ఆంధ్ర ప్రదేశ్ ని ఏపీ-తెలంగాణాలుగా విభజించిన తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు. ఏపీ, తెలంగాణల్లో ఎవరికి వారే ప్రభుత్వాలు ఏర్పాటు చేసారు. అప్పట్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణాకి పని చేసారు. అక్కడ ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఏపీకి రాజధానిగా అమరావతి అంటూ గుంటూరు-విజయవాడ మధ్యన రాజధాని ని ఏర్పాటు చేస్తున్నామంటూ చెప్పారు. దానికి అప్పటి ప్రతి పక్షం వైసీపీ ఓకె చెప్పింది. పీఎం మోడీ మట్టి, నీళ్ళు ఇచ్చి సై అన్నారు.
చంద్రబాబు అమరావతి రాజధానిగా పరిపాలన స్టార్ట్ చేసారు. అక్కడ భూముల రేట్లు పెరిగిపోయాయి అంతా బాగానే ఉంది. కానీ 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయారు. అప్పుడు గెలిచి ముఖ్యమంత్రి అయిన జగన్ మోహన్ రెడ్డి పరిపాలన అమరావతి నుంచి అంటే హైదరాబాద్ లాగే ఒక్కచోటే అభివృద్ధి కేంద్రీకృతమై ఉంటుంది అంటూ ఏపీకి మూడు రాజధానుల నాటకానికి తెరలేపారు.
విశాఖ, కర్నూల్, అమరావతి ఈ మూడు చోట్ల నుంచి ఏపీ రాజధానులుంటాయని చెప్పారు. గత నాలుగేళ్లుగా జగన్ అదే పాట పాడుతూ పబ్బం గడుపుతూ తాడేపల్లి నుంచి పరిపాలన కొనసాగించాడు. వైజాగ్ లో పరిపాలన చేసింది లేదు. అమరావతి రైతులు నెత్తి నోరు కొట్టుకుంటూ ఉద్యమాలు చేసారు.
సరే ఎవరు ఎంత మంచి చేసారో.. ప్రజలని ఎలా మభ్యపెట్టారో.. అదంతా పక్కనపెడితే.. ఇప్పుడు ఈ ఎన్నికల్లో చంద్రబాబు అమరావతి రాజధాని ఐడియా గెలుస్తుందా.. లేదంటే జగన్ మూడు రాజధానుల ఐడియా గెలుస్తుందా అనేది తేలిపోతుంది. ప్రజలు ఏ రాజధానిని కోరుకుంటున్నారు, చంద్రబాబు ఐడియా కి ఓటేశారా.. లేదంటే మూడు రాజధానులకి తెర లేపిన జగన్ ఐడియాకి ఓటేసారా అనేది మరికొద్దిరోజుల్లో తేలిపోనుంది.