టైటిల్ చూడగానే ఇదేంటబ్బా.. అని అవాక్కయ్యారు కదూ..! అవును.. ఏపీలో ఎన్నికలకు ముందు, ఆ తర్వాత చిత్ర విచిత్రాలకు సోషల్ మీడియా వేదికవుతోంది. ఫలితాలకు ఇంకా సమయం ఉండగానే కొందరు కూటమికి చెందిన నేతలు, అభ్యర్థులు జంపింగ్‌కు సిద్ధమవుతున్నారని వార్తలు ఓ వైపు.. ఇంకొందరు అధికార పార్టీకి చెందిన కీలక నేతలు.. మంత్రి పదవులు అనుభవించిన వారు సైతం రాజీనామా రెడీ అవుతున్నారనే పుకార్లు ఇంకోవైపు బాబోయ్.. ట్విట్టర్ ఓపెన్ చేస్తే ఇదే గోల. ఇందులో భాగంగానే మంత్రి, వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణ రాజీనామా చేశారని ఓ లెటర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇంత దిగజారుడా..?
బొత్స.. విజయనగరం జిల్లాలో వైసీపీకి ఊపిరూదిన పెద్ద తలకాయ. కాంగ్రెస్‌ను కాదనుకొని వైసీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఆయనకు తగిన ప్రాధాన్యత ఇస్తూనే వస్తున్నారు వైఎస్ జగన్. అందుకే బొత్స కూడా అదేరీతిలో 2019 ఎన్నికల్లో జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసేశారు. దీంతో బొత్స అంటే విజయనగరం.. విజయనగరం అంటే బొత్స అన్నట్లుగా పేరు తెచ్చుకున్నారు. దీంతో అధికారంలోకి రాగానే కీలక శాఖను కట్టబెట్టి పెద్ద పీట కూడా వేశారు అధినేత. ఈసారి బొత్స కుటుంబానికి నాలుగు టికెట్లు ఇచ్చారు జగన్. దీంతో గెలుపుపై గట్టిగానే ధీమా వ్యక్తం చేశారు.. ప్రమాణ స్వీకారానికి కూడా డేట్ ఫిక్స్ చేశారు. అయితే.. ఇంత దూకుడు మీదున్న బొత్సకు బ్రేకులు వేయాలని కొందరు పనిగట్టుకుని మరీ వైసీపీకి బొత్స రాజీనామా అంటూ ఒక ఫేక్ లెటర్‌ను సృష్టించారు. ఇక అందులోని విషయాలు చూస్తే ఇంత పైత్యమా.. రోజురోజుకూ ఇంత దిగజారుతున్నారేంటి..? అనే సందేహాలు మీకూ వస్తాయ్.
బొత్సకు అవసరమేంటి..?
ఎన్నికల ఫలితాలు ముందే పసిగట్టినట్లుగా ఇక రాజీనామా చేస్తే పోతుందని బొత్స రాసినట్లుగా నెట్టింట్లో ఓ లేఖను ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు. ఇందులో గత ఐదు సంవత్సరాలుగా జగన్ విధ్వంసకర పాలనతో ప్రజలు తిరస్కరించారని.. ఘోర ఓటమికి జగనే కారణమని లేఖలో ఉంది. ఇదంతా బొత్స ప్రీ ప్లాన్డ్‌గా చేసుకున్నారని.. ఆయన రాజీనామాపై లేఖ సృష్టించాల్సిన అవసరం మాకేంటి అని జనసేన, టీడీపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. ఇక వైసీపీ కార్యకర్తలు అయితే డైరెక్టుగా బూతులే తిట్టేస్తున్న పరిస్థితి. ఇంత జరుగుతున్నా బొత్స నుంచి చిన్నపాటి క్లారిటీ కానీ.. సందేశం కానీ రాకపోవడం గమనార్హం. ఆయన రియాక్ట్ అయితే ఎలా ఉంటుందో చూడాలి మరి. సోషల్ మీడియా కాలం కదా ఎన్నయినా సృష్టించొచ్చు.. రచ్చ అంతకుమించి చర్చకు దారితీయొచ్చు మరి.