అవును.. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరారయ్యారు..! ఆయనతో పాటు సోదరుడు వెంకట్రామిరెడ్డి కూడా అడ్రస్ లేకుండా వెళ్లిపోయారు.! ఏపీలో పోలింగ్ రోజున మాచర్లలో ఎలాంటి విధ్వంసాలు జరిగాయన్నది అందరికీ తెలిసిందే. ఆ మరుసటి రోజు ఒక్కటే గొడవలు.. దీంతో పల్నాడు పాత రోజులు అందరికీ గుర్తొచ్చాయి. ఇక పాయింట్‌కు వచ్చేస్తే.. మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలంలోని పాల్వాయి గేటులో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుండగా.. టీడీపీ వర్సెస్ వైసీపీ ఏజెంట్లుగా పరిస్థితులు మారాయి. దీంతో ఒక్కసారిగా వైసీపీ ఏజెంట్లపై దాడిచేసి బయటికి తరిమేసిన పరిస్థితి. అనంతరం రిగ్గింగ్ కూడా చేసుకున్నారన్నది వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. దీంతో రంగంలోకి దిగిన పిన్నెల్లి అండ్ కో తమ నిజస్వరూపం బయటపెట్టారు. పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఈవీఎంను స్వయంగా ధ్వంసం చేశారు పిన్నెల్లి. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూసింది.
సినిమా రేంజ్‌లో..!
వెబ్ కాస్టింగ్ చేయడంతో ఈ వీడియో బయటికి వచ్చింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎన్నికల కమిషన్.. ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నారు..? ఎందుకు కేసు నమోదు చేయలేదు..? ఇంతవరకూ అరెస్ట్ చేయకుండా ఎందుకున్నారు..? అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాపై కన్నెర్రజేసింది. అంతేకాదు తాఖీదులు సైతం ఇచ్చింది. దీంతో డీజీపీ, పోలీసులను అలర్ట్ చేసిన సీఈవో.. వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ఇక ఇక్కడే మొదలైంది సినిమా.. పిన్నెల్లి పారిపోవడం, పోలీసులు వెంబడించడం అలా మాచర్ల నుంచి ముంబై-హైదరాబాద్ హైవే వరికి చేజింగ్ జరిగింది. ఆఖరికి సంగారెడ్డి జిల్లా కంది వద్ద కారు మారిన పిన్నెల్లి బ్రదర్స్ ఎక్కడికో పారిపోయారు. ముందస్తుగా ఫోన్లు ట్రేస్ చేస్తే దొరికిపోతామని కారులోనే వదిలి పరారయ్యారు. దీంతో పిన్నెల్లి కారు డ్రైవర్‌ను అదుపులోనికి తీసుకున్న పోలీసులు పలు బృందాలుగా విడిపోయి బ్రదర్స్ ఇద్దరి కోసం విస్తృుతంగా గాలిస్తున్నారు.
లుకౌట్ నోటీసులు..!
ఇప్పటికే ఒకటి రెండుసార్లు పరారైన పిన్నెల్లి బ్రదర్స్.. ఇప్పుడిక విదేశాలకు పారిపోయే ప్రమాదముందని పసిగట్టిన పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఒకటి కాదు రెండు కాదు.. మొత్తం 3చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లి మీద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ, ఆర్పీ, పీడీపీపీ చట్టాల పరిధిలో సెక్షన్ల నమోదు చేయడం జరిగింది. IPC కింద 143, 147, 448 427, 353, 452, 120 B సెక్షన్లతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు. మొత్తానికి చూస్తే.. తప్పుచేసిన పిన్నెల్లిని అస్సలు వదిలిపెట్టకూడదని అటు కేంద్ర.. ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం గట్టిగానే ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు పిన్నెల్లి ముందు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి అరెస్ట్ చేయకుండా కోర్టు నుంచి అనుమతి లేదా.. ముందస్తు బెయిల్.. ఈ రెండూ కాకుండా అరెస్ట్ అయ్యి.. బెయిల్‌పై బయటికి రావడమే మిగిలుంది. ఇంత హడావుడి చేస్తూ.. పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్న పిన్నెల్లిని అంత సామాన్యంగా ఖాకీలు వదులుతారేమో చూడాలి మరి.