ఎన్టీఆర్‌ను ముంచేస్తున్న టీడీపీ ముప్పు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ పేరు పలికినా, ఎవరినోట విన్నా అభిమానులకు ఏదో తెలియని ఊపు వచ్చేస్తుంటుంది.! అబ్బా.. అభిమానులు అంటే బుడ్డోడికి ఉన్నట్లు ఉండలబ్బా అని చర్చించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయ్.! ఎందుకంటే.. తనను అభిమానించే, ఆరాధించే ఫ్యాన్స్‌ను అంతే రీతిలోనే జూనియర్ కూడా ప్రేమిస్తుంటారు!. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఫాన్ ఇండియా క్రేజ్ వచ్చేయడంతో ఇక మనల్ని ఎవడ్రా ఆపేదన్నట్లుగా అభిమానులు చెప్పుకుంటూ వస్తున్నారు.! ఇటీవల బుడ్డోడి బర్త్ డే రోజున సినీ, రాజకీయ ప్రముఖులు ఏ రేంజిలో శుభాకాంక్షలు చెప్పారో సోషల్ మీడియాలో మనందరం చూశాం కదా.! ఇక సినిమాలు కాసేపు అటుంచి.. రాజకీయాల్లోకి వచ్చేద్దాం.! అన్నగారు అచ్చుగుద్దినట్లుగా చిన్న ఎన్టీఆర్‌లో దిగిపోయారని కొందరు కార్యకర్తలు, అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. ఇక యంగ్ టైగర్ కూడా పార్టీకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పిలుపు వస్తే చాలు వాలిపోతానని చెప్పారు కూడా. కానీ ఎందుకో ఈ మాట మీద నిలబడలేదన్నది ఇప్పుడు నడుస్తున్న వాదన.
ఎన్ని.. ఎన్ని సార్.. ఎక్కడున్నావ్!
ఎన్ని.. ఎన్ని.. ఎన్ని సార్ అంటూ ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమా డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. ఇప్పుడు రియల్ లైఫ్‌లోనూ యంగ్ టైగర్‌కు ఇదే వర్తిస్తుంది. ఎందుకంటే.. టీడీపీకి ఈయన అవసరం వచ్చింది.. పోయింది కూడా.! ఒకటా రెండా చెప్పుకోవడానికి లెక్కలేనన్ని సందర్భాలున్నాయ్.. కానీ ఎక్కడా బుడ్డోడు కనిపించలేదు.. కనీసం మాట కూడా వినిపించలేదు.! నిండు సభలో మేనత్త నారా భువనేశ్వరిని ఘోరంగా అవమానించి మాట్లాడినా.. పొల్లెత్తి మాట మాట్లాడలేదు. ఎన్టీఆర్ యూనివర్శిటి పేరు మార్చినా స్పందన అంతంత మాత్రమే. ఇక టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు అయితే ఏకంగా దేశాన్ని వదిలి సైమా అవార్డులకు హాజరైన పరిస్థితి. పోనీ.. అన్నగారు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు అయినా హాజరయ్యారా..? అంటే అదీ లేదు. పోనీ.. ఎన్టీఆర్ స్మారకార్థం 100 రూపాయిల నాణేన్ని విడుదల చేసే కార్యక్రమానికి అయినా హాజరయ్యారా అంటే ఆ ఊసే లేదు. ఇప్పుడు చెప్పండి నిజంగా ఎన్టీఆర్ ఈ విషయాల్లో దేనికి స్పందిస్తే పోయేదేముంది..? కానీ ఎక్కడా ఎన్టీఆర్ లేడు..!
ఇందుకే రగిలిపోతోంది!
