ఆలు లేదు, చూలు లేదు కాని కొడుకు పేరు సోమలింగం.. అనే సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది.. ఇప్పుడు ఏపీలో వైసీపీ నేతల వైఖరి చూస్తే అచ్చు గుద్ధినట్లుగా ఉంది. అదెలా అంటారా..?ఆంధ్రాలో ఎన్నికలు మాత్రమే అయ్యాయి.. ఇంకా ఫలితాలు రాలేదు కానీ మేం గెలిచేశాం అని ప్రమాణ స్వీకారానికి ముహూర్తాలు పెట్టేస్తున్న పరిస్థితి. ఆశకు.. ఊహకు కొంత మేర ఓకే కానీ శ్రుతి మించితే కష్టమే సుమీ. గెలుస్తాం అనే ధీమా ఉండొచ్చు అందులో ఎలాంటి తప్పు లేదు కానీ మరీ ఇంతలా అంటే ఒక్కోసారి సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు నమ్మని పరిస్థితి.
ఏం నడుస్తోంది!!
గెలిచేది మనమే.. దేశం మొత్తం మనవైపు చూసేలా ఫలితాలు ఉంటాయని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఐప్యాక్ టీంతో సమావేశంలో భాగంగా చెప్పిన సంగతి తెలిసిందే. అంతకు ముందే మంత్రి బొత్స సత్యారాయణ సైతం గెలుస్తున్నాం.. మళ్ళీ అధికారం మాదే అని గట్టిగా చెప్పారు. అంతేకాదు విశాఖ వేదికగా ప్రమాణ స్వీకారం ఉంటుందని కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఈ ప్రకటన నాటి నుంచి నేటి వరకూ పెద్ద చర్చకే దారి తీసింది. ఇప్పుడు జగన్ చిన్నాన్న, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మీడియా ముందుకు వచ్చి.. జూన్ 9న ఉదయం 09 గంటల 38 నిమిషాలకు విశాఖలో ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని.. డేట్, టైం, ప్లేస్ చెప్పడం గమనార్హం.
ఇదంతా దేనికి సంకేతం..?
వాస్తవానికి.. ఏ పార్టీ అయినా గెలుస్తుంది అని గట్టిగా నమ్మకం ఉన్నప్పుడు అన్నీ సైలెంట్ గానే పని కానిచ్చెస్తుంది.. అంతే కానీ నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు అదే హడావుడి ఉండదు. కానీ వైసీపీ నేతలు ఎందుకో ఒకరిని మించి మరొకరు మీడియా ముందుకు వచ్చి బాబోయ్ ఇక ఆపండి మహాప్రభో అన్నట్లుగా రచ్చ చేస్తున్నారు. అసలు ఇదంతా దేనికి సంకేతం అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. పోనీ ఈ విషయంలో టీడీపీ ఏమైనా తక్కువా అంటే అబ్బే అస్సలు కాదు అమరావతిలోనే చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేస్తారని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు.
అయ్యే పనేనా..?
వైసీపీ విషయానికి వస్తే..రేపు పొద్దున్న ఫలితాలు తిరగబడితే పరిస్థితి ఏంటి..? తిన్నగా కేంద్రంతో టీడీపీ కుమ్మక్కయి ఎన్నికల కమిషన్ ను కూటమి వైపు తిప్పుకుని ఓడించారని ఒక సాకును ముందే వెతుకున్నారనే టాక్ నడుస్తోంది. ఇక ఇప్పటికే ఏపీలో ఎన్ని కోట్ల అల్లర్లు జరిగాయో తెలిసిందే ఇవన్నీ ఒక బూచిగా చెప్పుకోవడానికి ఇలా ప్రీ ప్లాన్ ఏమైనా వైసీపీ చేస్తోందా..? గో బెల్ ప్రచారం చేస్తోందా అనే అనుమానాలు రాక తప్పట్లేదు. ఇవన్నీ కాదు కేడర్ లో మొదలైన ఆందోళనను ఇలా మాటలతో వైసీపీ నేతలు మాయ చేస్తున్నారా అనేది అర్థం కావట్లేదు. ఐతే ఇలా హడావుడి చేయడంలో టీడీపీ అస్సలు ముందుకు రావట్లేదు.. ఎందుకో డీలా పడిపోయింది. దీంతో వైసీపీ నేతలు మరింత రెచ్చిపోయి కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారని చెబుతున్న పరిస్థితి. మైండ్ గేమ్ ఆడటంలో వైసీపీ ఎప్పుడూ ముందు ఉండనే ఉంటుంది. ఏదైతేనేం వైసీపీ ఫిక్స్ చేసిన ముహూర్తానికి ఎవరు సీఎంగా ప్రమాణం చేస్తారో చూడాలి మరి.