వల్లభనేని వంశీ.. ఈ ఫైర్ బ్రాండ్ గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకించి చెప్పడానికేమీ లేదు. ఈయన ఏ పార్టీలో ఉన్నా అపోజిషన్ పార్టీకి చుక్కలే.. ఇక ఆ పార్టీ అధినేతకు అంటారా అబ్బో ఇక మాటల్లో చెప్పలేం. టీడీపీలో పుట్టి పెరిగిన వంశీ.. పార్టీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్.. నారా భువనేశ్వరిలను ఎన్నెన్ని మాటలు అన్నారో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే పొరపాటున మీడియా ముందుకు వచ్చినా.. న్యూస్ పేపర్, టీవీల్లో ఏదైనా వ్యతిరేకంగా వార్త వస్తే మాత్రం ఇక ఒక్కటే బూతులు.. చెవుల్లో రక్తం కారేలా మాటలు ఉంటాయ్. అందుకే వంశీ గురించి వార్తలు రాయాలంటేనే ఒకటికి పదిసార్లు ఆలోచించి మరీ రాస్తుంటారు. అయితే తాజాగా ఓ వార్త మాత్రం ప్రధాన దినపత్రికలు, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ సంగతేంటో చూసేద్దాం రండి!
ఇదీ అసలు సంగతి!
2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గన్నవరం నుంచి గెలిచిన వంశీ.. కొద్దిరోజులకే రెబల్‌గా మారి వైసీపీకి మద్దతివ్వడం ఆ తర్వాత తిన్నింటి వాసాలు లెక్కెట్టడం ఇవన్నీ తెలిసినవే. ఇక 2024 ఎన్నికలు రావడం వైసీపీ అభ్యర్థి వంశీనేనని హైకమాండ్ ప్రకటించడం.. ఇక అప్పటి వరకూ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరడం మళ్లీ ఇద్దరూ ప్రత్యర్థులుగా మారి ఎన్నికలు ఎదుర్కొన్నారు. జూన్-04న ఫలితాలు రాబోతున్నాయి. ఈసారి వల్లభనేని గెలిచే అవకాశాలు ఏ మాత్రం లేవన్నది నియోజకవర్గంలో నడుస్తున్న చర్చ. గ్రామాలు మొదలుకుని మండలాల వరకూ వంశీకి వ్యతిరేకంగా ఓటేసిందన్నది స్థానికంగా నడుస్తున్న చర్చ. దీంతో ఓడిపోతామని సొంత పార్టీ నేతలే ఆయన్ను హెచ్చరించిన పరిస్థితట. అంతేకాదు.. కూటమి కూడా గెలిచే అవకాశాలు ఉండటంతో ఏం చేద్దాం అని ఆలోచనలో పడ్డారట.
ఇందులో నిజమెంత..?
వల్లభనేని వంశీ ఇటీవల అమెరికా వెళ్లారు. కొడుకు చదువుల కోసం అమెరికాలోని డల్లాస్ వెళ్లారన్నది అనుచరులు చెబుతున్న మాట. అయితే.. టీడీపీ నేతలు అబ్బే అదేం కాదు వల్లభనేని వంశీ ఓడిపోతారనే తెలుసుకునే అమెరికా వెళ్లారని.. ఇక తిరిగొచ్చే ఛాన్స్ లేనే లేదని ఆరోపిస్తున్న పరిస్థితి. ఇక శాశ్వతంగా అమెరికాలోనే ఉండిపోతారని అందుకే అక్కడికే వెళ్లారన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కొడుకు లేదు కాకరకాయ లేదని కూటమి అధికారంలోకి వస్తోందని.. వంశీ ఘోరంగా ఓడిపోతున్నారని తెలిసి అమెరికాలోని తన సన్నిహితులు, ఎన్నారై టీడీపీ నేతల ద్వారా తిరిగి తెలుగుదేశంలో చేరడానికి ప్రయత్నాలు షురూ చేశారని నెట్టింట్లో.. ప్రధాన దినపత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అయినా.. సొంతిటికి వస్తే తప్పేం ఉంటుందిలే..!. ఇది ఎంతవరకు నమ్మశక్యంగా ఉందో చూడాలి మరి. వాస్తవానికి పార్టీల అధిపతులు, పలువురు రాజకీయ ప్రముఖులు విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. మరి వాళ్లందరూ తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు రారా.. వచ్చి ఎవరి పనుల్లో వాళ్లు.. ఆయా పార్టీల్లో కొనసాగరా.. ఒక్క వంశీ విషయంలోనే ఇంత అత్యుత్సాహం.. హడావుడి ఎందుకో మరి.