేస్తున్నమని కొందరు టీడీపీ వీరాభిమానులు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. ఒక్క జగన్ రెడ్డిని మాత్రమే కాదు టీడీపీని, చంద్రబాబును టార్గెట్ చేసిన నేతలు, అధికారులను సైతం వదలమని.. లోకేష్ రాసిన రెడ్ బుక్ తెరిచి మరీ వేట మొదలు పెడతారట. ఈ పరిస్థితుల్లో జగన్ అసెంబ్లీకి వస్తారా.. రారా..? అని కూడా బెటింగ్స్ నడుస్తున్నాయి అంటే అర్థం చేసుకోండి. ఐతే వైసీపీ శ్రేణులు మాత్రం ఓటమి.. వైసీపీకా అస్సలు ఛాన్స్ అనేదే లేదు అని చెప్పుకుంటున్నారు.
కొత్తేమీ కాదుగా..?
పోనీ వైసీపీకి ఓటమి అనేది కొత్తా.. ప్రతిపక్షంలో ఉండటం కొత్తా అంటే అదేమీ లేదు కదా! గతంతో పోలిస్తే పరిస్థితులు పూర్తిగా మారి ఉండొచ్చు.. రివెంజ్ రాజకీయాలు కచ్చితంగా ఉండొచ్చు అంత మాత్రాన పార్టీని, ప్రతిపక్షనేత హోదా.. ప్రజలను వదిలేసి ఇంట్లోనో.. వ్యాపారాలకో పరిమితం అవుతారా అంటే అస్సలు అవ్వదని వైసీపీ నేతలు చెబుతున్న మాట. కచ్చితంగా కూటమి ఇచ్చిన హామీలు నెరవేరే వరకూ అందరి మెడలు వంచి.. ప్రజల కోసం అనుక్షణం నిలబడతారని పార్టీ నేతలు, కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే పార్టీ పెట్టినప్పుడు జీరోతో మొదలైంది.. అనతి కాలంలోనే 151 ఎమ్మెల్యేలను గెలిపించుకొని దేశంలో మునుపెన్నడూ జరగని రీతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జగన్.. కేసులు, జైలు, పగలు, ప్రతీకారాలు ఎన్నో ఎన్నెన్నో చూసిన జగన్.. ఇప్పుడు భయపడతాడు అని అనుకుంటే అంతకు మించి పొరపాటు, అమాయకత్వం మరొకటి ఉండదు అని వైసీపీ సీనియర్లు చెబుతున్న మాటలు. 2019 లో పాదయాత్ర చేసినట్టుగా.. 2029కి కూడా ఏదో ఒకటి గట్టిగానే ప్లాన్ చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చేవరకూ నిద్రపోరు ఇది అక్షరాలా జరుగుతుందని.. వైసీపీ వీరాభిమానులు చెబుతున్నారు. చూశారుగా.. జనం అంటే జగన్.. జగన్ అంటే జనంగా ఇన్నాళ్లు ఉన్న వైసీపీ అధినేత ఏమవుతారో.. ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి మరి.