యాదాద్రి, మే 22: అందమైన, అరుదైన, పవిత్రమైన శ్రీలక్ష్మీ నృసింహ భగవానుని వర్ణభరిత చిత్రాలతో, నరసింహస్వామి మహావిర్భావ రమణీయఘట్టంతో ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధికారిక మాసపత్రిక పూర్వ సంపాదకులు, శ్రీశైల దేవస్థానం ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అమోఘ రచనా సంకలనంగా విశేష రచనతో అందించిన ‘ఉగ్రం ... వీరం’ (Ugram Veeram) గ్రంధాన్ని యాదాద్రి మహాపుణ్యక్షేత్ర ఉత్సవాల ప్రత్యేక వేదికపై స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మరియు కార్యనిర్వహణాధికారి ఏ. భాస్కరరావు (Yadadri EO A. Bhaskar Rao) మంగళవారం సాయంకాలం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ... జన్మాన్తర సంస్కారం, విశేష పుణ్యఫలం ఉంటేనే మహా నృసింహ క్షేత్రమైన యాదాద్రిలో ఇలాంటి గ్రంధం ఆవిష్కరించే భాగ్యం కలుగుతుందని పారవశ్యంతో చెప్పి తొలిప్రతిని ప్రముఖ గాయకులు, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ఫౌండర్ చైర్మన్ కొమండూరి రామాచారి (Komanduri Ramachary)కి అందజేశారు.
గ్రంథ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) మాట్లాడుతూ.. యాదాద్రి మట్టిని తాకినప్పుడు కలిగే అనుభూతి ఒక ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, అభయాన్నిస్తుందని పేర్కొన్నారు.
ఈ శ్రీకార్యానికి యాదాద్రి మహాక్షేత్ర (Yadadri Temple) ప్రధాన అర్చకులు నల్లంతీగల్ లక్ష్మీనరసింహాచార్యులు మంగళాశాసనం చేశారు. ‘ఉగ్రం.. వీరం’ దివ్యగ్రంధాన్ని దేవస్థానం ఉప కార్యనిర్వహణాధికారి దోర్బల భాస్కరశర్మ పరిచయం చేశారు.
లక్ష పుష్పార్చనలో పాల్గొన్న భక్తులకు, సహస్ర కలశాభిషేకంలో పాల్గొన్న దంపతులకు, వివిధ ప్రత్యేక దర్శనాల్లో పాల్గొన్న భక్తులకు, దాతలకు ఈ మహత్తర గ్రంధాన్ని ఆలయ సిబ్బంది ఉచితంగా అందజేయడం విశేషం. యాదాద్రిలో ఇంతటి మహోజ్వల గ్రంధం ఈ ఉత్సవాల్లో ఆవిష్కరించబడటం శ్రీ లక్ష్మీనృసింహుని పరిపూర్ణకటాక్షమని దేవస్థాన మరొక ప్రధాన ఆచార్యులు కాండూరి వెంకటాచార్యులు పేర్కొన్నది మంగళసత్యం.
ఈ గ్రంథ నిర్మాణంలో నిస్వార్ధంగా, అంకితభావంతో లక్ష్మీ నృసింహునికి అక్షరసేవగా ప్రచురణాభాగ్యం పొందిన ఆంధ్రప్రదేశ్ పూర్వ ఐ. టి. శాఖామంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) , శ్రీమతి పొన్నాల అరుణాదేవి దంపతులకు భక్త బృందాలు కృతజ్ఞతలు ప్రకటించడం విశేషం.
విమర్శల్ని విసిరి కొడుతూ... వీసమెత్తు స్వార్ధం లేకుండా ఇంతటి మహాకార్యాన్ని ఇన్ని ఊళ్లకు, ఇన్ని గుళ్లకు, ఇన్ని కళా సంస్థలకు అందించే శ్రీకార్యాన్ని మోస్తున్న అద్భుత వక్త , ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ వెనుక వున్న దైవబలానికి, అకుంఠిత దీక్షాదక్షతలకూ నమస్కరించాల్సిదేనంటున్నారు రసజ్ఞులైన విజ్ఞులు.
యాదాద్రి, కదిరి, వేదాద్రి, సింహాచలం, ధర్మపురి, మంగళగిరి, అంతర్వేది, చేర్యాల, బీదర్, కోరుకొండ, ఆగిరిపల్లి, ఫణిగిరి... ఇలా ఎన్నో మహా నారసింహ క్షేత్రాలన్నీ శ్రీ నృసింహ జయంతితో స్వాతి నక్షత్ర మంగళవేళ పరవశిస్తున్న సందర్భంలో... యాదాద్రి ఉత్సవ సంరంభాల రెండవరోజున ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ పరమాద్భుత గ్రంధం ‘ఉగ్రం వీరం’ను ఆవిష్కరించడం అద్భుతఘట్టంగా యాదాద్రి అర్చక పండిత వర్గాలు అభినందనల మంగళాశాసనాలు వర్షిస్తున్నాయి. ఈ అక్షర యజ్ఞకార్యంలో ఈఈ దయాకర రెడ్డి, మహీపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (Gnana Maha Yagna Kendram)