ఏపీలో ఎన్నికలు మాత్రమే అయ్యాయి.. ఫలితాలు రావడానికి 13 రోజులు సమయం ఉంది. ఈ లోపే మేం గెలిచేశాం.. ఇక ఫలితాలు అధికారికంగా రావడం, ప్రమాణ స్వీకారం చేయడమే ఆలస్యం అన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోంది. ఆ పార్టీ నేతల్లో ఎవరి నోట విన్నా ప్రమాణ స్వీకారం మాటలే వస్తున్నాయ్. అందరిలా మనం ఎందుకు మాట్లాడాలి అని కొందరు ముహూర్తం ఫిక్స్ చేసి మాట్లాడుతుంటే.. ఇంకొందరు మాత్రం టైం, ప్లేస్ కూడా చెబుతూ తెగ హడావుడి చేస్తున్న పరిస్థితి. అదలా ఉంచితే.. కుప్పం నియోజకవర్గంలో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబును ఓడించడానికి మొదటి నుంచి విశ్వ ప్రయత్నాలే చేస్తోంది వైసీపీ.
ఇదీ అసలు సంగతి!!
టార్గెట్ కుప్పం.. టీడీపీ, చంద్రబాబు కంచుకోటను కూకటి వేళ్ళతో పెకిలించి వైసీపీ జెండా పాతాలని వ్యూహ, ప్రతివ్యూహాల్లో మునిగిపోయింది. మరీ ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా.. పెద్దాయనగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈ బాధ్యతలను హైకమాండ్ అప్పగించింది. దీనికి తోడు పెద్దిరెడ్డి.. చంద్రబాబు ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడకపోవడం, విద్యార్థి దశ నుంచే ఇద్దరి మధ్య గొడవలు ఉండటంతో ఇక చూస్కోండి.. ప్రతిదీ వ్యక్తిగతంగా తీసుకున్న ఆయన అస్సలు తగ్గలేదు. తన సొంత నియోజకవర్గం అయిన పుంగనూరును కూడా వదిలేసి.. కుప్పంపైనే స్పెషల్ ఫోకస్ పెట్టారు పెద్దిరెడ్డి.
పక్కా ప్లానింగ్!!
ఈ ఐదేళ్లు చేయాల్సిన పనులన్నీ చేస్తూ వచ్చారు. ఆఖరికి ప్రభుత్వ పథకాలు ప్రారంభించడానికి కూడా నేరుగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా రంగంలోకి దిగారు. ఇక కుప్పం నుంచి పోటీ చేసిన భరత్ కు ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం.. కాస్తో కూస్తో నియోజకవర్గ అభివృద్ధి చేయడంతో ఇక.. ఒక్కసారిగా వైసీపీకి బూమ్ వచ్చింది. ఇక ఎలాగో సోషల్ మీడియాను ఎలాగో వాడుకొని తిమ్మిని బమ్మిని చేసింది వైసీపీ. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీలో వైసీపీ గెలవడం కంటే చంద్రబాబును ఓడించడానికే సాయశక్తులా ప్రయత్నాలు చేసింది పార్టీ.
పైత్యమా.. ధీమానా!
ఎన్నికలు ఎలా జరిగాయి.. ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఓటేసిన కుప్పం ప్రజలకే క్లారిటీ లేదు కానీ వైసీపీ మాత్రం చంద్రబాబు పని ఐపోయింది.. అని పైత్యం ప్రదర్శిస్తోంది. ఐతే ఇది పక్కా అని రాసి పెట్టుకోవాలంటూ పెద్దిరెడ్డి, భరత్.. మరికొందరు వైసీపీ నేతలు చెబుతున్న మాట. ఇక వైసీపీ గ్రూపులు, సోషల్ మీడియాలో ఐతే బాబోయ్ ఒక రేంజిలో ఆడుకుంటున్నారు. ఇదిగో ఒక లుక్కేయండి. ఇంత బతుకు బతికి ఇంటెనక సచ్చినట్టు అయ్యింది విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు పరిస్థితి. మాటలు చూస్తే కోటలు దాటుతాయి కానీ.. ఆయన కోటకే కన్నంపడే రోజులు వచ్చేశాయి అని ఒక్కటే రచ్చ చేస్తున్నదీ వైసీపీ.
ఏమనుకోవాలి..?
అంతే కాదు.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 సంవత్సరాలు సీఎం, దేశంలో ప్రధాన మంత్రులను నిర్ణయించే స్థాయి నాది అని సొల్లు మాటలు చెప్పుకునే మనిషి సొంత ఊరికి బస్ స్టాండ్ కూడా కట్టడం చేతకాని దద్దమ్మ.. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో సొంత కొడుకుని గెలిపించుకోలేని అసమర్థ తండ్రి.. 7 సార్లు దొంగ ఓట్లతో గెలిచి అడ్డదారిలో అధికారం అనుభవించి ఆఖరికి అక్రమ పొత్తులు పెట్టుకున్నా కూడా ఇప్పుడు ఏకంగా కుప్పంలో ఒక కుర్రాడి చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయే దీనస్థితికి దిగజారిపోయి తన రాజకీయ జీవితానికి అంతిమ వీడ్కోలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు అని వైసీపీ చెప్పుకుంటోంది. అసలు వైసీపీ చేస్తున్న ఈ ప్రచారాన్ని ఏమనుకోవాలి.. ఇది నిజంగా జరుగుతుందా..? ఒకవేళ కుప్పంలో చంద్రబాబు గెలిస్తే ఇన్ని మాటలు అన్న వైసీపీ నాయకులు తలలు ఎక్కడ పెట్టుకుంటారో ఏంటో తెలియాలి మరి.