ఎన్టీఆర్ అంటే.. టీడీపీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు, ఆఖరికి సొంత వీరాభిమానుల్లో కొందరికీ అస్సలు పడట్లేదు. మరీ ముఖ్యంగా టీడీపీలోని ఓ వర్గం అయితే ఒంటి కాలిమీద లేస్తున్న పరిస్థితి. అవును.. కార్యకర్తల కోపాల్లో, విద్వేషాల్లో ఏ మాత్రం తప్పులేదన్నది రాజకీయ విశ్లేషకులు, తెలుగు తమ్ముళ్లు చెబుతున్న మాట. ఎందుకంటే.. పైన చెప్పిన సందర్భాల్లో ఎక్కడా ఆయన లేడు. పోనీ 2024 ఎన్నికలు టీడీపీకి డూ ఆర్ డై లాంటివి అయినా ఎక్కడైనా కనిపించారా కనీసం కార్యకర్తలకు దర్శనమిచ్చారా.. ఇవన్నీ కాదు ఒక్కటంటే ఒక్కటి పోస్టు గానీ, వీడియో కానీ పెట్టారా అంటే అదీ లేదు. ఇలాంటి వ్యక్తికి టీడీపీ అవసరమా..? అసలు రాజకీయాలు అవసరమా అన్నది సొంత కార్యకర్తలు, అభిమానుల వాదన. సోషల్ మీడియా వేదికగా అయితే చిత్ర విచిత్రాలుగా యంగ్ టైగర్‌పై రాసేస్తున్న వాళ్లూ ఉన్నారు.
అడుగు పెట్టగలరా..?
కష్ట కాలంలో మనతో ఉన్నోడే ఎప్పటికైనా మనోడు.. అవసరాలకు వాడుకుని వదిలేసేవాడు.. అవసరం ఉన్నప్పుడు ఆదుకోని వాడు మనోడు ఎందుకవుతాడు..? అస్సలు కానే కాడు.. కదా..! ఇప్పుడు ఇదే విషయాన్ని ఎన్టీఆర్‌కు ఆపాదించి టీడీపీ కార్యకర్తలు తిట్టేస్తున్నారు. అసలు ఎన్టీఆర్.. టీడీపీకి అక్కర్లేదు అనడానికి పైన చెప్పినవే కాదు.. ఇలాంటివి వెయ్యి కారణాలు చెప్పడానికి సిద్ధమయ్యారు కార్యకర్తలు. అసలు ఇంత చేసిన యంగ్ టైగర్‌కు రేపొద్దున్న టీడీపీలోకి అడుగుపెట్టే అర్హత ఉందా..? అంటే వందకు వెయ్యి శాతం లేనేలేదని తేల్చిచెప్పేస్తున్న పరిస్థితి. ఎందుకంటే.. అదిగో బుడ్డోడు వస్తే పార్టీకి పునర్‌వైభవం వస్తుంది..? ఎప్పటికైనా టీడీపీకి, నందమూరి ఫ్యామిలీకి వారసుడు ఎన్టీఆరే అని కొందరు డైలాగులు కొడుతుంటారు కదా అబ్బే అవన్నీ మాటలే.. ఆయనకు ఏ మాత్రం సూటవ్వవమని రియల్ లైఫ్‌లో అస్సలు పనికిరావని కొందరు అభిమానులు సైతం దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి. చూశారుగా.. ఏ రేంజ్‌లో ఎన్టీఆర్‌ను కొందరు ఫ్యాన్స్, కార్యకర్తలు ఆటాడేసుకుంటున్నారో..!
ఇద్దరీకి తప్పలేదు!
మొన్నటికి మొన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మెగా ఫ్యాన్స్ మధ్య రచ్చ ఎంతలా జరిగిందో అందరికీ తెలిసిందే. ఆఖరికి మెగా బ్రదర్ నాగబాబు కూడా ట్వీట్ చేసి.. మరింత ఆజ్యం పోసి ఆఖరికి పెద్దలెవరెవరో రంగంలోకి దిగి ఇద్దర్నీ ఒకటి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకానొక సందర్భంలో బన్నీ.. పుష్ప-02 సినిమా ఎలా రిలీజ్ చేస్తావో చూద్దాం అని మెగాభిమానులు సవాల్ చేసిన సందర్భం కూడా ఉంది. అంతలా అల్లు అర్జున్‌ను మెగా ఫ్యాన్స్ తగులుకున్నారు!. ఇక ఇప్పుడు యంగ్ టైగర్‌కూ అంతకుమించిన పరిస్థితే. టీడీపీ కార్యకర్తల్లో ఎన్టీఆర్ అంటే విధ్వేషం రగిలిపోతోంది.. ఇప్పట్లో ఈ అవరోధాలను తట్టుకుని, ముప్పు నుంచి బుడ్డోడు బయటపడే పరిణామాలు అయితే కనిపించట్లేదు. సమయం, సందర్భం లేకుండా.. రాజకీయాలకు దూరంగా ఉన్నా బర్నింగ్ టాపిక్ అయ్యే యంగ్ టైగర్ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటాడో.. ఏం చేస్తాడో వేచి చూడాలి మరి.